Telangana: కుటుంబ సమేతంగా సీఎం రేవంత్‌ను కలిసిన BRS MLA
భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గతకొంతకాలంగా తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ సీఎంను కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోకవర్గాలుండగా.. భద్రాచలంలో మాత్రమే బీఆర్‌ఎస్ విజయం సాధించింది.
వీకెండ్ వచ్చిందంటే ఒక వికెట్ పడినట్టే అనుకోవాలా..! ఆదివారం వచ్చిందంటే క్రమం తప్పకుండా BRS నేతల్లో ఎవరో ఒకరు CM రేవంత్‌ను కలుస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది..! ఇవాళ సీఎం రేవంత్‌ను కలిశారు భద్రాచలం MLA తెల్లం వెంకట్రావు. మంత్రి పొంగులేటితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డిని కుటుంబ సమేతంగా కలిశారాయన.గత కొంతకాలంగా కాంగ్రెస్‌లో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లా నుంచి BRS గుర్తుపై గెలిచిన MLA వెంకట్రావే. ఆయన ఇప్పుడు CMను కలవడం సంచలనమైంది. అందరూ చెప్పినట్టే ఈయన కూడా నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే CMను కలిసినట్టు చెప్తున్నారు. రిజల్ట్ వచ్చినరోజే వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరుతున్నారని వార్తలొచ్చాయ్.. ఇప్పుడు మర్యాదపూర్వకంగా CMను కలిసారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.
ఇప్పుడే కాదు.. జనవరిలో ఉమ్మడి మెదక్‌జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు. వారిలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు ఉన్నారు. వారంతా పార్టీ మారుతున్నారని పెద్దయెత్తున ప్రచారం జరగడంతో ఆ నలుగురు మరీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించారు. కేవలం మెదక్‌జిల్లాకు సంబంధించి పలు అంశాలపై చర్చించేందుకే సీఎం రేవంత్‌ను కలిశామని చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత వారం రోజులకే రాజేంద్రనగర్ MLA ప్రకాశ్‌గౌడ్ కూడా సీఎం రేవంత్‌ను కలవడం గులాబీ శ్రేణుల్లో గుబులు రేపింది. అయితే నియోజకవర్గ అభివృద్ది పనులకోసమే ముఖ్యమంత్రిని కలిశానని ఆయన వివరణ ఇచ్చారు. అటు, MLC పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి సహా మరికొందరు కాంగ్రెస్‌లో చేరారు. తీగల కృష్ణారెడ్డి, బొంతు రామ్మోహన్ లాంటివాళ్లు హస్తం గూటికే చేరుకున్నారు. ఇవన్నీ ఇప్పటికే చర్చనీయాంశమైతే.. ఇప్పుడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.. మంత్రి పొంగులేటితో కలిసి సీఎం రేవంత్‌ను కలవడం కలకలం రేపుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…