AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు అలర్ట్.. సిలబస్‌లో భారీ మార్పులు.. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన

Ashwini Vaishnaw: దేశ సాంకేతిక ప్రయాణంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల మెదళ్లకు AI పదును పెట్టేలా, సిలబస్‌లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడమే ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశం. దీన్ని గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

విద్యార్థులకు అలర్ట్.. సిలబస్‌లో భారీ మార్పులు.. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన
Education Syllabus Revamp Announced By Ashwini Vaishnaw
Krishna S
|

Updated on: Feb 19, 2026 | 10:14 AM

Share

ఏఐ రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారతదేశం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశాన్ని ఒక AI పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యంగా పాఠశాల, కాలేజీ స్థాయి సిలబస్‌లను పూర్తిగా సవరించనున్నట్లు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు. కేవలం సిద్ధాంత పరమైన విద్య కంటే విద్యార్థులకు క్షేత్రస్థాయిలో ఉపయోగపడే ఆచరణాత్మక జ్ఞానం అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. పాఠశాలలు, కళాశాలలకు అత్యాధునిక AI సాధనాలను ప్రభుత్వం అందిస్తుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. విద్యార్థులు కేవలం సాంకేతికతను నేర్చుకోవడమే కాకుండా సమస్యలకు కొత్త పరిష్కారాలను స్వయంగా అభివృద్ధి చేసేలా ప్రోత్సహిస్తారు. దేశ అసలైన బలం ఇక్కడి సాంకేతిక ప్రతిభలోనే ఉందని, మౌలిక సదుపాయాల కంటే ఈ ప్రతిభను పెంపొందించడమే అత్యంత ముఖ్యమని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు.

గ్రామీణ యువతే లక్ష్యం

పట్టణ, గ్రామీణ యువత మధ్య ఉన్న సాంకేతిక అంతరాన్ని తగ్గించడమే ఈ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యమని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ‘‘గ్రామీణ యువత తమ గ్రామాల నుంచే ప్రపంచ స్థాయి స్టార్టప్‌లను నిర్మించగలగాలి. వారికి ఏఐ సాధనాలపై పట్టు సాధించేలా శిక్షణ ఇవ్వడం ద్వారా ఇది సాధ్యమవుతుంది’’ అని వైష్ణవ్ తెలిపారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ వంటి సంస్థలు పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దడాన్ని ఆయన అభినందించారు. సెమీకండక్టర్, టెలికాం రంగాల్లో సాధించిన పురోగతి తరహాలోనే ఇకపై AI మిషన్ తదుపరి దశ పనులు వేగవంతం కానున్నాయి.

ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న AI ఇంపాక్ట్ సమ్మిట్

ప్రధాని మోదీ ఫిబ్రవరి 16న ప్రారంభించిన ఈ సమ్మిట్, గ్లోబల్ సౌత్‌లో జరుగుతున్న మొట్టమొదటి అంతర్జాతీయ AI సదస్సు కావడం విశేషం. సర్వజన హితాయ – సర్వజన సుఖాయ అనే థీమ్‌తో ఇది సాగుతోంది. 20 కంటే ఎక్కువ దేశాల దేశాధినేతలు, వేలాది మంది సాంకేతిక నిపుణులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటున్నారు. ఈ సదస్సు ఫిబ్రవరి 20 వరకు కొనసాగుతుంది. దేశంలో ప్రతిభకు కొరత లేదని, యువత భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే భారత్ ప్రపంచ AI పటంలో అగ్రస్థానంలో నిలుస్తుందని అశ్విని వైష్ణవ్ ధీమా వ్యక్తం చేశారు.

Follow Us