తెలంగాణలో బోనాలు ఎందుకు అంత ప్రత్యేకం? బోనం వెనుక ఉన్న వందల ఏళ్ల చరిత్ర, ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
Telangana Bonalu Significance: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల జాతర ఆషాఢ మాసంలో ఎంతో వైభవంగా జరుగుతుంది. బోనం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసం, బోనాల చరిత్ర, ప్రత్యేకత, అమ్మవారి అనుగ్రహం, 2026 బోనాల పూర్తి షెడ్యూల్‌తో పాటు ఈ మహోత్సవ విశేషాలను తెలుసుకోండి.

Telangana Bonalu History: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి భావం అన్నీ ఒకే వేదికపై దర్శనమిచ్చే అద్భుతమైన ఆధ్యాత్మిక వేడుక బోనాల జాతర. ఆషాఢ మాసం ప్రారంభం కాగానే రాష్ట్రవ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కళకళలాడుతాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు మహిళలు తలపై బోనం మోసుకుంటూ అమ్మవారికి నైవేద్యం సమర్పించడం, డప్పుల మోతలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఊరేగింపులు బోనాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. భక్తి, సంప్రదాయం, జానపద కళలు కలిసిన ఈ మహోత్సవం తెలంగాణ ప్రత్యేకతకు ప్రతీకగా నిలిచింది. ‘బోనం’ అనే పదం ‘భోజనం’ నుంచి ఉద్భవించిందని పండితులు చెబుతారు. కొత్త మట్టి లేదా ఇత్తడి పాత్రలో అన్నం, బెల్లం, పాలు లేదా పెరుగు, పసుపు, కుంకుమతో అలంకరించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడాన్ని బోనం అంటారు. ఈ బోనాన్ని భక్తితో సమర్పిస్తే గ్రామ దేవత సంతోషించి కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదిస్తుందనే విశ్వాసం ఉంది.
బోనాల వెనుక ఉన్న పురాణ విశ్వాసం
తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు వ్యాపించిన అంటువ్యాధుల నుంచి ప్రజలను గ్రామ దేవత రక్షించిందని స్థానిక విశ్వాసం. ఆ తల్లికి కృతజ్ఞతగా ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి బోనాల ఉత్సవాన్ని నిర్వహించే ఆచారం ఏర్పడింది. అప్పటి నుంచి ఇది కేవలం పండుగగా కాకుండా ప్రజల విశ్వాసానికి ప్రతీకగా కొనసాగుతోంది.
ఆషాఢంలోనే బోనాలు ఎందుకు?
తెలుగు సంప్రదాయం ప్రకారం కొత్తగా పెళ్లైన కుమార్తె ఆషాఢ మాసంలో పుట్టింటికి రావడం ఆనవాయితీ. అదే విధంగా జగన్మాత కూడా ఈ నెలలో తన భక్తుల వద్దకు వస్తుందని నమ్మకం. అందుకే అమ్మవారిని ఇంటికి వచ్చిన కుమార్తెలా భావించి బోనం, చీర, సారె, పండ్లు, పూలతో ఘనంగా సత్కరిస్తారు. ఈ పూజలతో అమ్మవారి అనుగ్రహం లభించి కుటుంబంలో శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు.
బోనాల జాతరలో కనిపించే విశేషాలు
బోనాల సమయంలో ప్రతి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతుంది. తలపై బోనం మోసుకుంటూ మహిళలు భక్తిగీతాలు పాడుతూ ఊరేగింపులో పాల్గొంటారు. పోతురాజు విన్యాసాలు, డప్పుల మోతలు, శివసత్తుల నృత్యాలు, ఘటాల ఊరేగింపులు, రంగం కార్యక్రమం ఈ ఉత్సవాల ప్రత్యేక ఆకర్షణలు. వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివస్తారు.
బోనాలు ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తాయి?
సంప్రదాయం ప్రకారం బోనాల ఉత్సవాలు ముందుగా గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ప్రారంభమవుతాయి. అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం, హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం, అలాగే తెలంగాణలోని అనేక గ్రామ దేవతల ఆలయాల్లో ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. చివరగా ఘటాల ఊరేగింపుతో బోనాల మహోత్సవం ముగుస్తుంది.
2026 బోనాల ముఖ్య తేదీలు
- జూలై 16: గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఉత్సవాలకు శ్రీకారం.
- జూలై 19: తొలి బోనం, గోల్కొండలో ప్రధాన ఉత్సవాలు, లష్కర్ ఘటోత్సవం.
- ఆగస్టు 2: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ప్రధాన బోనాలు.
- ఆగస్టు 3: రంగం కార్యక్రమం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు.
- ఆగస్టు 9: లాల్ దర్వాజా, పాతబస్తీ ప్రాంతాల్లో బోనాల వేడుకలు.
- ఆగస్టు 10: ఘటాల ఊరేగింపుతో మహోత్సవాల ముగింపు.
తెలంగాణ బోనాల చరిత్ర
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన అత్యంత ప్రాచీన జానపద ఉత్సవాల్లో బోనాల పండుగ ఒకటి. దాదాపు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పండుగకు పల్లవుల పాలనా కాలంలోనే మూలాలు ఉన్నాయని చరిత్రకారులు పేర్కొంటారు. అనంతరం కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు, కుతుబ్ షాహీ పాలకులు కూడా ఈ ఉత్సవాలను విశేష వైభవంతో నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా కుతుబ్ షాహీల కాలంలో బోనాల వేడుకలు నెల రోజుల పాటు ఘనంగా జరిగేవని చెబుతారు.
అయితే, ప్రస్తుతం మనం చూస్తున్న రూపంలో హైదరాబాద్‌లో బోనాల పండుగకు విశేష ప్రాధాన్యం 1869 తర్వాత లభించింది. ఆ సమయంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను ప్లేగు మహమ్మారి తీవ్రంగా వణికించింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఉజ్జయినిలో ఉన్న మహంకాళి అమ్మవారిని ప్రార్థించిన మిలిటరీ బెటాలియన్ జవాన్లు.. మహమ్మారి నుంచి నగరం విముక్తి పొందితే హైదరాబాద్‌లో అమ్మవారికి ఆలయం నిర్మించి, బోనాలు సమర్పిస్తామని మొక్కుకున్నారు. వారి మొక్కు నెరవేరిన తర్వాత సికింద్రాబాద్‌లో శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రతిష్ఠించి, అమ్మవారికి బోనాలు సమర్పించారు. అప్పటి నుంచి బోనాల ఉత్సవాలు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే సంప్రదాయంగా మారాయి.
1908లో సంభవించిన ముసి నది మహా వరద కూడా బోనాల పండుగ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది. ఆ వరదలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, నగరం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. ఈ విపత్తు నుంచి ప్రజలను కాపాడాలని అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్.. లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాకుండా ముసి నదిలో పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలను సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని కోరారు. అప్పటి నుంచి లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో ఆషాఢ మాసం చివరి ఆదివారం బోనాల మహోత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
బోనాల ఆధ్యాత్మిక సందేశం
బోనాలు కేవలం ఒక జాతర మాత్రమే కాదు. భక్తి, కృతజ్ఞత, సమాజ ఐక్యత, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. అమ్మవారిని ఆరాధించడం ద్వారా కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, దుష్టశక్తుల నుంచి రక్షణ లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతుంటారు. ఈ ఆషాఢ మాసంలో మీరు కూడా అమ్మవారికి భక్తితో బోనం సమర్పించి, బోనాల జాతరలో పాల్గొని తెలంగాణ ఆధ్యాత్మిక వైభవాన్ని ఆస్వాదించండి. జగదాంబిక కటాక్షంతో మీ కుటుంబానికి సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు చేకూరాలని మనసారా ప్రార్థిద్దాం.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, స్థానిక, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది.)




