అర్ధరాత్రి నడి రోడ్డుపై లేడీ టెకీ నగ్నంగా పరుగులు.. తెల్లారే సరికి చెరువులో డెడ్ బాడీ! ఏం జరిగిందో..
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.లక్షల్లో సంపాదిస్తున్న ఓ లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మానసిక సమస్యలతో బాధపడుతుంది. ఏం జరిగిందో తెలియదుగానీ ఉన్నట్లుండి అర్ధరాత్రి వేళ నగ్నంగా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్, జులై 19: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా దేవపల్లికి చెందిన వక్కులగడ్డి ఈశ్వర్‌రావు, అరుణ దంపతుల కుమార్తె తేజస్విని (25) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేసేది. ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న ఆమె 6 నెలల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి వైజాగ్‌కి వెళ్లింది. అనంతరం రెండు నెలల క్రితం తల్లి అరుణతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి పీర్జాదిగూడలోని శంకర్‌నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. శుక్రవారం తల్లి, కుమార్తె కలిసి మరో అద్దె ఇంటి కోసం మియాపూర్ ప్రాంతంలో వెతికారు. సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకుని నిద్రపోయారు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ అర్ధరాత్రి సుమారు 2.30 గంటల సమయంలో తేజస్విని నిద్రలేచి తల్లి ఉన్న గదికి బయట నుంచి తాళం వేసింది. అనంతరం చేతిలో చీరపట్టుకుని నగ్నంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.
మార్గమధ్యలో స్థానిక బీరప్ప ఆలయం వద్ద ఆగి ప్రార్థనలు చేసిన ఆమె, అనంతరం పీర్జాదిగూడ చెరువు వైపు పరుగెత్తుకుంటూ వెళ్లి నీటిలో దూకింది. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైనట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం నిద్రలేచిన తల్లి గది బయట నుంచి తాళం వేసి ఉండటాన్ని గమనించి కేకలు వేయగా స్థానికులు వచ్చి తలుపులు తెరిచారు. కుమార్తె కనిపించకపోవడంతో వెతకగా చెరువులో మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు, హైడ్రా, డీఆర్‌ఎఫ్ బృందాల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
తన కుమార్తె తరచూ పీడకలల గురించి చెప్పేదని, కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతోందని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల ప్రాథమిక విచారణలో తేజస్విని భయాలకు సంబంధించిన మానసిక సమస్య (ఫోబియా)తో బాధపడుతున్నట్లు తెలిసింది. తల్లి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.




