AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో 15వ BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం ముగింపు.. AIపై కీలక తీర్మానాలు, కార్మికుల హక్కుల పరిరక్షణకు పిలుపు

Hyderabad BRICS Meeting: హైదరాబాద్‌లో జరిగిన 15వ BRICS ట్రేడ్ యూనియన్ ఫోరంలో AI ఉద్యోగాలను భర్తీ చేయకుండా మానవ కేంద్రిత విధానాలు అమలు చేయాలని, గిగ్ వర్కర్లకు పూర్తి హక్కులు కల్పించాలని, మహిళా కార్మికుల సాధికారత, సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధిపై సభ్య దేశాలు కీలక తీర్మానాలు చేశాయి.

హైదరాబాద్‌లో 15వ BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం ముగింపు.. AIపై కీలక తీర్మానాలు, కార్మికుల హక్కుల పరిరక్షణకు పిలుపు
Hyderabad Brics Meeting
Rajashekher G
|

Updated on: Jul 15, 2026 | 7:19 PM

Share

BRICS Trade Union Forum: హైదరాబాద్ వేదికగా జూలై 14 నుంచి 16 వరకు జరిగిన 15వ బ్రిక్స్ (BRICS) ట్రేడ్ యూనియన్ ఫోరం సమావేశంలో సభ్య దేశాల కార్మిక సంఘాల ప్రతినిధులు పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. “Building for Resilience, Innovation, Cooperation and Sustainability” అనే ప్రధాన అంశంతో నిర్వహించిన ఈ సమావేశంలో భవిష్యత్ ఉద్యోగ వ్యవస్థ, కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ఉద్యోగాలు, మహిళా కార్మికుల సాధికారత, సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి, వాతావరణ మార్పుల ప్రభావం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

AI మనుషులకు సహాయకంగా ఉండాలి.. ఉద్యోగాలను భర్తీ చేయకూడదు

సదస్సులో అత్యంత ప్రాధాన్యం పొందిన అంశం కృత్రిమ మేధస్సు (AI). AI, ఆటోమేషన్, రోబోటిక్స్, డిజిటలైజేషన్ వల్ల ఉత్పాదకత పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ, ఉద్యోగాల కోత, కార్మికుల హక్కుల ఉల్లంఘన, డిజిటల్ వివక్ష, గోప్యత సమస్యలు వంటి సవాళ్లు కూడా పెరుగుతున్నాయని ఫోరం పేర్కొంది. అందువల్ల ఏఐ (AI) మానవులకు సహాయకంగా మాత్రమే ఉండాలని, మనుషులను పూర్తిగా భర్తీ చేసే సాధనంగా మారకూడదని స్పష్టం చేసింది.

ఉద్యోగాలపై AI తుది నిర్ణయాలు తీసుకోరాదు

ఉద్యోగ నియామకాలు, పనితీరు అంచనా, క్రమశిక్షణ చర్యలు లేదా ఉద్యోగాల తొలగింపు వంటి అంశాల్లో AI స్వయంగా తుది నిర్ణయాలు తీసుకోకూడదని ఫోరం సూచించింది. అలాంటి నిర్ణయాల్లో మానవ పర్యవేక్షణ తప్పనిసరి కావాలని, కార్మికులకు అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు ఉండాలని పేర్కొంది. అలాగే ఉద్యోగుల వ్యక్తిగత డేటా భద్రతకు ప్రత్యేక చట్టపరమైన రక్షణ కల్పించాలని ప్రభుత్వాలకు సూచించింది.

గిగ్, ప్లాట్‌ఫార్మ్ కార్మికులకు సమాన హక్కులు

స్విగ్గీ, జొమాటో, ఉబెర్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో పనిచేసే గిగ్ వర్కర్లకు కూడా ఇతర ఉద్యోగుల మాదిరిగానే గౌరవప్రదమైన ఉద్యోగ హక్కులు, సామాజిక భద్రత, ట్రేడ్ యూనియన్ హక్కులు, సమిష్టి చర్చల హక్కు కల్పించాలని బ్రిక్స్ దేశాలను కోరింది. ఇటీవల అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) ఆమోదించిన డీసెంట్ వర్క్ ఇన్ ప్లాట్‌ఫార్మ్ ఎకానమీ కన్వెన్షన్–2026ను త్వరగా అమలు చేయాలని కూడా విజ్ఞప్తి చేసింది.

మహిళా కార్మికులకు మరిన్ని అవకాశాలు

మహిళా ఉద్యోగులపై వేతన వివక్ష, వేధింపులు, అసమాన అవకాశాలు, కుటుంబ బాధ్యతల భారం వంటి సమస్యలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఫోరం పేర్కొంది. మహిళలకు నాయకత్వ అవకాశాలు, STEM విద్య, డిజిటల్ నైపుణ్యాలు, గ్రీన్ జాబ్స్‌లో అధిక ప్రాతినిధ్యం కల్పించాలని సూచించింది. అలాగే మహిళా వ్యాపారవేత్తలకు ఆర్థిక సహాయం, మార్కెట్ అవకాశాలు, సాంకేతిక మద్దతు పెంచాలని అభిప్రాయపడింది.

ప్రతి కార్మికుడికి సామాజిక భద్రత

ప్రపంచంలోని ప్రతి కార్మికుడికి సామాజిక భద్రత అందుబాటులో ఉండాలని ఫోరం పిలుపునిచ్చింది. అసంఘటిత రంగ కార్మికులు, వలస కార్మికులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, వ్యవసాయ కార్మికులు, ప్లాట్‌ఫార్మ్ ఉద్యోగులు అందరికీ పెన్షన్, బీమా, ఇతర సంక్షేమ పథకాలు వర్తించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరింది.

జీవితాంతం నైపుణ్యాల అభివృద్ధి అవసరం

AI, సాంకేతిక మార్పులతో ఉద్యోగాల స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో ఒకసారి చదువు పూర్తయితే సరిపోదని, జీవితాంతం నేర్చుకునే విధానం (Lifelong Learning) అవసరమని ఫోరం పేర్కొంది. రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్ కార్యక్రమాలను ప్రభుత్వాలు, యజమానులు, కార్మిక సంఘాలు కలిసి అమలు చేయాలని సూచించింది. బ్రిక్స్ దేశాల మధ్య నైపుణ్యాల పరస్పర గుర్తింపు, శిక్షణలో సహకారం పెంచాలని ప్రతిపాదించింది.

వాతావరణ మార్పులపై ‘జస్ట్ ట్రాన్సిషన్’

హరిత ఆర్థిక వ్యవస్థ వైపు మార్పు వల్ల ఉద్యోగాలు కోల్పోయే కార్మికులకు సామాజిక భద్రత, కొత్త నైపుణ్యాల శిక్షణ, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఫోరం పేర్కొంది. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ పరిశ్రమలు, సుస్థిర మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెంచడం ద్వారా నాణ్యమైన ఉద్యోగాలు సృష్టించాలని సూచించింది.

శాంతి, సహకారంతోనే అభివృద్ధి

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఘర్షణలు కార్మికులు, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ శాంతి, స్థిరత్వం, పరస్పర సహకారంతోనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ, వివాదాలను సంభాషణ ద్వారానే పరిష్కరించుకోవాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. అలాగే బ్రిక్స్ దేశాల మధ్య కార్మిక సంఘాల శాశ్వత సహకార వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది.

Follow Us