Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruit Market: ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్.. అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడలో నిర్మాణంః నిరంజన్ రెడ్డి

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోహెడ మార్కెట్ ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం గడ్డిఅన్నారంలో ఉన్న పండ్ల మార్కెట్‌ను రంగారెడ్డిజిల్లా కోహెడకు తరలించి అత్యాధునికంగా మార్కెట్‌ను నిర్మించనున్నట్టు మంత్రి తెలిపారు.

Fruit Market: ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్.. అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడలో నిర్మాణంః నిరంజన్ రెడ్డి
Fruit Market
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 18, 2022 | 8:26 PM

Biggest Fruit Market in Asia: హైదరాబాద్(Hyderabad) మహానగర వాసులకు గుడ్‌న్యూస్.. ఆసియాలోనే అతి పెద్ద ఫ్రూట్ మార్కెట్ జంటనగరవాసులకు త్వరలో అందుబాటులోకి రానుంది. నగర శివారులోని రంగారెడ్డి(Rangareddy District) కోహెడలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అత్యాధునిక పండ్ల మార్కెట్ నిర్మిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. కోహెడలోని నూతన మార్కెట్(Koyeda Druit Market) ప్రాంగణంలో రూ.50 లక్షలతో నిర్మిస్తున్న వంద ఫీట్ల రోడ్ నిర్మాణపనులకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పండ్ల మార్కెట్ నిర్మాణంపై కోహెడలో ఉద్యాన రైతులు, విక్రయదారులతో జరిగిన సమావేశంలో మంత్రులు మాట్లాడారు. అనంతరం, బాటసింగారం తాత్కాలిక పండ్ల మార్కెట్ పరిశీలించారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోహెడ మార్కెట్ ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం గడ్డిఅన్నారంలో ఉన్న పండ్ల మార్కెట్‌ను రంగారెడ్డిజిల్లా కోహెడకు తరలించి అత్యాధునికంగా మార్కెట్‌ను నిర్మించనున్నట్టు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనాలకు అనుగుణంగా అంతర్జాతీయ స్ధాయిలో మార్కెట్ అందుబాటులోకి రానున్నట్లు మంత్రి చెప్పారు. కోహెడలో ఆసియా ఖండంలో అతిపెద్ద పండ్ల మార్కెట్‌గా రూపుదిద్దుకుంటుందన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.

Niranjan Reddy

Niranjan Reddy

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కోహెడ మార్కెట్ నిర్మాణ ఉద్దేశాన్ని అందరూ అర్ధం చేసుకోవాలని కోరారు. 178 ఎకరాలలో కోహెడ మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఢిల్లీ మార్కెట్ కన్నా చాలా పెద్ద మార్కెట్‌ను కోహెడలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంత్రి వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మారాయి, భవిష్యత్ లో మరింత మారతాయి. ఇందుకు అనుగుణంగా పంటలు ఉండాలన్నారు. గతంలో కూరగాయలు తక్కువ అన్నం, రొట్టెలు ఎక్కువ తింటే, ఇప్పుడు కూరలు, పండ్లు ఎక్కువ తింటున్నారని మంత్రి పేర్కొన్నారు. మానవుల వినియోగ అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పంటల సాగు పెరుగుతున్నదని చెప్పారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత గడ్డిఅన్నారం మార్కెట్ సౌకర్యంగా లేదు. అందుకే ఈ మార్కెట్ ను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ఉత్పత్తులకు అనుగుణంగా రాష్ట్రంలో ఆహారశుద్ది పరిశ్రమలను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఉద్యాన పంటల సాగుకు అనుగుణంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులు ఉన్నాయని స్పష్టం చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి, ఔటర్ రింగ్ రోడ్‌కు, రాబోయే రీజినల్ రింగ్ రోడ్ కు సమీపంలో ఉండడం కోహెడ మార్కెట్‌కు జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్‌ను పెంచుతున్నదని అన్నారు. ప్రణాళికాబద్ధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడ మార్కెట్ రూపుదిద్దేందుకు లే అవుట్ సిద్దమవుతున్నదని తెలిపారు. అప్పటి వరకు క్రయ, విక్రయాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు బాటసింగారంలో తాత్కాలికంగా పండ్ల మార్కెట్ ను ప్రభుత్వం ఏర్పాటుచేసిందన్నారు. తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో కోహెడలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని అన్నారు.

తెలంగాణలో 50 వేల ఎకరాలలో ఆలుగడ్డ సాగు లక్ష్యంతో ఆలుగడ్డ విత్తనం స్టోరేజీ లక్ష్యంగా కోహెడ కోల్డ్ స్టోరేజీ వుంటుందన్నారు. తెలంగాణ వ్యవసాయం కేసీఆర్ నాయకత్వంలో దశ, దిశ మార్చుకున్నదన్నారు. కేసీఆర్ ఆలోచనల మూలంగానే తెలంగాణ వ్యవసాయం సుస్థిరమవుతున్నదని మంత్రి పేర్కొన్నారు. కొత్తగా నిర్మించే మార్కెట్ లో ఎవరికీ ఇబ్బందులు లేకుండా నిబంధనలకు అనుగుణంగా దుకాణాల కేటాయింపు జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెంట మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మూసి రివర్ ఫ్రంట్ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బేతి సుభాష్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కమీషనర్ రఘునందన్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు ఉన్నారు.

Read Also….  KTR on Modi: నమో అంటే నరేంద్ర మోడీ కాదు.. కొత్త భాష్యం చెప్పిన మంత్రి కేటీఆర్!