అదిరిందయ్యా చంద్రం.. 95 ఏళ్ల వయస్సులోనూ సర్పంచ్‌గా విజయం.. రాష్ట్రంలో ఆయనొక్కరే..
ప్రస్తుత జీవన విధానంలో 60 ఏళ్లకే చాలా మంది అనారోగ్యానికి గురి అవుతున్నారు. కనీసం నడవలేక పోతున్నారు. కానీ ఇక్కడో 95 ఏళ్ల వయస్సులో ప్రజాసేవ చేయాలనుకున్నాడో నవ యువకుడు. ఆ వయసులోనూ ఆయన గ్రామ అభివృద్ధిని బాధ్యతగా తీసుకున్నాడు. అభివృద్ధి అనే పదాన్ని నినాదంగా ఎత్తుకొని పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. ఇంతకు ఆయనెవరు.. ఇది ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం పదండి.

వందేళ్లకు చేరువలో ఉన్న ఒక వ్యక్తి పంచాయతీ ఎన్నికల పోటీలో నిలబడటమే కాదు.. గెలిచి కూడా చూపించాడు. ఈ విజయంలో రాష్ట్రంలోనే అత్యధిక వయసు కలిగిన సర్పంచ్‌గా ఆయన రికార్డు సృష్టించారు సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికైన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి. యువత రాజకీయాల్లో ఆసక్తి చూపుతున్న వేళ.. ప్రజా సేవకు వయసుతో సంబంధం లేదని 95 ఏళ్ల రామచంద్రారెడ్డి నిరూపిస్తున్నారు.
ఊరంతా తన కుటుంబంలా భావించే రామచంద్రారెడ్డినీ నాగారం గ్రామస్తులు బాపూగా పిలుచుకుంటారు. గ్రామస్తుల ఒత్తిడి మేరకు రామ చంద్రారెడ్డి సర్పంచ్ అభ్యర్ధిగా బరిలో దిగారు. గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబెట్టేందుకు యువతతో రామచంద్రారెడ్డి పోటీ పడ్డారు. ఇంకేముంది.. వార్ వన్ సైడ్ అయ్యింది. 95 ఏళ్ల వయస్సులో ఆయన పోరాట స్ఫూర్తికి నాగారం జై కొట్టింది.180 ఓట్ల మెజారిటీతో రామ చంద్రారెడ్డి ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో 95 ఏళ్ల అత్యధిక వయస్సు కలిగిన సర్పంచ్ గా రామ చంద్రారెడ్డి రికార్డు సృష్టించారు.
ప్రజా సేవ చేసేందుకు వయస్సుతో సంబంధం లేదని, వయస్సు అనేది జస్ట్ నెంబర్ మాత్రమేనని 95 ఏళ్ల రామచంద్రారెడ్డి చెబుతున్నాడు. ఈ వయస్సులో కూడా ఆయన యువకుల కంటే ఫుల్ ఆక్టివ్ గా ఉన్నాడు. ఆది నుంచి సామాజిక సేవ చేసే నేపథ్యం కలిగిన కుటుంబం నుండి రామచంద్రారెడ్డి వచ్చాడు. గ్రామ సర్పంచ్ గా ఎన్నిక కావడంతో సొంతూరుకు సర్పంచ్ గా సేవ చేయాలనుకున్న నవ యువకుడు రామచంద్రారెడ్డి కల సాకారమైంది.
ప్రజా సేవ చేయాలనే తపన ఉందని.. అందుకే.. గ్రామాభివృద్ది కోసం.. తన శేష జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సతీమణి సుశీలమ్మ ఫౌండేషన్ తరపున గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానని రామచంద్రారెడ్డి చెబుతున్నాడు. దీంతో 95 ఏళ్ల వయస్సులో సర్పంచ్ పదవి చేపట్టిన రామ చంద్రారెడ్డి.. పదవీ విరమణ నాటికి వయస్సులో సెంచరీ కొట్టేస్తారు. సరిగ్గా అప్పటికి ఈ పెద్దాయనకు వందేళ్లు నిండుతాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




