టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. నందమూరి తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించేందుకు ఆయన ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. అక్కడే ఉన్న విజయసాయిరెడ్డితో మాట్లాడారు. వీరిని ఉద్దేశించి బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. కాగా, తారకరత్నకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మేనమామ వరుస అవుతారు. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి.. తారకరత్నకు స్వయాన మేనత్త. అలాగే తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి విజయసాయిరెడ్డికి వరుసకు కూతురు అవుతుంది. విజయసాయి రెడ్డి భార్య సోదరి కూతురే అలేఖ్య రెడ్డి. ఈ క్రమంలోనే తారకరత్న మృతితో విషాదంలో ఉన్న అలేఖ్య రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు విజయసాయిరెడ్డి అక్కడే ఉన్నారు.
అంతేకాక అక్కడికి వచ్చినవారితో నందమూరి కుటుంబ సభ్యులు, ఇతరులతో ఆయన మాట్లాడటమే కాకుండా జరగాల్సిన కార్యక్రమాల గురించి చర్చిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చంద్రబాబు, బాలకృష్ణ తదితరులతో కూడా విజయసాయిరెడ్డి మాట్లాడారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రత్యర్థులైన చంద్రబాబు, విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చొని మాట్లాడుతున్న ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరిద్దరు కూడా తారకరత్నకు ఇరువైపులా బంధువులు కావడంతో.. విషాద సమయంలో చేయాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటున్నారని అంతా భావిస్తున్నారు. చాలా వరకు ఈ ఘటనకు ఎలాంటి దురుద్దేశాలు అపాదించలేదు. కానీ బండ్ల గణేష్ మాత్రం ఈ ఫోటోను ట్టిట్టర్ వేదికగా షేర్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు.
నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం.
అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి…..!!! pic.twitter.com/ENGbX3oRP5— BANDLA GANESH. (@ganeshbandla) February 20, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.