Kothagudem: అమ్యామ్యాలకు అలవాటు పడి అడ్డంగా బుక్కయిన అటవీ అధికారులు..
కొత్తగూడెం అటవీ శాఖలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు రూ.28 లక్షల లంచం డిమాండ్ చేసి, మొదటి విడతగా రూ.3.50 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. .. ..

కొత్తగూడెం అటవీ శాఖలో ఏసీబీ దాడులు సంచలనంగా మారాయి. ఏకంగా రూ.28 లక్షల లంచం డిమాండ్ చేశారంటే వీళ్లు మామూలు అధికారులు కాదని జనం చర్చించుకుంటున్నారు. ఇంత భారీ మొత్తంలో లంచం అడగడం, మొదటి విడతగా రూ.3.50 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద కేసుగా మారింది. ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో డివిజనల్ మేనేజర్‌గా పనిచేస్తున్న తాటి శ్రావణి, ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్‌లు తమ కింది స్థాయి అధికారుల ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో అధికారులు వారిని పట్టుకున్నారు. ఫారెస్ట్‌లో జామాయిల్ చెట్ల కటింగ్ కాంట్రాక్టును దక్కించుకున్న ఓ వ్యక్తికి, చెట్ల కటింగ్‌కు గాను ఒక్కో టన్నుకు రూ.750 చొప్పున ప్రభుత్వం చెల్లించేలా ఒప్పందం ఉంది. అయితే ఆ బిల్లులను క్లియర్ చేయాలంటే చండ్రుగొండ మండలం సీతాయి గూడెంలో ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్, అతని పై అధికారి శ్రావణి కలిసి ఒక్కో టన్నుకు రూ.150 చొప్పున మొత్తం 32 వేల టన్నులకు గాను రూ.28 లక్షలకు పైగా లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించాడు.
లంచం డిమాండ్‌ను భరించలేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగారు. చర్చల అనంతరం టన్నుకు రూ.90 చొప్పున కుదిర్చుకుని, మొదటి బిల్లుకు సంబంధించిన రూ.3.50 లక్షలను లంచంగా ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఈ మొత్తాన్ని తీసుకునేందుకు వచ్చిన సూపర్‌వైజర్ కృష్ణయ్యను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో భాగంగా అధికారులు కార్యాలయాలతో పాటు సంబంధిత అధికారుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. సేకరించిన ఆధారాల ఆధారంగా సూపర్‌వైజర్ కృష్ణయ్యతో పాటు డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణి, ప్లాంటేషన్ మేనేజర్ రాజేందర్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇద్దరు అధికారులు హైదరాబాద్‌లో ఉన్నారని, వారు తిరిగి వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ, ఏ పని చేయించేందుకు అయినా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని కూడా ఆయన భరోసా ఇచ్చారు.
