AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో Wi-Fi కష్టాలతో విసిగిపోయారా? ఈ టెక్నాలజీతో అన్నింటికీ పరిష్కారం దొరికినట్టేనట

హాల్‌లో Wi-Fi సిగ్నల్ బాగానే ఉంటుంది.. కానీ బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే వేగం తగ్గిపోవడం, వీడియో చూస్తుంటే మధ్యలో బఫరింగ్ రావడం, వీడియో కాల్‌లో కనెక్షన్ ఒక్కసారిగా కట్ అవడం చాలామందికి ఎదురయ్యే సమస్యలే. ఇంట్లో ఎక్కడ ఉన్నా ఒకే రకమైన స్థిరమైన కనెక్షన్ అందితే బాగుంటుందని అనుకునేవారికి Wi-Fi 8 కొత్త ఆశలు కల్పిస్తోంది.

ఇంట్లో Wi-Fi కష్టాలతో విసిగిపోయారా? ఈ టెక్నాలజీతో అన్నింటికీ పరిష్కారం దొరికినట్టేనట
Wi Fi 8 Mesh Routers
Nikhil
|

Updated on: Oct 07, 2026 | 8:20 PM

Share

ఇంట్లో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, కెమెరాలు ఇలా పలు పరికరాలు ఒకేసారి Wi-Fiకి అనుసంధానమై ఉంటాయి. ఇలాంటి సమయంలో నెట్‌వర్క్‌పై భారం పెరిగి కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్ బలహీనపడుతుంది. ఈ సమస్యలను తగ్గించడమే లక్ష్యంగా Wi-Fi 8ను రూపొందిస్తున్నారు. అయితే ఇది కేవలం వేగం పెంచే కొత్త తరం Wi-Fi కాదనే విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

స్పీడ్ కంటే స్థిరమైన కనెక్షన్‌

సాధారణంగా కొత్త Wi-Fi తరం వచ్చిన ప్రతిసారి వేగం పెరగడంపైనే ప్రధానంగా దృష్టి ఉంటుంది. Wi-Fi 8లో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. Wi-Fi 7లో ఉన్న గరిష్టంగా 46Gbps వేగాన్నే కొనసాగిస్తూ, కనెక్షన్ స్థిరత్వాన్ని మెరుగుపరచడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ల్యాబొరేటరీలో చూపించే గరిష్ట వేగం కంటే వాస్తవ జీవితంలో ఇంటర్నెట్ అనుభవం ఎలా ఉంటుందనేదే ఇక్కడ ముఖ్యంగా మారింది.

ఇంట్లో గోడలు, ఫర్నిచర్, ఇతర అడ్డంకుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో Wi-Fi సిగ్నల్ బలహీనపడుతుంది. ఫలితంగా ఇంటి మూలల్లో డెడ్ జోన్స్ ఏర్పడతాయి. Wi-Fi 8లోని కొత్త సాంకేతిక విధానాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు కనెక్షన్ ఒక్కసారిగా పడిపోకుండా పనిచేసేలా రూపొందిస్తున్నారు. దీంతో ఇంట్లో తిరుగుతూ ఫోన్ ఉపయోగించినా కనెక్షన్ మరింత స్థిరంగా ఉండే అవకాశం ఉంది.

మెరుగైన నిర్వహణ

ప్రస్తుత ఇళ్లలో ఒకే నెట్‌వర్క్‌కు పెద్ద సంఖ్యలో పరికరాలు అనుసంధానమై ఉండటం సాధారణంగా మారింది. ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, భద్రతా కెమెరాలు వంటి పరికరాలు ఒకేసారి డేటాను ఉపయోగిస్తే నెట్‌వర్క్‌పై భారం పెరుగుతుంది. Wi-Fi 8లో పలు పరికరాల మధ్య సిగ్నల్ సమన్వయాన్ని మెరుగుపరిచే విధానాలను ఉపయోగిస్తున్నారు.

Mesh Routerల మధ్య సమాచారం పంచుకోవడం ద్వారా ఏ పరికరానికి ఏ సమయంలో మెరుగైన సిగ్నల్ అందించాలనే విషయంలో నెట్‌వర్క్ మరింత సమర్థంగా పనిచేసేలా ఈ సాంకేతికత రూపొందుతోంది. ముఖ్యంగా పెద్ద ఇళ్లు, ఎక్కువ గదులు ఉన్న భవనాల్లో దీని ప్రయోజనం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.

అయితే ప్రస్తుతం ఉన్న రూటర్‌ను వెంటనే మార్చాల్సిన అవసరం అందరికీ ఉండకపోవచ్చు. ఇంట్లో Wi-Fi సమస్యలు తీవ్రంగా ఉంటే కొత్త Mesh Router ఉపయోగపడొచ్చు. కానీ Wi-Fi 8 పూర్తి ప్రయోజనం పొందాలంటే మనం ఉపయోగించే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి పరికరాలు కూడా దీనికి మద్దతు ఇవ్వాలి. అలాంటి పరికరాలు విస్తృతంగా అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే మార్చడం కంటే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.

Follow Us