Telangana Election: వాళ్ళిద్దరి మనసులు అతికేనా.. ఎడ ముఖం.. పెడ ముఖంతో ఉన్న ఉద్దండులు కలిసి కదిలేనా..?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెట్టారు గులాబీబాస్. అక్కడక్కడున్న వర్గపోరుకు చెక్ పెట్టేలా ట్రబుల్ షూటర్ హరీశ్‌రావును రంగంలోకి దింపారు. ముఖ్యంగా.. స్టేషన్‌ఘన్‌పూర్‌లో వాలిపోయి.. పంచాయితీ తీర్చేందుకు ప్రయత్నించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మెజారిటీ స్థానాల్లో BRS జెండా ఎగుర వేయడమే లక్ష్యంగా గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాలకు పదును పెట్టారు. అక్కడక్కడున్న వర్గపోరుకు చెక్ పెట్టేలా BRS పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్ రావును రంగంలోకి దింపారు. అసమ్మతి నేతలను దారి తెచ్చి ఎన్నికల ప్రచారంలో హోరెత్తించేలా ఫ్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా స్టేషన్‌ఘన్‌పూర్‌లో వాలిపోయి.. పంచాయితీ తీర్చేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ఇద్దరి మనసులు కలిసేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో దాదాపుగా బీఆర్ఎస్ కేడర్ కలిసి నడుస్తున్నారు. కానీ స్టేషన్ ఘన్‌పూర్‌లో మాత్రం ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. జనగామలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేస్తున్న రాజయ్య.. స్టేషన్ ఘనపూర్‌లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు రంగంలోకి దిగారు. ఇద్దరు సీనియర్ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు నేరుగా స్టేషన్ ఘన్‌పూర్‌లో ల్యాండవడం ఆసక్తిగా మారింది.
ప్రత్యేక హెలికాప్టర్‌లో స్టేషన్ ఘనపూర్‌కు చేరుకున్న మంత్రి హరీశ్‌రావు.. బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరిని వెంటబెట్టుకొని జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి రాజయ్య ఇంటికి వెళ్ళారు. రాజయ్యను బుజ్జగించి బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి తీసుకొచ్చారు. చాలా రోజుల తర్వాత రాజయ్య, కడియం శ్రీహరి ఒకే వేదికపై కనబడటంతో బీఆర్ఎస్ క్యాడర్ కేరింతలు కొట్టింది. ఇద్దర్నీ ఒకే వేదికపై కలిపిన హరీశ్‌రావు.. జొడెడ్లలా కలిసి నడిచి.. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమoత్రి చేయాలని కోరారు.
ప్రస్తుతం జనగామ ఇన్‌చార్జ్‌గా నియమించడంతో అక్కడ ప్రచారం చేస్తున్నాన్నారు తాటికొండ రాజయ్య. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇద్దరం కలిసి పనిచేస్తే స్టేషన్‌ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్‌కు తిరుగేలేదన్నారు ఆ పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి.
హరీశ్ రావు ఉన్నంత సేపు ఎడ మొఖం పెడ మొఖం తో ఉన్న ఈ ఇద్దరూ నేతలు యదావిధిగా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. దీంతో నియోకవర్గస్థాయిలో ఈ ఇద్దరి పై ఆసక్తి కరమైన చర్చ జరుగుతుంది. ఇద్దరూ కలిసి నడుస్తారా..! మళ్ళీ శరా మామూలే అన్నట్లు ఎప్పటిలాగే పాము ముంగిసలా కీచులాడుకుంటారా..? అనే చర్చ జరుగుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…