KTR on Modi: నమో అంటే నరేంద్ర మోడీ కాదు.. కొత్త భాష్యం చెప్పిన మంత్రి కేటీఆర్!

భారత ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి రాష్ట్ర మంత్రి కేటీ రామారావు విరుచుకుపడ్డారు. నమోకు సరికొత్త అర్థం చెప్పారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమే అంటూ సెటైర్లు పేల్చారు.

KTR on Modi: నమో అంటే నరేంద్ర మోడీ కాదు.. కొత్త భాష్యం చెప్పిన మంత్రి కేటీఆర్!
Ktr
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 18, 2022 | 5:35 PM

Minister KTR fires on PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి రాష్ట్ర మంత్రి కేటీ రామారావు(KTR) విరుచుకుపడ్డారు. నమో(NAMO)కు సరికొత్త అర్థం చెప్పారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమే అంటూ సెటైర్లు పేల్చారు. తెలంగాణ(Telangana) పుట్టుకనే ప్రశ్నిస్తున్న మోడీ, భారతీయ జనతా పార్టీ(BJP)కి.. ఈ రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని కేటీఆర్ అన్నారు. తెలంగాణ అమలు చేస్తున్న మిషన్‌ భగీరథను కాపీ కొట్టి దేశవ్యాప్తంగా హర్‌ ఘర్ జల్ అంటూ డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా తోట ఆగ‌య్య ప్రమాణ‌స్వీకారం కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజ‌రై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర బిల్లు స‌రిగ్గా ఇదే రోజు 8 ఏండ్ల క్రితం పార్లమెంట్‌లో ఆమోదం పొందిదని కేటీఆర్ గుర్తు చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. 2014లో మోడీని ఈ దేశ ప్రజ‌లు న‌మ్మడ‌మే పెద్ద త‌ప్పు అన్న కేటీఆర్.. న‌మో అంటే న‌రేంద్ర మోడీ కాదని.. న‌మో అంటే న‌మ్మించి మోసం చేసేటోడు అని కేటీఆర్ విమ‌ర్శించారు. పేద, బడుగు వర్గాల జీవితాల్లో మార్చు తీసుకువస్తారని నమ్మి అధికారం అప్పగిస్తే.. ఉన్న జీవిత బీమా సంస్థను కూడా అమ్మేస్తున్నారని దుయ్యబట్టారు. నినాదాలు అద్భుతంగా ఉంటాయి.. కానీ ప‌ని మాత్రం లేదని మోడీ పాల‌నపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు.

తెలంగాణలో బీజేపీకి నాయ‌క‌త్వ కరువన్న కేటీఆర్… రాష్ట్రాన్ని ప‌రిపాలించే సీన్ ఉందా? అని స‌మైక్యవాదులు ప‌లు ర‌కాలుగా అడ్డగోలు వాద‌న‌లు చేశారని మండిపడ్డారు. కానీ ఇవాళ 8 ఏండ్ల త‌ర్వాత తెలంగాణ మోడ‌ల్ భార‌త‌దేశానికే దిక్సూచిగా మారింది. మ‌న ప‌థ‌కాల‌ను చాలా రాష్ట్రాలు అనుస‌రిస్తున్నాయి. ఇది కేసీఆర్ ప‌రిపాల‌న‌కు నిద‌ర్శనమన్నారు. ఇవాళ మ‌న అభివృద్ధిని చూసి భార‌త‌దేశ‌మే అబ్బుర‌ప‌డుతోంది. ఇవాళ తెలంగాణ చేసిన ప‌నిని, రేపు భార‌త‌దేశం అమ‌లు చేస్తోంద‌నే స్థాయికి ఎదిగామ‌న్నారు. 60 ఏళ్లలో కాని ప‌నులు ఆరేడు ఏళ్లలోనే పూర్తి చేసిన చూపించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు అనాలోచిత చర్య అన్న కేటీఆర్.. పార్లమెంటులో బిల్లు ఓటింగ్‌కు వ‌స్తే ప‌క్కా ద‌ర్వాజాలు బంద్ చేసే పాస్ చేస్తారన్నారు. ఇది కూడా తెలియని వ్యక్తి మ‌న ప్రధాని కావ‌డం దౌర్భాగ్యమన్నారు కేటీఆర్. ప్రగ‌తిప‌థంలో దూసుకుపోతున్న తెలంగాణ‌కు సాయం చేయ‌కుండా, ఈ రాష్ట్ర పుట్టుకనే ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ పుట్టుక‌నే ప్రశ్నిస్తున్న బీజేపీకి ఇక్కడ పుట్టగ‌తులు ఉండాల్నా ఆలోచించుకోవాలి. మిష‌న్ భ‌గీర‌థ‌ను సిగ్గులేకుండా కాపీ కొట్టి మ‌న‌కు నిధులు ఇవ్వ‌డు అని కేటీఆర్ ధ్వజ‌మెత్తారు.

అంతకుముందు తంగ‌ళ్లప‌ల్లి మండలం బ‌ద్దెన‌ప‌ల్లిలో రైతు వేదిక‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో 2,603 రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ రైతు వేదిక‌ల ద్వారా రైతుల‌ను సంఘ‌టితం చేస్తున్నామ‌ని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవ‌సాయానికి, రైతుల‌కు మ‌ద్దతుగా నిలుస్తోందన్నారు. రైతు వేదిక‌ల్లో స్థానిక రైతుబంధు నేతలు, వ్యవ‌సాయ విస్తర‌ణ అధికారులు కలసి.. వ్యవ‌సాయంలో మార్పులు, లాభసాటి పంటలు, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంట‌ల‌పై చ‌ర్చిస్తారని అన్నారు. దేశంలోనే 5వేల ఎక‌రాల‌కు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి వ్యవ‌సాయ విస్తర‌ణ అధికారుల‌ను నియ‌మించిన ఘనత తెలంగాణకే దక్కిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంట‌ల నాణ్యమైన విద్యుత్‌ను రైతుల‌కు ఇస్తున్న ఘనత కూడా తెలంగాణకే దక్కుతుందన్నారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లాకు గోదావ‌రి జ‌లాలు త‌ర‌లి రావ‌డంతో ఏకంగా 6 మీట‌ర్లు భూగ‌ర్భ జ‌లాలు మీద‌కు వ‌చ్చాయని అన్నారు.