Divyavani: బీజేపీలోకి నటి దివ్యవాణి.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో భేటీ.. కీలక విషయాలపై చర్చ..!
దివ్యవాణి BJPలో చేరాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. దీనిపై హైకమాండ్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈటల దివ్యవాణికి చెప్పారు.
Actress Divyavani meets MLA Etela Rajender: టీడీపీకి ఇటీవల గుడ్‌బై చెప్పిన నటి దివ్యవాణి కీలక నిర్ణయం తీసుకున్నారు. BJPలో చేరాలని తాజాగా నిర్ణయించుకున్నారు. ఇదే అంశంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో గురువారం చర్చించారు. ప్రస్తుతం BJPలో చేరికల కమిటీకి కన్వీనర్‌గా ఉన్న ఈటల రాజేందర్‌ను ఆమె మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా దివ్యవాణి BJPలో చేరాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. దీనిపై హైకమాండ్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈటల దివ్యవాణికి చెప్పారు.
తెలంగాణలో పార్టీ మరింతగా జనంలోకి వెళ్లాలంటే సినీ గ్లామర్ కూడా అవసరం అని BJP భావిస్తోంది. దీనిలో భాగంగానే జయసుధ లాంటి వాళ్లతో ఇప్పటికే చర్చలు జరిగాయి. ఇప్పుడు దివ్యవాణి కమలం పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
తెలంగాణతో పాటు దక్షిణాది ఎక్కడైనా పనిచేస్తాననే మాట దివ్యవాణి చెప్పినట్టు తెలుస్తోంది. సౌత్‌లో పలు భాషల్లో సినిమాలు చేసి ఉండడం.. అదేవిధంగా టీడీపీలో పనిచేయడం లాంటివి ప్లస్ అవుతుందనే భావనను ఆమె వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీలోకి దివ్యవాణిని ఆహ్వానించే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలంగాణ బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
అంతకుముందు నటి దివ్య వాణి ఏపీ టీడీపీలో క్రీయాశీలకంగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ దివ్యవాణి జూన్‌లో టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆమె తెలంగాణ బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..