Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడు మామూలోడు కాదు.. ప్రేయసి కోసం ఎంతకు తెగించాడు.. సీన్ చూస్తే.!

ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడనేదీ నానుడి. కానీ ప్రియురాలి మైకంలో సొంత ఇంటికి కన్నం వేసి కన్నతల్లి బంగారం మాయం చేసిన కంత్రీగాడు అడ్డంగా బుక్కయ్యాడు. వరంగల్‌ నగరంలో అచ్చం సినీ ఫక్కీలో జరిగిన ఈ దొంగతాన్ని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. దొంగిలించిన బంగారమంతా రికవరీ చేసి, ఆ విద్యార్థిని కటకటాల్లోకి పంపారు.

వీడు మామూలోడు కాదు.. ప్రేయసి కోసం ఎంతకు తెగించాడు.. సీన్ చూస్తే.!
Thiefarrest
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Jun 10, 2025 | 5:28 PM

ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడనేదీ నానుడి. కానీ ప్రియురాలి మైకంలో సొంత ఇంటికి కన్నం వేసి కన్నతల్లి బంగారం మాయం చేసిన కంత్రీగాడు అడ్డంగా బుక్కయ్యాడు. వరంగల్‌ నగరంలో అచ్చం సినీ ఫక్కీలో జరిగిన ఈ దొంగతాన్ని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. దొంగిలించిన బంగారమంతా రికవరీ చేసి, ఆ విద్యార్థిని కటకటాల్లోకి పంపారు.

ఈ చోరీ ఘటన ఖిల్లా వరంగల్‌లో జరిగింది. సోమవారం(జూన్ 09) తెల్లవారుజామున రామకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. బీరువాలో భద్రపరచిన 16 తులాల బంగారం అపహరణకు గురైంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రాథమికంగా అక్కడ సీన్ చూస్తే దొంగతనాల్లో ఆరితేరిన దొంగ ఈ దోపిడీకి పాల్పడినట్లు సీన్ కనిపిస్తుంది. దీంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు పోలీసులు.

ఇంట్లోని బంగారమంతా లూటీ అవడంతో లబోదిబోమని మొత్తుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రితో పాటు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కొడుకు జయంత్ బంగారం చోరీపై పోలీసులకు పిట్టకథలు వినిపించారు. అక్కడ తెగ హడావిడి చేశారు. అయ్యో మా బంగారం అంతా పోయిందని కుటుంబం అంతా నెత్తి నోరు బాదుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు తీగలాగితే ఇంటి దొంగ బయటపడ్డాడు. కేసు పెట్టిన ఓనర్ రామకృష్ణ కొడుకే అసలు దొంగని తేల్చారు.

హనుమకొండలోని ప్రముఖ కళాశాలలో డిగ్రీ చదువుతున్న జయంత్ విద్యార్థి, అదే కళాశాలల్లో చదువుతున్న ఒక యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ యువతిని ఆకట్టుకోవడం కోసం జల్సా ఖర్చులకు డబ్బు కోసం కక్కుర్తిపడ్డాడు. సదరు యువకుడు ఇంట్లో బంగారంపై కన్నేశాడు. అతని కన్నతల్లి దాసుకున్న బంగారం అంతా ఊడ్చుకుపోయి, అచ్చం సినిమా ఫక్కీలో హైడ్రామా క్రియేట్ చేశాడు. ఎవరో దొంగలు ఇంట్లో పడి బంగారమంతా ఊడ్చుకుపోయినట్లుగా కథ అల్లాడు.

ఎంతటి తెలివి గల నేరస్తులైనా పోలీసుల నిఘానేత్రాల నుండి తప్పించుకోలేరన్నట్లు టెక్నాలజీ అతన్ని పట్టించింది. దొంగతనం జరిగిన సమయంలో అతని సెల్ నెట్‌వర్క్ ఆధారంగా పోలీసులు అనుమానం వచ్చి విచారించగా అసలు కథ బయటపడింది. ఇంటి దొంగ బంగారం దొంగిలించినట్లు గుర్తించిన పోలీసులు జయంత్ ను అరెస్టు చేసి, అతని వద్ద 16 తులాల బంగారం రికవరీ చేశారు. తల్లిదండ్రులతోపాటు అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి, చోరీ కేసు నమోదు చేసి కటకటాల్లోకి పంపారు. కన్న కొడుకే ఇంట్లో బంగారం దొంగిలించడం చూసి పోలీసులు షాక్ అయ్యారు. కొడుకు జైలుపాలు కావడంతో, ఏం చేయాలో అర్థం కాని దయనీయ స్థితిలో గుండెలు బాదుకోవడం తల్లిదండ్రుల వంతయింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..