Telangana: పుష్పరాజ్‌నే మించిపోయారు కదరా.! జేసీబీతో తవ్వుతుండగా కుప్పలు తెప్పలుగా..
తెలంగాణలో కల్తీ మద్యం పెరిగిపోతోంది. మందుబాబులకు అలర్ట్.! మీరు బ్రాండెడ్ అని తాగుతున్న మద్యం నకిలీదనీ మీకు తెలుసా.? ప్రజల ప్రాణాలకు హాని కలిగించే స్పిరిట్‌తో కేటుగాళ్లు యథేచ్ఛగా కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. వేర్వేరు బ్రాండ్ల వారీగా నకిలీ లేబుళ్లు, స్టిక్కర్లను అంటిస్తూ విక్రయాలు సాగిస్తున్నారు.

రాష్ట్రంలో వెలుగు చూసిన కల్తీ మద్యం రాకెట్ మందుబాబులను కలవరపెడుతోంది. పట్టుబడ్డ కల్తీ మద్యం రాకెట్‌లో.. ఏకంగా 178 బ్రాండ్లను కల్తీ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఏపీలోని గుంటూరు జిల్లా రేపల్లెలో ఎక్సైజ్ పోలీసులు కల్తీ మద్యాన్ని పట్టుకున్నారు. దీంతో తీగలాగితే డొంకంతా కదిలినట్టు తెలంగాణలో ఈ రాకెట్ గుట్టురట్టు అయింది.
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంకు చెందిన శివశంకర్.. ఆ ప్రాంతంలో మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నాడు. ఈజీ మనీ కోసం మద్యం తయారీకి పథకం వేశాడు. తన స్నేహితుడు సూర్య ప్రకాష్, ఏపీ దుర్గికి చెందిన శ్రీరామ్ మహేష్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రామాపురంకు చెందిన స్నేహితుడు సూర్య ప్రకాష్‌కు చెందిన పాతబడిన రైస్ మిల్లును నకిలీ మద్యాన్ని తయారీ కేంద్రంగా చేసుకున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఫార్మా కంపెనీల నుంచి ఈ ముఠా రెక్టిఫైడ్ స్పిరిట్‌ను కొనుగోలు చేసి.. నీళ్లు కలిపి.. కల్తీ మద్యాన్ని తయారు చేస్తోంది. ఒరిజినల్ ఖాళీ బాటిల్స్‌ను సేకరించి అందులో సగం నీళ్లు, కొంత స్పిరిట్, కొంత మద్యం కలిపి.. సీల్ వేసి కల్తీ మద్యాన్ని తయారు చేశారు.
ఈ కల్తీ ఒకటి రెండు బ్రాండ్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఏకంగా 178 బ్రాండ్లనే కల్తీ చేశారు. ఇక్కడ తయారు చేసిన కల్తీ మద్యాన్ని ఏపీలోని పలు ప్రాంతాలకు సరఫరా చేసింది. తాజాగా గుంటూరు జిల్లా రేపల్లెలో మద్యం షాపు తనిఖీల్లో కల్తీ మద్యం బయటపడింది. దీంతో తీగలాగితే డొంక కదిలినట్టుగా ఈ రాకెట్ గుట్టు రట్టయింది. నాలుగు రోజుల క్రితం ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మేళ్లచెరువు మండలంలోని రామాపురంలోని పాతబడిన రైస్ మిల్‌పై దాడి చేశారు. 38 కార్టన్ల ఎంసీ విస్కీ క్వార్టర్ సీసాలు, 11,800 ఖాళీ బాటిళ్లు, 42.8 కిలోల మూతలు, 7,814 లేబుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ రైస్ మిల్లులో 8 నెలలుగా కల్తీ మద్యం తయారవుతున్నట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నకిలీ మద్యాన్ని విక్రయించేందుకు పెద్ద ఎత్తున తయారీకి సిద్ధమైనట్లు ఎక్సైజ్ పోలీసులు తేల్చారు.
కల్తీ మద్యం దందా నిర్వహిస్తున్న తీరు చూసి పోలీసులే అవాక్కయ్యారు. తయారు చేసిన నకిలీ మద్యాన్ని పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు కల్తీగాళ్లు పంట పొలాల్లో గుంతలు తీసి దాచారు. జెసీబీలతో తవ్వకాలను చేపట్టి కల్తి మద్యాన్ని ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెలికి తీశారు. ఇప్పటివరకు రూ. 22.50 లక్షల నకిలీ మద్యం నిల్వలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మేళ్లచెరువు మండలంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎక్సైజ్ పోలీసులు సోదా చేయాలని భావించారు. ఎక్సైజ్ పోలీసులు నిర్వహిస్తున్న దాడుల్లో ఇప్పటికే భారీగా నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఈ రాకెట్‌లో నిందితులైన రామాపురకు చెందిన సూర్య ప్రకాష్, ఏపీలోని దుర్గికి చెందిన శ్రీరామ్ మహేష్‌లను అరెస్ట్ చేశారు. ఈ రాకెట్‌లో కీలక నిందితుడుగా భావిస్తున్న శివ శంకర్ పరారీలో ఉన్నాడు. వీరితో పాటు వీరికి స్పిరిట్, నకిలీ లేబుళ్లు సరఫరా చేసిన రూతుల శ్రీనివాస్, శివ చరణ్ సింగ్( కృష్ణా ఫార్మా)లపై ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న రాకెట్‌పై ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
