Youtube: వీడియో క్రియేటర్స్‌కు పండగలాంటి వార్త చెప్పిన యూట్యూబ్.. ఇకపై మరింత సులువుగా
యూట్యూబ్ ద్వారా ఎంతో మంది వీడియో క్రియేటర్స్ తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నారు. రకరకాల వీడియోలను పోస్ట్ చేస్తూ డబ్బులు ఆర్జిస్తున్నారు. ఈ క్రమంలోనే వీడియో క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై వీడియోలను మరింత సింపుల్‌గా రూపొందించుకునేందుకు కొత్త యాప్‌ను తీసుకొస్తోంది. 'యూట్యూబ్ క్రియేట్' పేరుతో...

యూట్యూబ్ పేరు తెలియని సగటు వ్యక్తి లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని అట్రాక్ట్ చేసిందీ వీడియో ప్లాట్‌ఫామ్. ఏ చిన్నా సమాచారం కావాలన్నా వెంటనే యూట్యూబ్‌లో చూసే రోజులు వచ్చేశాయ్. అంతలా ఈ యాప్ మనిషి జీవితంలో భాగమైపోయింది. మారుతోన్న కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులు, చేర్పులు చేస్తూ యూట్యూబ్ తన యూజర్లను పెంచుకుంటూ పోతోంది. టిక్‌టాక్ వంటి యాప్స్ మార్కెట్లో సందడి చేస్తున్న తరుణంలో రీల్స్ పేరుతో యూట్యూబ్ సరికొత్త ఒరవడి సృష్టించింది.
ఇక యూట్యూబ్ ద్వారా ఎంతో మంది వీడియో క్రియేటర్స్ తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నారు. రకరకాల వీడియోలను పోస్ట్ చేస్తూ డబ్బులు ఆర్జిస్తున్నారు. ఈ క్రమంలోనే వీడియో క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై వీడియోలను మరింత సింపుల్‌గా రూపొందించుకునేందుకు కొత్త యాప్‌ను తీసుకొస్తోంది. ‘యూట్యూబ్ క్రియేట్’ పేరుతో ఈ యాప్‌ను పరిచయం చేయనుంది. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందించిన డ్రీమ్ సీన్ ఫీచర్‌ను సైతం యూట్యూబ్ పరీక్షిస్తోంది.
ఈ ఫీచర్ సహాయంతో యూట్యూబ్‌లో రూపొందించిన షార్ట్ వీడియోలకు నచ్చి వీడియోలు, ఫొటోలను బ్యాక్‌గ్రౌండ్‌లో సెట్ చేసుకోవచ్చు. ఏఐ ఆధారంగా రూపొందించిన వీడియోలు, ఫొటోలను ఇలా సెట్ చేసుకునే అవకాశం దక్కనుంది. ఈ యాప్‌లో ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ క్యాప్షనింగ్, వాయిస్ ఓవర్, ట్రాన్సిషన్స్ వంటి ఫీచర్స్ ఉంటాయి. ఈ యాప్‌ను ఉచితంగా అందించనున్నారు. ఇప్పటికే ఈ యాప్‌ను భారత్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇండోనేషియా, కొరియా, సింగపూర్‌లో ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. టెస్టింగ్ పూర్తికాగానే అందరికీ అందుబాటులోకి తేనున్నారు. ఇక వచ్చే ఏడాది ఐఓస్‌లోనూ ఈ యాప్‌ను తీసుకురానున్నారు.
ఇదిలా ఉంటే యూట్యూబ్‌లో వీడియోలు, షార్ట్స్ క్రియేట్ చేసుకునే వారి పనిని ఈ యాప్ మరింత సులువు చేయనుంది. సింపుల్ కమాండ్స్ ఆధారంగానే ఎంచక్కా వీడియోలకు గ్రాఫిక్ డిజైన్ ఇచ్చుకోవచ్చు. దీంతో క్రియేటర్స్ తమ వీడియోలకు మరిన్ని ఎక్కువ వ్యూస్ సంపాదించుకునే అవకాశం ఉందని యూట్యూబ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఇదే విషయమై యూట్యూబ్ కమ్యూనిటీ ప్రోడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ టోనీ మాట్లాడుతూ.. వీడియోలను క్రియేట్ చేయాలనుకునే వారికి, షేర్ చేయాలనుకునే వారి కోసం ఈ యాప్‌ను డెవలప్ చేశామన్నారు. షార్ట్, లాంగ్ వీడియోలను రూపొందించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..