AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Debate: దళిత బంధు పథకమా.. ఎన్నికల వ్యూహమా?.. తెలంగాణ దళిత బంధుతో కొత్త శకం వస్తుందా?

ఉత్పాదక రంగానికి ఇంతకాలం దూరంగా ఉన్న వర్గాలను కూడా రాష్ట్ర ఆర్ధికాభివృద్ధిలో భాగస్వాములు చేసేలా పథకం అమలు చేస్తామంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

Big Debate: దళిత బంధు పథకమా.. ఎన్నికల వ్యూహమా?.. తెలంగాణ దళిత బంధుతో కొత్త శకం వస్తుందా?
Big News Big Debate By Rajinikanth
Balaraju Goud
| Edited By: |

Updated on: Jul 28, 2021 | 2:19 PM

Share

బిగ్‌న్యూస్‌ బిగ్‌డిబేట్‌ డెస్క్‌:

Telangana Dalit Bandhu Scheme: దళితబంధు అనేది ఓ పథకం కాదు.. ఇదో ఉద్యమం అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఉత్పాదక రంగానికి ఇంతకాలం దూరంగా ఉన్న వర్గాలను కూడా రాష్ట్ర ఆర్ధికాభివృద్ధిలో భాగస్వాములు చేసేలా పథకం అమలు చేస్తామంటున్నారు సీఎం. ఈ స్కీము ప్రకటించిన రోజు నుంచే మద్దతు అనూహ్యంగా పెరుగుతోంది. పార్టీలకతీతంగా దళిత సంఘాల స్వాగతిస్తుంటే.. లెఫ్ట్‌ పార్టీలు కూడా కేసీఆర్‌ రైట్‌ రైట్‌ అంటూ ప్రోత్సహిస్తున్నాయి. అటు ప్రత్యర్ధి పార్టీలు మాత్రం ఇప్పటికీ దీనిని రాజకీయ పథకంగానూ చూస్తున్నాయి.

సుదీర్ఘ మంత్రాంగం…. కారణం హుజూరాబాద్‌ ఎన్నికలు కావొచ్చు.. కాకపోవచ్చు. కేసీఆర్‌ మాత్రం దళిత బంధును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో ఆయన ప్రకటించినట్టు తన వద్ద ఇంకా బ్రహ్మాస్త్రాలున్నాయి.. రైతు బంధు కేవలం శాంపిల్‌ మాత్రమే అన్న కేసీఆర్‌ అన్నట్టుగా పెద్ద అస్త్రమే బయటకు తీశారు. దళిత బంధు అనేది తెలంగాణలో అంతగా తీసిపారేయాల్సిన వ్యవహారం కాదు. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న పథకం. అందుకే పార్టీలు దీనిపై ఆగమాగమవుతున్నాయి. వ్యతిరేకిస్తున్నట్టు చెప్పలేకపోతున్నాయి.. అలాగని ఆత్మ చంపుకుని అంగీకరించలేకపోతున్నాయి. ఏది ఏమైనా దీనిపై కేసీఆర్‌ భారీగానే మంత్రాంగం జరుపుతున్నారు. జూన్‌ మాసంలో దళిత ప్రజాప్రతినిధులను, సంఘాలను ప్రగతిభవన్‌ కు పిలిపించి సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం రోడ్‌ మ్యాప్‌ సిద్దం చేసి పథకం ప్రకటించారు.

హుజూరాబాద్‌ను పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని మరీ రూ.2000 కోట్లు ఒక్క నియోజకవర్గంలోనే వెచ్చించి పథకాన్ని శుభారంభం ఇస్తామంటున్నారు. ఇది చారిత్రక నిర్ణయమే. దీనిపై ఇంకా కసరత్తు జరగాల్సి ఉంది. అందుకే మరోసారి వందల మంది దళితులు, సంఘాలు, మద్దతిస్తున్న నాయకులతో కలిసి రోజంతా విధివిధానాలపై చర్చలు జరిపారు. నియోజకవర్గానికి చెందిన 412 మంది దళితులు మరో 15 మంది రిసోర్స్ పర్సన్లు, ఆఫీసర్లు సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం, మున్సిపాల్టీల్లోని ప్రతీ వార్డు నుంచి నలుగురు చొప్పున దళితులు హాజరయ్యారు. దళితబంధు స్కీం ఉద్దేశం, అమలు, పర్యవేక్షణ వంటి అంశాలపై సదస్సులో అవగాహన కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. దళిత బంధు పథకంలా కాకుండా ఉద్యమంలా చేపడతామన్నారు సీఎం కేసీఆర్.

పక్కా ప్రణాళికతోనే…. ఆర్ధిక సాయంతో వారికిష్టమైన పరిశ్రమను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ దళిత సమాజం కూడా రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం అంటున్నారు. సొంత ప్రాంతంలో వారికి ఇష్టమున్న రంగంలో ప్రోత్సహించడంతో పాటు.. వారికి అండగా ఉండి రక్షణ గోడగా నిలవాలని భావిస్తోంది ప్రభుత్వం. బీమా సహా అనేక సదుపాయాలు కలిపించి ఆర్ధికంగా ఎదిగి ఆత్మగౌరవంగా బతికేలా చేయాలన్న మహోన్నత లక్ష్యం ఉంది. ఇందుకోసమే దశలవారీగా అమలు చేసే ఈ పథకానికి రూ.80 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కేసీఆర్‌ ప్రకటించిన ఈ పథకానికి ప్రశంసలు వస్తున్నాయి.

రాజకీయంగా భిన్నస్వరాలు… దీనిపై భిన్నస్వరాలు వినిపించిన భారతీయ జనతాపార్టీ నుంచి బయటకు వచ్చారు మోత్కుపల్లి నర్సింహులు. అటు కమ్యూనిస్టు పార్టీలు కూడా స్వాగతిస్తున్నాయి. దళిత జాతి సత్తా చూపించేందుకు కేసీఆర్‌ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చాయి లెఫ్ట్‌ పార్టీలు. ప్రధాన ప్రతిపక్షాలు మాత్రం పెదవివిరుస్తున్నాయి. ఉప ఎన్నికల కోసం పుట్టిన పథకమని అంటున్నారు పీసీసీ మాజీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. దళిత సీఎం నినాదంపై సమాధానం చెప్పి.. పథకం అమలు చేస్తే బాగుండేదన్నారు. అటు పార్టీ ఆధ్వర్యంలో లక్షల మందితో దండోరా పెడతామంటోంది హస్తం పార్టీ. బీజేపీ సైతం ఎన్నికల పథకంగానే అభివర్ణించింది. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే గిరిజనలకు కూడా ఈ పథకం వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు.

గడిచిన ఏడేళ్లలో దళితుల కోసం….

పథకం వివరాలు  లబ్ధిదారులు వ్యయం
భూపంపిణీ 15543 ఎకరాలు 6194 కుటుంబాలు రూ.678 కోట్లు
పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్పులు  18లక్షల లబ్ధిదారులు  రూ.3,095.61 కోట్లు
అంబేద్కర్‌ ఓవర్శీస్‌ విద్యానిధి   605 లబ్ధిదారులు రూ.107.62 కోట్లు
స్వయం ఉపాథి శిక్షణ  7712 లబ్ధిదారులు  రూ.3,005.6 కోట్లు
కల్యాణ లక్ష్మి  1,69,508 లబ్ధిదారులు రూ.1,333.41 కోట్లు
స్పెషల్‌ ఎకనమిక్‌  46లక్షల లబ్ధిదారులు రూ.1,845 కోట్లు

కాగా,  ప్రస్తుతం రాష్ట్రంలో 268 గురుకులాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందులో  1.60 లక్షల విద్యార్థులు చదువుతున్నారు.  అలాగే, 30 మహిళా డిగ్రీ కాలేజీలు, ఎస్సీలకు 10 స్టడీ సర్కిళ్లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట చేసింది.

(2011 లెక్కల ప్రకారం) దేశ జనాభాలో దళితులు 25.39%, అంటే సుమారు 30 కోట్ల మంది. అందులో 37 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారు. 54 శాతం మంది దళిత బాలలు పోషకాహారలోపం. ప్రతి వెయ్యి మంది బాలల్లో 83 మంది శారీరక లోపాలు. దళితులలో ఇంకా 45 శాతం మంది నిరక్షరాస్యులు. గ్రామాల్లో అక్షరాస్యత 37.8 శాతం, 27 శాతం మంది దళిత స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు లేవు. ఎస్సీ , ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కూడా అంతంతమాత్రమే. 15 శాతం కేసుల్లోనే నిందితులు అరెస్టు, 85 శాతం కేసులు అరెస్టుల దాకా రావడం లేదు. నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారం దళితులపై 66 శాతం పెరిగిన నేరాలు, రోజు ముగ్గురు దళిత స్త్రీలపై దాడులు, రెండు హత్యలు.

వాస్తవానికి దేశవ్యాప్తంగా కూడా దళితులకు ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ వివక్షలో వారు బతకాల్సి వస్తోంది. రిజర్వేషన్లు కల్పించినా.. లక్షల కోట్లు ఖర్చు చేసినా దళితులు ఇంకా అట్టడుగు వర్గాలగానే ఉండటానికి కారణాలనే అన్వేషించాలి.. అదే సమయంలో పథకాలు కూడా అమలు చేయాలి.. అలా జరగకపోతే దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా బాగుపడదు.

మొత్తానికి హూజారాబాద్‌ వరహాలబాద్‌గా మారిందని విపక్షాలు అంటుంటే.. చిత్తశుద్దితో పథకాలు అమలు చేస్తుంటే విమర్శలు విపక్షాలకు తగదంటున్నారు అధికారపార్టీ నేతలు. దీనిపై టీవీ9 బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌లో విస్తృతంగా చర్చ సాగింది.. ఆసక్తికరంగా సాగిన ఈ చర్చలో ఎన్నో సలహాలు.. సవాళ్లు చర్చకు వచ్చాయి.. జస్ట్‌ వాచ్‌ వీడియో….