Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: ఉడుకుతున్న రాజకీయం..

కేంద్రంలో BJPని గద్దె దించితేనే రైతులకు న్యాయం జరుగుతుందంటోంది TRS. ప్రగతిభవన్‌ నుంచి ధర్నాచౌక్ దాకా తీసుకొచ్చాం. తెలంగాణలో అధికార మార్పు కూడా త్వరలోనే చూస్తారంటోంది BJP.

Big News Big Debate: ఉడుకుతున్న రాజకీయం..
Ts Politics
Follow us
KVD Varma

|

Updated on: Dec 20, 2021 | 10:21 PM

Big News Big Debate: కేంద్రంలో BJPని గద్దె దించితేనే రైతులకు న్యాయం జరుగుతుందంటోంది TRS. ప్రగతిభవన్‌ నుంచి ధర్నాచౌక్ దాకా తీసుకొచ్చాం. తెలంగాణలో అధికార మార్పు కూడా త్వరలోనే చూస్తారంటోంది BJP. తమ స్వార్థ రాజకీయాల కోసం ఎప్పుడూ లేని సమస్యను సృష్టించి మరీ కేంద్ర, రాష్ట్రాలు రైతులను రోడ్డున పడేశాయంటోంది కాంగ్రెస్‌. అటు బీజేపీ నాయకులను గ్రామాల్లోకి రాకుండా ఉరికిస్తామని చావు డప్పు కొట్టి మరీ గులాబీ శ్రేణులు వార్నింగ్‌ ఇస్తుంటే.. దమ్ముంటే పోలీసులు లేకుండా వీధుల్లోకి రావాలంటూ సవాల్‌ విసురుతున్నాయి కాషాయదళాలు.

కేంద్ర, రాష్ట్రాల మధ్య వరిపై యుద్ధం పీక్స్‌కి చేరింది. అటు పొలాల్లో నాట్లు పడుతున్నాయి. ఇటు కేంద్రం కొనలేమంటోంది. దీంతో సెంటర్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు TRS ప్రభుత్వం ద్విముఖ వ్యూహం అనుసరిస్తోంది. మరోసారి మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపిన CM KCR‌.. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా చావు డప్పుల పేరుతో నిరసనలకు పిలుపు ఇచ్చారు. దిష్టిబొమ్మ దహనాలు, శవయాత్రలతో రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక నినాదాలు మార్మోగాయి.

వీధి ఫైటింగులే కాదు ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. ఇటీవల పార్టీ సమావేశంలో KCR చేసిన వ్యాఖ్యలపై కమలనాథులు భగ్గుమంటున్నారు. హింస, ఘర్షణలు చెలరేగేలా ముఖ్యమంత్రి స్వయంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తోంది BJP. హుజూరాబాద్‌ తీర్పు తర్వాత KCR తీరు మారిందని.. కక్షపూరిత ప్రకటనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. అటు బెంగాల్‌లో మమత తరహా పోరాటం చేయాలన్న KCR‌ వ్యాఖ్యలపైనా బండి సంజయ్‌ చేసిన కామెంట్స్‌ సంచలనంగా మారాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు దమ్ముంటే పోలీసులు లేకుండా రోడ్లమీదకు రాగలరా అని ప్రశ్నించారు.

అబద్ధాల పునాదుల మీద బీజేపీ రాజకీయాలు చేస్తోందని.. తెలంగాణ ప్రజలు సహించరంటున్నారు తెలంగాణ మంత్రులు. రాష్ట్రంలో రైతులు బాగుపడాలంటే కేంద్రంలో BJP గద్దె దిగాల్సిందే అంటున్నారు. అయితే BJP, TRS మధ్య జరుగుతున్న యుద్ధమంతా నాటకమేనంటోంది కాంగ్రెస్‌. లేని సమస్యను సృష్టించి మరీ రాజకీయ ఉద్రిక్తతలు తెరతీశారంటున్నారు హస్తం పెద్దలు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చారు. బిల్లులకు అనుకూలంగా ఓటేసిన TRSను జనాలు నమ్మరంటోంది తెలంగాణ కాంగ్రెస్‌.

కేంద్రానికి చావుడప్పు కొట్టాల్సిందే అని TRS‌ అంటే.. తెలంగాణలో మార్పు మొదలైందని KCR ప్రభుత్వానికి డప్పు కొట్టేరోజు ఎంతోదూరంలో లేదంటోంది కమలదళం. ఈ రెండు పార్టీలను సాగనంపితే కానీ తెలంగాణకు పట్టిన శని వదలదంటోంది కాంగ్రెస్‌. ఎవరు ఏ డప్పులు కొట్టినా టార్గెట్‌ 2023లో జేగంట కొట్టేది ఎవరనేది చెప్పేది అంతిమంగా ప్రజలే.

(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్) ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్‌ డిబేట్‌ జరిగింది… పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి.