Khammam: నడిరోడ్డుపై పెద్దమ్మను హత్య చేసిన దుండగుడు.. ఎందుకంటే..?
ఖమ్మం నగరంలో ఆస్తి వివాదం రక్తపాతంగా మారింది. వరుసకు అన్నను హత్య చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి, అతడు ఇంట్లో లేకపోవడంతో సొంత పెద్దమ్మపై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన నగరాన్ని షాక్‌కు గురిచేసింది. .. ...

ఖమ్మం నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదం నేపథ్యంలో సొంత పెద్దమ్మను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వరుసకు అన్నను హత్య చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి, అతడు ఇంట్లో లేకపోవడంతో పెద్దమ్మపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఖమ్మం నగరానికి చెందిన మోతే రాములమ్మ (70) ఇంటి ముందు మిరపకాయలు వలుస్తూ ఉండగా, ఆమె మరిది కొడుకు శేఖర్ అకస్మాత్తుగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. పలుమార్లు కత్తితో పొడవడంతో రాములమ్మ రక్తపు మడుగులో రోడ్డుపై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందింది.
గత కొంతకాలంగా వారి కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో తీవ్ర వివాదాలు నడుస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలుస్తోంది. అనంతరం కోర్టులో కేసు కొనసాగుతుండగా, కుటుంబ సభ్యులు అడ్డుగా ఉన్నారని భావించిన నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, అన్న అయిన నరసింహారావును హత్య చేయాలనే పథకంతో శేఖర్ ముందుగా అతనికి ఫోన్ చేయగా, అతడు ఇంట్లో లేడని తెలిసింది. దీంతో ఇంటికి వెళ్లి అక్కడున్న పెద్దమ్మ రాములమ్మపై కత్తితో దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో బండ్ల మహేష్ అనే వ్యక్తి అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతనికి కూడా గాయాలయ్యాయి.
సుమారు 27 ఎకరాల భూమి వివాదమే ఈ హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. నిందితుడు శేఖర్‌పై ఇప్పటికే రౌడీషీటర్‌గా పేరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ ఆస్తి వివాదాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి స్పష్టంగా చూపుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
