My Home Cements: ఆ ఆరోపణలన్నీ అవాస్తవం.. మేళ్లచెరువు భూములపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మైహోం సంస్థ..
My Home Cements: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మైహోం సిమెంట్స్ పరిశ్రమలో కొత్తగా నిర్మిస్తున్న 4వ యూనిట్‌కు అనుమతులు లేవని వచ్చిన..
My Home Cements: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మైహోం సిమెంట్స్ పరిశ్రమలో కొత్తగా నిర్మిస్తున్న 4వ యూనిట్‌కు అనుమతులు లేవని వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని మైహోం సిమెంట్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ యూనిట్ నిర్మాణానికి సంబంధించి అన్ని రకాల అనుమతులు తీసుకున్నామని, సంబంధిత ప్రభుత్వ శాఖలకు అన్ని వివరాలు సమర్పించినట్లు చెప్పారు మైహోం సిమెంట్స్ మేళ్లచెరువు యూనిట్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు. ఈ యూనిట్ లోని సర్వే నెంబర్ 1057లో భాగంగా ఉన్న భూములకు సంబంధించి కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని వివరించారు.
ఈ భూములకు సంబంధించిన వివాదంపై కంపెనీ యాజమాన్యం గతంలోనే హైకోర్టు ద్వారా తగిన ఉత్తర్వులు పొందిందని, ఆ ఉత్తర్వులకు అనుగుణంగానే తాము వ్యవహరిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు శ్రీనివాస్‌రావు. ఈ భూముల్లో కూడా ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టడం లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఒక పిటిషన్‌ను లోక్ అదాలత్ సుమోటోగా స్వీకరించినట్లు కొందరు చేస్తున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. ఈ భూములను ఖాళీ చేయాలని రెవెన్యూశాఖ అధికారులు తమకు నోటీసు ఇచ్చినట్లు చేస్తున్న ప్రచారం కూడా అవాస్తవమని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు అందలేదన్నారు.
రైతుల నుంచి రిజిస్టర్డ్ దస్తావేజుల ద్వారా కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసిన ఈ భూమికి సంబంధించిన రికార్డులన్నింటినీ గతంలో రెవెన్యూశాఖ అధికారులు పరిశీలించి మ్యుటేషన్ చేయడంతో పాటు కన్వర్షన్ అనుమతులు కూడా ఇచ్చినట్లు వివరించారు. ప్లాంటు నిర్మాణానికి సంబంధించిన అనుమతులు ఇతర ఆధార పత్రాలను సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులకు గతంలోనే ఇచ్చామన్నారు. కొత్త ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి దురుద్దేశ పూర్వకంగా కావాలని కొందరు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది మైహోం సిమెంట్స్ యాజమాన్యం.