AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. ఉచిత ప్రయాణాల వేళ RTC బస్సులో ఇంట్రెస్టింగ్ సీన్‌

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉచిత బస్సు హవా నడుస్తుంది. ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పటి నుంచి మహిళాలోకం యదేచ్ఛగా విహరిస్తోంది. అంతేనా.. సీటు కోసం సిగపట్లు నుంచి అడ్డొచ్చిన కండక్టర్‌ను వీరకుమ్ముడు కుమ్మే వరకు చాలానే వింతలు, విడ్డూరాలు జరిగాయి. తాజాగా మరో వింత ఓ ఆర్టీసీ బస్సులో కంటపడింది. ఏం చేద్దాం బాస్‌.. కాలం మారింది అంటూ అందరూ ముసిముసిగా నవ్వేస్తున్నారు. ఆ కథాకమామిషు ఏమిటో తెలుసుకుందాం..

‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’.. ఉచిత ప్రయాణాల వేళ RTC బస్సులో ఇంట్రెస్టింగ్ సీన్‌
Viral TGSRTC Bus Board Message
Srilakshmi C
|

Updated on: Jul 17, 2026 | 12:10 PM

Share

ఆర్టీసీ బస్సుల్లో ముందు కొన్ని సీట్లు మహిళలకు, మిగిలిన వెనుక సీట్లను పురుషులకు కేటాయించడం దాదాపు ప్రతి బస్సులో కనిపించే సీన్‌ ఇది. అందులో మహిళా కోటాలోని సీట్ల వద్ద ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’ అని బోర్డులు కూడా దర్శనమిస్తాయి. అయితే ఓ ఆర్టీసీ బస్సులో వింత బోర్డు కనిపించింది. అంతే అదికాస్త నెట్టింట చర్చోపచర్చలకు దారి తీసింది. ఇంతకీ ఆ బోర్డులో ఏముందంటే.. సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో కనిపించే ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’ అనే సందేశానికి రాత్రికి రాత్రే అక్షరాలు మార్చేసి.. ‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం ’ అని రాసి ఉన్నట్లు కనిపించే ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అంతే అదికాస్త వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో సూర్యాపేట రూట్‌లో నడిచే TGSRTC బస్సులోనిదని సోషల్ మీడియాలో పలువరు నెటిజన్లు చెబుతున్నారు.

అయితే ‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’ అనే బోర్డు ఫొటో సోషల్‌ మీడియాలో కంటపడటమే ఆలస్యం.. పురుష మహానుభావులు ఇన్నాళ్లకు మాకు తగిన గౌరవం దక్కిదని ఆహా.. ఓహో అంటూ తెగ సంబరపడిపోతున్నారు. మరోవైపు ఈ ఫొటోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తూ నెట్టింట హల్‌ చల్ చేస్తున్నారు. ‘ఇన్నాళ్లకు మాకు కూడా గౌరవం దక్కింది’, ‘ఇకపై బస్సుల్లో మాకూ సీటు దొరికే అవకాశముంది’, ‘నిజంగా ఇది ఆర్టీసీ ఏర్పాటు చేసిన బోర్డేనా అంటూ’ అంటూ పలువురు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘హమ్మయ్యా.. కనీసం ఈ బోర్డు చూసైనా సీట్ ఇస్తారేమోనని’ మరికొందరు తెగ సంబరపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ ఫొటో నిజమైందా కాదా అనే సంగతి పక్కన బెడితే.. ఉచిత బస్సు ప్రయాణాలు వచ్చిన తర్వాత పురుషుల పరిస్థితి అదోగతి పాలైంది. మహిళామణులు దొరికిన మేరకు సీట్లలో తిష్టవేస్తుంటే.. కొందరు పురుషులు మాత్రం ఏం చేద్దాం.. ఇలానే ప్రయాణిద్దామని తమ స్టేజ్‌ వచ్చే వరకు నిలబడే ఎలాగోలా గమ్యం చేరితే చాలులే అని సర్దుకుపోతున్నారు. మరికొందరు పురుషులు తమ హక్కుల కోసం పోరాడి మరీ సీట్లు సంపాదించుకునే వారు కూడా లేకపోలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు నేపథ్యంలో బస్సుల్లో సీట్ల కొరత, ప్రయాణ అనుభవాలపై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక మీమ్స్, ట్రోల్స్, వీడియోలు, పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా ఫొటోపై తెలంగాణ ఆర్టీసీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఏది ఏమైనా ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో కనిపిస్తున్న ‘పురుషులను గౌరవించడం మన సంప్రదాయం’ అనే బోర్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Follow Us