AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma Golden Duck : హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కు షాక్..సెంచరీ తర్వాత సున్నాకే చుట్టేసిన రోహిత్ శర్మ

Rohit Sharma Golden Duck : టీమిండియా స్టార్ బ్యాటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ క్రికెట్ అభిమానులకు ఒకే వారంలో రెండు రకాల అనుభూతులను మిగిల్చాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరపున బరిలోకి దిగిన రోహిత్, మొదటి మ్యాచ్‌లో సిక్కింపై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 155 పరుగులు బాదాడు.

Rohit Sharma Golden Duck : హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కు షాక్..సెంచరీ తర్వాత సున్నాకే చుట్టేసిన రోహిత్ శర్మ
Rohit Sharma Golden Duck
Rakesh
|

Updated on: Dec 26, 2025 | 9:54 AM

Share

Rohit Sharma Golden Duck : టీమిండియా స్టార్ బ్యాటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ క్రికెట్ అభిమానులకు ఒకే వారంలో రెండు రకాల అనుభూతులను మిగిల్చాడు. విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరపున బరిలోకి దిగిన రోహిత్, మొదటి మ్యాచ్‌లో సిక్కింపై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 155 పరుగులు బాదాడు. అయితే అదే ఊపులో రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ బాదుతాడని ఆశించిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ అనూహ్యంగా గోల్డెన్ డక్(తొలి బంతికే అవుట్)గా వెనుదిరిగాడు.

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో రోహిత్ శర్మ ఆట తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 24న జరిగిన తొలి మ్యాచ్‌లో సిక్కిం బౌలర్లను ఉతికేసిన రోహిత్, కేవలం 62 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, మొత్తంగా 94 బంతుల్లో 155 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు, 9 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. సుమారు 20 వేల మంది ప్రేక్షకులు ఆ విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూసి ఎంజాయ్ చేశారు. దీంతో రెండో మ్యాచ్‌లోనూ అదే రేంజ్‌లో రికార్డులు బద్దలు కొడతాడని వేలాది మంది ఫ్యాన్స్ మళ్ళీ స్టేడియానికి క్యూ కట్టారు.

కానీ, ఉత్తరాఖండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో సీన్ రివర్స్ అయింది. క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ, ఎదుర్కొన్న మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. కనీసం ఖాతా తెరవకుండానే అవుట్ అవ్వడంతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. సిక్కిం లాంటి చిన్న జట్టుపై చెలరేగి, కాస్త పటిష్టమైన ఉత్తరాఖండ్ బౌలింగ్ ముందు ఇలా డకౌట్ అవ్వడంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అయినప్పటికీ రోహిత్ లాంటి దిగ్గజ ఆటగాడికి ఇవి సహజమేనని, తర్వాతి మ్యాచ్‌లో మళ్ళీ పుంజుకుంటాడని నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు.

టాస్ గెలిచిన ఉత్తరాఖండ్ బౌలింగ్ ఎంచుకోవడంతో రోహిత్ బ్యాటింగ్ చూడటానికి ఎక్కువ సేపు వేచి చూడాల్సిన అవసరం లేదని ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. కానీ వారి ఆనందం కేవలం ఆరు బంతులకే పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే ఈ వికెట్ పడటంతో స్టేడియం మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయింది. ముంబై ఓపెనర్ అంగ్రిష్ రఘువంశీ మొదటి ఐదు బంతులు ఆడి సింగిల్ తీయగా, ఆరో బంతికి రోహిత్ శర్మ స్ట్రైకింగ్‌లోకి వచ్చారు. ఉత్తరాఖండ్ పేసర్ దేవేంద్ర బోరా వేసిన ఆ బంతిని రోహిత్ తనదైన శైలిలో పిక్-అప్ పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించారు. అయితే బంతి సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో నేరుగా ఫీల్డర్ జగన్మోహన్ నగర్ కోటి చేతుల్లోకి వెళ్ళింది. ఎదుర్కొన్న మొదటి బంతికే సున్నా పరుగులకు అవుట్ కావడంతో రోహిత్ నిరాశగా వెనుదిరిగారు. యువ బౌలర్ దేవేంద్ర బోరాకు ఇది కెరీర్‌లోనే మరచిపోలేని వికెట్‌గా నిలిచిపోయింది.

హిట్‌మ్యాన్ అవుట్ అవ్వగానే స్టేడియంలోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కేవలం రోహిత్ బ్యాటింగ్ చూడటానికే వచ్చిన వందలాది మంది అభిమానులు, ఆయన అవుట్ అవ్వగానే నిరాశతో స్టేడియం నుంచి బయటకు వెళ్ళిపోయారు. 38 ఏళ్ల వయసులోనూ రోహిత్ ఫామ్ మీద భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఈ గోల్డెన్ డక్ క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఒక మ్యాచ్‌లో సెంచరీ, మరో మ్యాచ్‌లో డకౌట్ అవ్వడం రోహిత్ కెరీర్‌లో ఇది మొదటిసారి కాదని, ఆయన మళ్ళీ బలంగా పుంజుకుంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో రోహిత్ విఫలమైనా, ముంబై జట్టులోని ఇతర ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ ఆడటం వల్ల ఈ టోర్నీకి గతంలో ఎన్నడూ లేని క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా జైపూర్ స్టేడియం రోహిత్ బ్యాటింగ్ చూడాలనుకునే ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోతోంది. ఈ మ్యాచ్‌లో నిరాశపరిచినా, తర్వాతి పోరులో హిట్‌మ్యాన్ మళ్ళీ తన మార్కు సిక్సర్లతో విరుచుకుపడతాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..