సింగరేణి బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్.. బీజేపీ.. బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేలం వేయడం, కాంగ్రెస్ ప్రభుత్వం వేలంలో పాల్గొనడం పై బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీ, కాంగ్రెస్ టార్గెట్ విమర్శలు సంధిస్తోంది.. దీనిపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సింగరేణిపై బీఆర్ఎస్ విచిత్రమైన వాదన చేస్తోందంటూ మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిని ఇష్టానుసారంగా దోచుకున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయ జోక్యంతో సింగరేణిని పూర్తిగా విధ్వంసం చేశారని ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేదని.. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ గతంలో చెప్పారని గుర్తు చేశారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందు దొందే అని మండిపడ్డారు.
సింగరేణి వ్యవస్థను బీఆర్ఎస్ హయాంలో ధ్వంసం చేశారని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేనాటికి.. సింగరేణి బ్యాంక్ ఖాతాలో రూ. 3500 కోట్లు ఉండేవన్నారు. 2014కు ముందు సింగరేణిలో ఉద్యోగుల జీతాలు.. ఆలస్యంగా ఇచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. సింగరేణిని కేసీఆర్ అప్పులపాలు చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి రూ. 30 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది.. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ సంస్థలకు సకాలంలో చెల్లింపులు చేయలేదన్నారు. ఈ కారణంగా సింగరేణికి బకాయిలు పేరుకుపోయాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని.. బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా సింగరేణిని దోచుకున్నారంటూ ఆరోపించారు. సింగరేణిలో గతంలో విస్తృతంగా పర్యటించానని.. కేసీఆర్ కుటుంబం సింగరేణిని రాజకీయ క్షేత్రంగా ఉపయోగించుకున్నారంటూ విమర్శించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..