ప్రభుత్వాన్ని నడుపుతుంది మేమే.. మరణాల సంఖ్య పెంచేందుకు అవకాశం ఇవ్వండి.. బెల్ట్ షాప్‌ల వ్యవహారంపై యువకుడు వినూత్న ఫిర్యాదు!
బెల్టు షాపుల వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ అధికారులకు ఓ యువకుడు చేసిన ఫిర్యాదు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిర్మల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఎక్సైజ్ శాఖ అధికారులకు వినూత్న ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వాన్ని నడుపుతుంది మేమే.. రాష్ట్రంలో మరణాల సంఖ్య పెంచేందుకు, గ్రామాలను ఆగం చేసేందుకు మాకు మరింత అవకాశం ఇవ్వండి అంటూ ఆ ఫిర్యాదు పేర్కొన్నాడు. అది చూసిన పోలీసులు అవాక్కయ్యారు.

తరతరాలుగా రాష్ట్ర సర్కారుకు ఆదాయంగా మారి.. పల్లెలు పట్నాలు అన్న తేడా లేకుండా రాత్రి పగలు.. అర్థరాత్రిల్లు అయితే మరింతగా శ్రమిస్తూ.. కంటి మీద కునుకు లేకుండా కష్టపడుతున్న మద్యం షాపులపై స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ పేరితో చర్యలు తీసుకోవద్దంటూ ఓ యువకుడు ఎక్సైజ్ శాఖ అధికారులకు వినూత్న ఫిర్యాదు చేశాడు. యువత, ముసలి, ముతక అన్న తేడా లేకుండా జనాలందరిని బానిసలుగా చేస్తూ దేశానికి పట్టుకొమ్మలాంటి పల్లెలను ఆగం చేస్తున్న బెల్ట్ షాపులను బతికించి సర్కారు ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా భైంసా మండలం కోతుల్గాం గ్రామానికి చెందిన సుదీప్ అనే యువకుడు గతంలో ఎంపిటిసీగా పనిచేశాడు. తన హయాంలో అక్రమంగా నిర్వహించిన బెల్ట్‌షాపుల బెండు తీశాడు. అయితే ప్రస్తుతం ఇతను మాజీ కావడంతో స్థానికంగా ఉన్న బెల్ట్‌షాపుల నిర్వహాకులు రెచ్చిపోయి దందాలు నిర్వహిస్తున్నారు. దీంతో వాటికి అడ్డుకట్టవేసేందుకు సుదీప్ ఇలా వినూత్నంగా ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తను చేసిన ఫిర్యాదులో బెల్ట్ షాప్‌ల వల్ల జరుగుతున్న నష్టాలను వినూత్నంగా వివరించాడు. భైంసా ఎక్సెజ్ పరిధిలోని గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ సహకారంతో వి.డి.సి లు విజయవంతంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నాయని.. రాత్రి పగలు తేడా లేకుండా బెల్ట్ షాపుల నిర్వహకుల అందిస్తున్నకృషితో అనేక కుటుంబాలు తరచూ గొడవలు పడుతున్నాయని అతని పేర్కొన్నాడు.
తాగుడుకు బానిపై యువత చెడిపోవడం, 10 ఏళ్లు కూడా నిండని మైనర్లను సైతం దర్జాగా చెడుదారి పట్టించడంతో బెల్ట్ షాపులు సక్సెస్ అవుతున్నాయని రాసుకొచ్చాడు. యువత తాగి ఆత్మహత్యలు చేసుకోవడంలోను బెల్ట్ షాపుల చేస్తున్న కృషి అమోఘమని.. ఇంతటి ఘనత వహించిన బెల్ట్ షాపులను.. స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్నికల కోడ్ పేరితో ఇబ్బందులకు గురి చేయవద్దని పేర్కొన్నాడు. బెల్టుషాపుల యథావిధిగా నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




