Telangana: కాసేపట్లో అసెంబ్లీ సమావేశం.. నీళ్లపైనే యుద్ధం.. మాకు ఛాన్స్ ఇవ్వాలంటున్న బీఆర్ఎస్
కాసేపట్లో అసెంబ్లీ సమావేశం.. నీళ్లపైనే యుద్ధం. ప్రాజెక్టులపై చర్చే అజెండాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరగబోతోంది. విపక్షాలను ఎండగట్టేందుకు ప్రభుత్వం.. అధికారక్షం తప్పులను వేలెత్తి చూపేందుకు ప్రతిపక్షం సిద్ధమైంది. BRS ప్రశ్నలకు సమాధానంగా కొత్త వ్యూహంతో కాంగ్రెస్ వస్తోంది. అయితే.. తమకూ ఓ ఛాన్స్ ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్ కోరుతోంది. ఇక.. బీజేపీ కూడా అస్త్రాలతో సిద్ధమైంది.

నీటి వాటాలు, ప్రాజెక్టుల విషయంలో చర్చకు సిద్ధమా అనే సవాళ్లతో కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయం హీటెక్కింది. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. అసెంబ్లీ వేదికగా వాటర్‌పై డైలాగ్ వార్‌కు అన్ని పార్టీలు రెడీ అయ్యాయి. కృష్ణా, గోదావరి జలాల్లో వాటాలు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపైనే ఈ సారి అసెంబ్లీలో ప్రధాన చర్చ జరగనుంది. ఇవాళ కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, పదేళ్లలో జరిగిన పనులు, వినియోగించుకున్న నీళ్లు, చేసుకున్న ఒప్పందాలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. గత పదేళ్లలో తప్పులు జరిగాయంటున్న కాంగ్రెస్.. సభా వేదికగా ఆ తప్పులేంటో చెప్తామంటోంది. ఆధారాలతో సహా ప్రజలకు వివరిస్తామంటోంది.
నీళ్లు, నిజాలపై ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ ఇప్పటికే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన కల్పించారు. కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణకు ఉన్న హక్కులు.. ఏపీతో కొనసాగుతున్న జల వివాదాల తాజా పరిస్థితి.. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల తెలంగాణకు జరిగిన నష్టం.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉత్తమ్ వివరించారు. ఇక.. బీఆర్‌ఎస్ కూడా తమ అస్త్రాలతో సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ చేస్తున్న తప్పులు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామంటోంది. దీని కోసం తమకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించాలని కోరుతోంది. పక్క రాష్ట్రాలు నీళ్ల దోపిడీ చేస్తుంటే.. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోవడమే కాకుండా పదేళ్లలో చేసిన పనులపైనా కాంగ్రెస్ అబద్ధాలు చెప్తోందనేది బీఆర్‌ఎస్ వాదన. అయితే.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ రెండే. ఆ రెండు పార్టీల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. అసెంబ్లీ వేదికగా ఆ రెండు పార్టీలను ఎండగడతామంటోంది. మొత్తంగా.. అసెంబ్లీ వేదికగా నీళ్లపై నిప్పులు చెరగబోతున్నారు నేతలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




