
దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన రామాలయం భద్రాచలం. పవిత్ర పావన గోదావరి నది తీరాన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే శ్రీరాముడిగా వెరిసిన వైష్ణవ క్షేత్రం. ప్రస్తుతం దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రమే. భద్రాచలానికి కేవలం పురాణ ప్రాశస్త్యమే కాదు ఘనమైన చరిత్ర కూడా ఉంది. భద్రుడుగా శ్రీరామచంద్రునికి పరమ భక్తవరేణ్యుడుగా, శ్రీరాముని దర్శనం కోసం తపస్సును చేయగా భద్రుడు చేసిన తపస్సుకు మెచ్చి శ్రీరాముడు.. అతనికి వరాన్ని ప్రసాదించాడని ఆ వరం ప్రకారంగా సీత లక్ష్మణ సమేతంగా ఇక్కడ వెలిశారని భద్రాచల స్థల పురాణం చెప్తుంది.
ఇంతా విశిష్టత ఉన్న భద్రాచలం రామయ్యపై వివిధ ప్రభుత్వ శాఖలు సైతం తమ భక్తిని చాటేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తపాలా శాఖ సైతం భద్రాచల రామయ్యపై అవకాశం ఉన్నపుడల్లా ఉడతా భక్తి చాటుతోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించగా ప్రస్తుతం తపాలా శాఖ మరో అరుదైన ఆవిష్కరణ చేసింది. వాస్తవానికి జనవరి 22న అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠా మహోత్సవం అట్టహాసంగా సాగిన విషయం విదితమే. ఇదే తరహాలో దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలంలో ఏప్రిల్ 17న శ్రీరామనవమి మహోత్సవాలను పురస్కరించుకుని తపాలాశాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా ‘భద్రాచలం రామాలయ ప్రత్యేక పోస్టల్ కవర్’ను రూపొందించారు. దీన్ని తపాలా ఉన్నతాధికారులతో కలిసి కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవుసింప్ట్ చౌహాన్ హైదరాబాదులో డాక్ సదన్‌లో ఆవిష్కరించారు. పోస్టల్ కవరుపై భద్రాద్రి ఆలయంలోని రాములోరి మూలవిరాట్ చిత్రపటాన్ని ముద్రించడం విశేషం. ‘శతాబ్దాల చరిత్ర గల దేవాలయంపై భక్తి పూర్వకంగా పోస్టల్ కవర్ వాడుకలోకి తీసుకువచ్చినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా తపాలా శాఖ ప్రత్యేకంగా ముదిరించిన ఈ పోస్టల్ కవర్ల పై రామభక్తులు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి వాటిని సంస్కృతి, వారసత్వ సంపదగా భావిస్తూ ప్రత్యేక ఆసక్తి గల వారు సేకరిస్తుంటారు. మధుర జ్ఞాపకాలుగా భద్రపరుస్తారు.
ఇదిలా ఉండగా త్వరలో అన్ని పోస్టాఫీసుల్లో కవర్లు అందుబాటులోకి తేనున్నట్లు తపాలా అధికారులు వెల్లడించారు. ఖాతాదారుల నుంచి వచ్చే ఆదరణను బట్టి ముద్రించే వీలుంది. సాధారణంగా రూ.5 నుంచి రూ.50 విలువైన కవర్లు ఎక్కువగా వినియోగిస్తుంటారు. సాధారణమైన వాటికి గమ్యానికి చేరిన తర్వాత ఉపయోగం ఉండదు. రామాలయ పోస్టల్ కవరు మాత్రం ఇంట్లో భద్రపర్చుకునే అవకాశం ఉందని తపాలా శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. ముత్యాల తలంబ్రాల సరఫరాకు ఈ నూతన పోస్టల్ కవర్లు ఉపయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి గత ఏడాది శ్రీరామ నవమి సందర్భంగా తపాలా శాఖ 30 వేల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను భక్తులకు చేరవేసింది. ఈ సారి వీటిని ఆలయ నేపథ్యంతో ముద్రించిన ప్రత్యేక కవర్లలోనే భక్తులకు పంపించనున్నారు. రూ. 45, రూ.60 ధరల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయని భద్రాచలం తపాలా అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..