AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket News : కివీస్ గుండెల్లో వణుకు మొదలైంది..60 రోజుల తర్వాత బ్యాట్ పట్టిన స్టార్ ప్లేయర్

Cricket News : కొత్త ఏడాదిలో కివీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. జనవరి 11 నుంచి వన్డే సిరీస్, జనవరి 21 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ, వన్డే జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ క్రమంలో అయ్యర్ ఫిట్‌నెస్ సాధించడం జట్టుకు పెద్ద ఊరట.

Cricket News : కివీస్ గుండెల్లో వణుకు మొదలైంది..60 రోజుల తర్వాత బ్యాట్ పట్టిన స్టార్ ప్లేయర్
Shreyas Iyer
Rakesh
|

Updated on: Dec 26, 2025 | 9:15 AM

Share

Cricket News : టీమిండియా స్టార్ బ్యాటర్, వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. గత రెండు నెలలుగా గాయంతో ఆటకు దూరంగా ఉన్న అయ్యర్, మళ్ళీ బ్యాట్ పట్టారు. సరిగ్గా 60 రోజుల విరామం తర్వాత ఆయన నెట్స్‌లో చెమటోడ్చడం చూస్తుంటే, త్వరలో జరగబోయే న్యూజిలాండ్ సిరీస్‌తో ఆయన రీ-ఎంట్రీ ఖాయమనిపిస్తోంది. కొత్త ఏడాదిలో కివీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. జనవరి 11 నుంచి వన్డే సిరీస్, జనవరి 21 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ, వన్డే జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ క్రమంలో అయ్యర్ ఫిట్‌నెస్ సాధించడం జట్టుకు పెద్ద ఊరట.

అసలు శ్రేయస్ అయ్యర్‌కు ఏమైందంటే.. గతేడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సిడ్నీ వేదికగా జరిగిన చివరి వన్డేలో ఒక క్యాచ్ పట్టే క్రమంలో డైవ్ చేయగా, అయ్యర్ పక్కటెముకలకు బలమైన దెబ్బ తగిలింది. ఇది ఎంత తీవ్రమైందంటే అక్కడే ఆయనకు సర్జరీ చేయాల్సి వచ్చింది. కొన్ని రోజుల పాటు ఆస్ట్రేలియాలోని ఆసుపత్రిలోనే చికిత్స పొందిన అయ్యర్, ఆ తర్వాత సౌతాఫ్రికా సిరీస్‌కు కూడా దూరమయ్యారు. సుమారు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత, ఇప్పుడు పూర్తిస్థాయిలో కోలుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

తాజా సమాచారం ప్రకారం.. డిసెంబర్ 24న ముంబైలో శ్రేయస్ అయ్యర్ సుమారు గంటసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సమయంలో ఆయనకు ఎటువంటి నొప్పి కానీ, అసౌకర్యం కానీ కలగలేదని తెలుస్తోంది. ఆ మరుసటి రోజే (డిసెంబర్ 25) ఆయన బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి చేరుకున్నారు. అక్కడ సుమారు వారం రోజుల పాటు మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉంటారు. అయ్యర్ ఫిట్‌నెస్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, ఆయన వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది వైద్యులు నిర్ణయిస్తారు.

న్యూజిలాండ్ సిరీస్‌లో అయ్యర్ ఆడటం అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. జనవరి మొదటి వారంలో వన్డే జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. ఒకవేళ అప్పటికి అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే, ఆయనను జట్టులోకి తీసుకుంటారు. అయితే నేరుగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు ముందు ఆయన తన సత్తాను నిరూపించుకోవడానికి విజయ్ హజారే ట్రోఫీలో కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఏదేమైనా టీమిండియా మిడిల్ ఆర్డర్ వెన్నెముక అయిన శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడం జట్టుకు పెద్ద బలం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..