పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో తనకు పోలీసులు నోటీసులివ్వడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. పేపర్ లీకేజ్ వ్యవహారంతో తనకు సంబంధం లేకపోయినా తనకు నోటీసులు ఇచ్చారని అన్నారు. రాజకీయ నాయకుల వద్దకు ఎంతో మందివస్తుంటారు. వందల సెల్ఫీలు దిగుతుంటారు. ప్రతి ఒక్కరితో వారికి సంబంధం ఉంటుందా..? అని ప్రశ్నించారు. హిందీ పరీక్ష రోజు ఎవరో ఒక వ్యక్తి తనకు వాట్స్ ఆప్ చేస్తే.. కనీసం అది తాను చూడకపోయినా తనకు నోటీసులు ఇవ్వడాన్ని ఈటల తీవ్రంగా ఖండించారు. తాను టెక్నాలజీకి పెద్దగా అప్డేట్ కాలేదని… అందుకే మెసేజ్ లకు తాను రిప్లై ఇవ్వనని చెప్పారు. కేవలం తమను వేధించడానికే నోటీసులిచ్చారని మండిపడ్డారు.
చట్టాల మీద నమ్మకం ఉంది. పోలీసుల మీద నమ్మకం ఉంది. విచారణకు వెళతానన్నారు ఈటల. బండి సంజయ్‌ని అరెస్ట్ చేయటం, తనకు నోటీసులు ఇవ్వటం ద్వారా తమ కార్యకర్తలను భయాందోళనకు గురిచేయాలని చూస్తున్నారు. నోటీసులకు భయపడే వ్యక్తిని కాదని, తనకు నోటీసులు, జైళ్లు కొత్త కాదని అన్నారు ఈటల. ప్రేమకు వంగుతాం తప్ప దబాయిస్తే ఇంకో నాలుగు ఎక్కువ దబాయిస్తానని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు. సీఎం కేసీఆర్ కు పోయే కాలం దాపురించిందని అన్నారు. పోలీసులను నమ్ముకున్నోళ్లు బాగుపడరని వ్యాఖ్యానించారు. చరిత్రలో ఎంతో మంది కనుమరుగాయ్యారు. మీరు కూడా చరిత్ర హీనులు అవుతారు. ఆరిపోయే ముందు దీపం వెలుగులాంటింది కెసిఆర్ ప్రభుత్వం. ఒడిపోయేముందు ఆరాటం అంటూ ఎద్దేవా చేశారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..