Telangana: నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది.. వీడియో వైరల్..
తెల్లవారుజామున నిద్రలేచి చూసిన ఆ అన్నదమ్ములకు ప్రాణాలు పోయినంత పనైంది. ఇంటి గడప దాటగానే ఎదురుగా కనిపించిన దృశ్యాలు వారిని వణికించాయి. నల్లటి ముగ్గులు, కోసిన నిమ్మకాయలు, విరజిమ్మిన పసుపు కుంకుమలు.. క్షుద్ర పూజల ఆనవాళ్లతో మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఇళ్ల ముందు నల్లటి ముగ్గులు.. ముగ్గులపై కోసిన నిమ్మకాయలు.. పసుపు కుంకుమ. తెల్లారి లేచి చూసే సరికి ఆ రెండు ఇళ్ల ముందు ఈ చిత్రం కనిపించడంతో కుటుంబసభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. సీన్ కట్ చేస్తే ఆ రెండు ఇల్లు అన్నదమ్ములవి.. ఒకే కుటుంబాన్ని టార్గెట్ చేసి క్షుద్ర పూజలు చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో క్షుద్ర పూజల కలకలం రేపాయి. పట్టణంలోని బేతాళవాడ ప్రాంతంలో నివాసం ఉంటున్న కొండ మాంతయ్య, కొండ మదునయ్య అనే అన్నదమ్ముల ఇంటి ముందు క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు.
ఇంటి ముందు నిమ్మకాయలు, పూజా సామాగ్రి, విచిత్ర గుర్తులు కనిపించడంతో ఇది క్షుద్ర పూజలేనని అనుమానం వ్యక్తం చేస్తూ.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు బాధితులు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆనవాళ్లను పరిశీలించి, ఎవరు ఈ పనికి పాల్పడ్డారన్న దానిపై విచారణ ప్రారంభించారు. ఈ పని చేసింది ఎవరు? కేవలం భయపెట్టడానికే ఇలా చేశారా లేక పాత కక్షలు ఏవైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పట్టణంలో ఇలాంటి మూఢనమ్మకాలతో కూడిన ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని, బాధ్యులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
