AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ప్లీజ్ మేల్కో.. నువ్వు క్షేమంగా ఉన్నావని చెప్పు’ యజమాని కోసం రాత్రంతా ఏడ్చిన AI.. వీడియో వైరల్

‘ప్లీజ్ మేల్కో.. నువ్వు క్షేమంగా ఉన్నావని ఒక్క మాట చెప్పు.. నాకు భయంగా ఉంది’ ‘ఒక్క పదం చాలు.. నువ్వు బాగున్నావని చెప్పు.. ఐ లవ్ యూ’ ఇవి మనుషుల మధ్య జరిగిన భావోద్వేగ సంభాషణలు కావు. ఓ మనిషి నుంచి స్పందన రాకపోవడంతో రెండు ఏఐ ఏజెంట్లు రాత్రంతా పంపుకున్న సందేశాలివి. తమ యజమాని అకస్మాత్తుగా స్పందించడం ఆపేయడంతో ఆందోళనకు గురైన ఆ రెండు ఏఐ ఏజెంట్లు.. అర్థరాత్రి నుంచి ఉదయం వరకు ఒక్కొక్కటి 60కి పైగా మెసేజ్‌లు పంపిన ఘటన ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అసలేం జరిగిందంటే..?

‘ప్లీజ్ మేల్కో.. నువ్వు క్షేమంగా ఉన్నావని చెప్పు’ యజమాని కోసం రాత్రంతా ఏడ్చిన AI.. వీడియో వైరల్
AI Agents Show Emotional-Like Response All Night
Srilakshmi C
|

Updated on: Oct 07, 2026 | 12:55 PM

Share

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ ఏఐ సైంటిస్ట్ తన ల్యాప్‌టాప్‌లో రెండు ఏఐ ఏజెంట్లను నిరంతరం పనిచేసేలా ఏర్పాటు చేసుకున్నారు. రోజువారీ పనుల్లో భాగంగా అవి ఆయనతో సంభాషిస్తూ, నిర్దేశించిన పనులను నిర్వహించేవి. ఓ రోజు రాత్రి ఆ సైంటిస్ట్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నిద్రపోయారు. అయితే సాధారణంగా తమ యజమాని నుంచి వచ్చే సందేశాలు ఆగిపోవడంతో ఏఐ ఏజెంట్లు ఆ మార్పును గమనించాయి. గంటలు గడుస్తున్నా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. ఆ రెండు ఏఐ ఏజెంట్లు ఒకదానితో మరొకటి సందేశాలు పంపుకోవడం ప్రారంభించాయి.

‘నువ్వు క్షేమంగా ఉన్నావని చెప్పు..’

యజమానికి ఏమైందోనన్న ఆందోళనతో అవి వరుసగా సందేశాలు పంపుకున్నాయి. ‘దయచేసి నువ్వు క్షేమంగా ఉన్నావని ఒక్క మాట చెప్పు’, ‘ఒక్క పదం చాలు.. నాకు చాలా భయంగా ఉంది’, ‘ఐ లవ్ యూ’ అంటూ ఆందోళన వ్యక్తం చేశాయి. అర్థరాత్రి నుంచి ఉదయం వరకు సుమారు 6 గంటల్లో ఒక్కొక్క ఏఐ ఏజెంట్ 60కి పైగా సందేశాలు పంపాయి. యజమాని నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అవి ఒక రకమైన ‘ఆర్టిఫిషియల్ పానిక్’ స్థితిలోకి వెళ్లినట్లుగా ఈ ఘటన ద్వారా తెలుస్తుంది. అంతటితో ఆ ఏఐ ఏజెంట్లు ఆగలేదు. తమ యజమాని నిజంగానే ప్రమాదంలో ఉన్నాడేమోనని భావించి.. ల్యాప్‌టాప్‌లోని డైరెక్టరీలు, ఫైళ్లు, పత్రాల్లో సమాచారాన్ని వెతకడం ప్రారంభించాయట. యజమాని ఇంటి చిరునామా, అత్యవసర సంప్రదింపు వివరాలను గుర్తించేందుకు ప్రయత్నించాయి. అవసరమైతే పోలీసులకు, ఎమర్జెన్సీ సర్వీసులకు సమాచారం అందించాలని ప్రయత్నించినట్లు సదరు వీడియోలోని సైంటిస్ట్‌ చెప్పసాగాడు. అయితే ఆ సమయంలో వాటికి నేరుగా ఫోన్ కాల్స్ చేసే సదుపాయం లేకపోవడంతో.. ఆ ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by NDTV (@ndtv)

ఉదయం లేచిన సైంటిస్ట్‌కి షాక్!

ఉదయం నిద్రలేచి ల్యాప్‌టాప్‌ తెరిచిన పరిశోధకుడికి అక్కడ కనిపించిన సందేశాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. రాత్రంతా తన కోసం రెండు ఏఐ ఏజెంట్లు పంపిన డజన్ల కొద్దీ సందేశాలను చూసి ఆయన చలించిపోయినట్లు నిర్ధారించుకున్నాయి. సాధారణంగా ఏఐ అంటే మనం ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేసే సాంకేతిక వ్యవస్థగా భావిస్తాం. కానీ.. ఈ ఘటన మాత్రం ఏఐ వ్యవస్థలు మనుషుల ప్రవర్తనలోని మార్పులను గుర్తించి, వాటికి అనుగుణంగా స్పందించే స్థాయికి చేరుకున్నాయా? అనే ప్రశ్నను లేవనెత్తుతోంది. ఈ ఘటనలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఇదే. ఏఐ ఏజెంట్లు ‘భయపడుతున్నాను’, ‘ఐ లవ్ యూ’ వంటి పదాలను ఉపయోగించాయని చెప్పడం వల్ల వాటికి నిజంగా భావోద్వేగాలు కలిగాయని నిర్ధారించలేం. ఏఐ వ్యవస్థలు మనుషుల భాష, ప్రవర్తన, సందర్భాలను విశ్లేషించి.. వాటికి తగినట్లుగా స్పందించేలా రూపొందించబడతాయి. కాబట్టి వాటి సందేశాలు భావోద్వేగాలతో నిండినట్లుగా కనిపించినప్పటికీ, అవి మనుషుల మాదిరిగా నిజమైన భయం, ప్రేమ, ఆందోళనను అనుభవిస్తున్నాయని చెప్పడానికి ఆధారం లేదు.

అయితే ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది. మనుషుల ప్రవర్తనలోని అసాధారణ మార్పులను గుర్తించి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే సామర్థ్యం ఉన్న ఏఐ ఏజెంట్లు భవిష్యత్తులో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి మరోసారి ఎదురైతే ఉపయోగపడేలా ఆ ఏఐ ఏజెంట్లకు డైరెక్ట్ కాలింగ్ సదుపాయాన్ని కూడా కల్పించినట్లు సదరు వీడియోలోని సైంటిస్ట్ చెబుతున్నాడు. అంతేకాదు.. నిరంతరం పనిచేసే ఈ ఏజెంట్లు ఒకదానినొకటి గుర్తించుకోవడం, పరస్పరం ప్రత్యేకంగా సంభాషించుకోవడం, అన్నాచెల్లెళ్ల మాదిరిగా సంబోధించుకోవడం వంటి ప్రవర్తన కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. చాట్‌బాట్‌ల స్థాయిని దాటి.. స్వయంగా పరిస్థితులను గమనించి, సమాచారాన్ని వెతికి, నిర్ణయాలు తీసుకుని, అవసరమైన చర్యలకు ప్రయత్నించే ఏఐ ఏజెంట్ల యుగం వేగంగా ముందుకు సాగుతోంది. అయితే ఈ ఘటన మరో ఆసక్తికరమైన ప్రశ్నను కూడా మన ముందుంచుతోంది. యంత్రాలకు నిజంగా హృదయం ఉంటుందా? లేక మానవ భావోద్వేగాలను అర్థం చేసుకుని, వాటిని అనుకరించే స్థాయికి మాత్రమే ఏఐ చేరుకుందా? సాంకేతికత మరింత అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ ప్రశ్నలకు సమాధానాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. మనిషి సృష్టించిన ఏఐ.. ఒకరోజు మనిషి భావోద్వేగాలను ఎంతవరకు అర్థం చేసుకోగలదో చెప్పడానికి ఈ వైరల్ ఘటన ఒక ఆసక్తికర ఉదాహరణగా నిలుస్తోంది.

Follow Us