BRS Party: ‘కారు’ను పోలిన గుర్తులను లిస్టు నుంచి తొలగించండి.. కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వినతి..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అధికారపార్టీ బీఆర్ఎస్ స్పీడును పెంచింది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన భారత రాష్ట్ర సమితి చీఫ్ సీఎం కేసీఆర్.. ఎన్నికల వ్యూహాలకు పదునుపెట్టారు. గతంలో జరిగిన పరిణామాలను పరిగణలోకి తీసుకుని దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులకు ఎక్కువ ఓట్లు పోల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలాంటి గుర్తులపై పార్టీ నిర్ణయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అధికారపార్టీ బీఆర్ఎస్ స్పీడును పెంచింది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన భారత రాష్ట్ర సమితి చీఫ్ సీఎం కేసీఆర్.. ఎన్నికల వ్యూహాలకు పదునుపెట్టారు. గతంలో జరిగిన పరిణామాలను పరిగణలోకి తీసుకుని దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులకు ఎక్కువ ఓట్లు పోల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలాంటి గుర్తులపై పార్టీ నిర్ణయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు తమ పార్టీ ఎన్నికల గుర్తు ‘కారు’ను పోలిన గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్‌ఎస్ కోరింది. కారు గుర్తును పోలిన గుర్తులతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారని, తద్వారా తమకు రావాల్సిన ఓట్లు గల్లంతవుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో బీఆర్ఎస్ ఎంపీలు వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్.. ఎన్నికల గుర్తుల గందరగోళంపై ఈసీకి రెండు వినతి పత్రాలు అందజేశారు. గతంలో జరిగిన పరిణామాలను వివరించడంతోపాటు.. ఈ గుర్తులపై నిర్ణయం తీసుకోవాలంటూ ఈసీకి విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల్లో ఓ పార్టీకి రోడ్డు రోలర్ గుర్తును కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆ గుర్తును రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు. మరోవైపు, కారు గుర్తును పోలిన మరికొన్ని గుర్తులు ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్నాయని, వాటిలో ‘టోపీ’, ‘ఇస్త్రీ పెట్టె’, ట్రక్, ఆటో రిక్షా, రోడ్డు రోలర్ వంటివి కారు గుర్తుకు సారూప్యంగా ఉన్నాయంటూ ఎన్నికల సంఘం అధికారులకు తెలిపారు. గతంలో పలువురు ఓటర్లు రోడ్డు రోలర్ గుర్తును కారు గుర్తుగా పొరబడి ఓట్లు వేశారని, తద్వారా బీఆర్ఎస్‌కు దక్కాల్సిన ఓట్లు ఆ గుర్తుకు వెళ్లాయంటూ కొన్ని ఉదాహరణలతో బీఆర్‌ఎస్ నేతలు అధికారులకు వివరించారు.
ఈ క్రమంలో కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్, తదితర గుర్తులను కేటాయించడం ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్, 1968 లోని పారా 10(బీ) స్ఫూర్తికి విరుద్ధమంటూ బీఆర్ఎస్ పేర్కొన్నారు. బీఆర్ఎస్‌ను దెబ్బతీయాలన్న దురుద్దేశంతోనే రోడ్డు రోలర్ గుర్తును ఓ పార్టీ ఎంపిక చేసుకుందని ఓ వినతి పత్రంలో వెల్లడించారు. మరో వినతి పత్రంలో కారు గుర్తును పోలిన గుర్తుల జాబితాను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలంటూ బీఆర్‌ఎస్ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు.
గతంలో ఎన్నికల్లో జరిగిన పరిణామాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు బీఆర్ఎస్ నేతలు సుదీర్ఘంగా వివరించారు. ఎన్నికల్లో కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్ గుర్తు వల్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు నష్టం వాటిల్లుతోందని, ముఖ్యంగా వృద్ధ ఓటర్లు, చూపు సరిగాలేని ఓటర్లు ఈ గుర్తు విషయంలో గందరగోళానికి గురవుతున్నారని, చివరకు దానికి ఓటు వేస్తున్నారంటూ ఎంపీ వెంకటేశ్ నేత తెలిపారు.
అయితే, బీఆర్ఎస్ వినతిపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది..? మళ్లీ అలాంటి గుర్తులనే కేటాయిస్తుందా..? లేక మరేదైనా గుర్తులను సింబల్స్ జాబితాలో ఉంచుతుందా..? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..