Telangana: తెలంగాణ పాలిటిక్స్‌లో కొత్త ట్రెండ్.. రాజీనామాకు సై అంటున్న అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి..!
తెలంగాణ రాజకీయాల్లో తొడగొట్టుడు, మీసం తిప్పుడు సవాల్లే కాదు.. ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీల దాకా రాజీనామా సవాళ్లతో రంజు కట్టిస్తున్నారు.

Assembly Speaker Pocharam Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో తొడగొట్టుడు, మీసం తిప్పుడు సవాల్లే కాదు.. ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీల దాకా రాజీనామా సవాళ్లతో రంజు కట్టిస్తున్నారు. మంత్రులు మొదలు.. ఎమ్మెల్యేల దాకా చివరకు అసెంబ్లీ స్పీకర్ కూడా నేను సైతం అంటూ.. విపక్షాలకు రాజీనామా సవాల్ విసరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
టీఆర్ఎస్ అవిర్భావం నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. త్వరలో ఆయన ప్రతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జోరందుకుంది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం దానికి కౌంటర్‌గా అధికార పార్టీ నేతలు అటాక్ చేయడం నిత్యం చూస్తూనే ఉంటాం.. కానీ, ఈ మధ్య అధికారంలోని ముఖ్య నేతలను విపక్ష పార్టీల నేతలు టార్గెట్ చేయడంతో అందుకు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. దీంతో సీరియస్‌గా ఉన్న గులాబీ నేతలు ఏకంగా రాజీనామా సవాల్ లు విసురుతూ.. రా చూసుకుందాం అంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు అంటే ఒకే అనుకుందాం.. ఏకంగా శాసనసభ స్పీకర్ కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి విషయంలో అంటూ సవాల్ విసరడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు చింతలపల్లిలో దీక్ష పెట్టి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూనే.. మంత్రి మల్లారెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు. దానికి మంత్రి ఘాటుగా రియాక్ట్ అవుతూ “దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చెయ్.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా” అంటూ తొడగొట్టడం బర్నింగ్ టాపిక్ అయింది. అటుమల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. అటు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం బీజేపీ నిజామాబాద్ ఎంపీకి సవాల్ విసిరి..“నాపై పోటీకి రా నేను రాజీనామా చేస్తా” అంటూ నిజామాబాద్ రాజకీయ లను హిట్ ఎక్కించారు..
అయితే, ఎమ్మెల్యేలు,మంత్రుల సంగతి పక్కన బెడితే, తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా విపక్షలకు రాజీనామా సవాల్ విసరడం ఇప్పుడు ట్రెండింగ్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ అయిన జరిగినట్టు నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధం అంటూ మీడియా ముఖంగానే సవాల్ విసిరారు. ఇక, ఇప్పటికే రాజీనామా చేసి ఉప ఎన్నిక బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్.. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజీనామా సవాల్ విసిరారు.
మొత్తానికి తెలంగాణలో వరుసబెట్టి రాజీనామా సవాళ్లు తెరపైకి రావడంతో.. మళ్ళీ ఏమైనా ముందస్తు ప్లాన్ ఉందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో నెలకొనడం కొసమెరుపు.
శ్రీధర్ ప్రసాద్, టీవీ9 రిపోర్టర్..