TS BJP: కర్నాటక ఫలితాల తర్వాత బీజేపీ స్ట్రాటజీ మార్చిందా.? కమలనాథుల అసలు వ్యూహం అదేనా..
కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ స్ట్రాటజీ మార్చిందా? కేవలం జాతీయ నాయకత్వమే బలంగా ఉంటే సరిపోదని అధిష్టానం భావిస్తోందా? రాష్ట్రాల్లో నాయకత్వాన్ని బలోపతం దిశగా అడుగులు వేస్తోందా? నేషనల్ అజెండా కాకుండా స్థానిక అంశాలపై ఫోకస్ చేయాలని అనుకుంటుందా?
కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ స్ట్రాటజీ మార్చిందా? కేవలం జాతీయ నాయకత్వమే బలంగా ఉంటే సరిపోదని అధిష్టానం భావిస్తోందా? రాష్ట్రాల్లో నాయకత్వాన్ని బలోపతం దిశగా అడుగులు వేస్తోందా? నేషనల్ అజెండా కాకుండా స్థానిక అంశాలపై ఫోకస్ చేయాలని అనుకుంటుందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. బీజేపీ అంటే కేవలం ఉత్తరాదికే పరిమితం అనే ముద్ర చెరిపేసుకునేందుకు తెలంగాణ ఎన్నికలను సవాలుగా తీసుకుందా? ఇంతకీ కమలనాథుల వ్యూహమేంటి?
కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత కమలం పార్టీ వ్యూహం మార్చింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా కసరత్తు చేస్తోంది. కేవలం జాతీయ నాయకత్వం బలంగా ఉంటే సరిపోదు, జాతీయ అంశాల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికలను గెలవలేమని గ్రహించారు కమలనాథులు. రాష్ట్రాల్లో నాయకత్వంలో నెలకొన్న పొరపొచ్చాలు, మనస్పర్థలు, విబేధాలను పరిష్కరించి ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేయాలని భావిస్తోంది అధిష్టానం. మరికొద్ది నెలల్లో దక్షిణాన తెలంగాణ, ఈశాన్యాన మిజోరాంతో పాటు చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో అంతర్గత విబేధాలు, వర్గాలు ఉన్నాయని అధిష్టానం గ్రహించింది. వీటిని తక్షణమే సరిదిద్దకపోతే ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదం ఉందని భావిస్తోంది.
తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీలో సీనియర్లు, ఇతర పార్టీల నుంచి వచ్చి పార్టీలో కొత్తగా చేరినవారికి మధ్య అంతరాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. పార్టీలో అంతర్గత విబేధాలు నానాటికీ పెరుగుతున్నాయి. పార్టీలో కొత్తగా చేరినవారికి రాష్ట్ర నాయకత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొందరు, బండి సంజయ్ ఇంకా పరిణితి చెందాల్సి ఉందని మరికొందరు.. ఇలా తలా ఒక విధంగా అధిష్టానం దగ్గర తమ వాదన వినిపిస్తూ వచ్చారు. పార్టీకి ఊపు తీసుకురావడంలో బండి సంజయ్ సక్సెస్ అయినా ఎన్నికలను ఎదుర్కునేందుకు వ్యూహకర్తలు అవసరమన్న భావన పార్టీ నేతల్లో ఉంది. పైగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న నేత కావాలని పదే పదే చెప్తున్నారు. ఈ పరిణామాలన్నింటి క్రమంలో తీరా ఎన్నికలప్పుడు నాయకత్వంలో మార్పు చేస్తే నిలదొక్కుకునే సరికే సమయం సరిపోతుందని తొలుత భావించిన హైకమాండ్ ఈ ఏడాది జనవరిలో బండి సంజయ్ పదవీకాలం ముగిసినా అప్రకటితంగా కొనసాగిస్తూ వస్తుంది.
వాస్తవానికి కర్నాటలో పార్టీ ఓటమి తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పార్టీలో చేరాలనుకున్న ఇతర పార్టీల నేతలు సైతం వెనుకంజ వేస్తున్నారు. దీంతో అధిష్టానం ఆలోచనలో పడింది. ఈ క్రమంలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఆశిస్తున్న ఈటల రాజేందర్‌కు ప్రచార కమిటీ బాధ్యతలు, జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణకు రాష్ట్ర పగ్గాలు అప్పగించి బండి సంజయ్‌ను కేంద్ర హోంశాఖలో సహాయ మంత్రిగా చేస్తారని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నిప్పు లేనిదే పొగరాదన్నట్లు మార్పులకు అధిష్టానం సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ చేంజెస్ ఎలా ఉంటాయన్నది మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు.
రాష్ట్ర నాయకత్వ పగ్గాలు ఆశిస్తూ ఎప్పటికప్పుడు తన మనసులో మాటను అధిష్టానం పెద్దలకు చెప్తూ వస్తున్న ఈటల రాజేందర్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి పయనమయ్యారు. ఢిల్లీ నుంచి ఆయనకు పిలుపొచ్చింది, జాతీయ స్థాయిలో పెద్దలను కలవడానికి వెళ్తున్నారని అంతా భావించారు. కానీ ఆయన అనూహ్యంగా అసోంలో ప్రత్యక్షమయ్యారు. పైగా ఆ రాష్ట్ర సీఎం, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పెద్ద దిక్కుగా ఉన్న హేమంత బిశ్వ శర్మను కలిశారు. ఈ అనూహ్య కలయిక వెనుక ఆంతర్యం ఏంటన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. బిశ్వ శర్మ గతంలో పనిచేసిన పార్టీలో అవమానాలు ఎదుర్కొని బీజేపీలో చేరిన అతి తక్కువ వ్యవధిలో రాజకీయ చతురత ప్రదర్శించి అసోంలోనే కాదు యావత్ ఈశాన్య రాష్ట్రాలకే పెద్ద దిక్కుగా మారారు.
అదే తరహా కసితో ఉన్న ఈటల రాజేందర్, అసోం సీఎం నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడంతో పాటు అధిష్టానం పెద్దలకు సిఫార్సు చేయించుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకే ఈటల ముందు అసోం వెళ్లి, అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లి పెద్దలను కలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేరికల కమిటీకి నాయకత్వం వహిస్తున్న ఈటల రాజేందర్‌కు ప్రచారంలో జరుగుతున్నట్లు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగిస్తారా లేక ఏకంగా రాష్ట్ర పగ్గాలే అప్పగిస్తారా అన్నది ప్రస్తుతానికి ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..