Vikram1: భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం.. ప్రధాని మోదీ చేతిరాత కార్డ్‌తో నింగిలోకి..!
భారత అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచే స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 తొలి పరీక్షా ప్రయోగం నేడు శ్రీహరికోట నుంచి జరగనుంది. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్‌గా విక్రమ్-1 కక్ష్యలోకి పేలోడ్‌లను తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఈ మిషన్ భారత ప్రైవేట్ స్పేస్ రంగానికి కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్‌ను శనివారం (జూలై 18) ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC-SHAR)లోని చారిత్రాత్మక ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించనున్నారు. భారతదేశంలో ఒక ప్రైవేట్ సంస్థ పూర్తిస్థాయి ఆర్బిటల్ రాకెట్‌ను అభివృద్ధి చేసి కక్ష్యలోకి పంపేందుకు చేస్తున్న తొలి ప్రయత్నం ఇదే కావడం విశేషం.
ప్రధాని మోదీ చేతిరాత పోస్ట్‌కార్డ్
‘మిషన్ ఆగమన్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ తొలి టెస్ట్ ప్రయోగంలో పలు సాంకేతిక ప్రదర్శన పేలోడ్‌లు ప్రయాణించనున్నాయి. వీటిలో అత్యంత ప్రత్యేకమైనది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చేతితో రాసిన “వందే మాతరం” పోస్ట్‌కార్డ్ ఉండటం విశేషం. దీనితో పాటు స్కైరూట్ బృందం, పెట్టుబడిదారులు, పాలసీ మేకర్లు, శ్రేయోభిలాషుల చేతిరాత సందేశాలు కూడా అంతరిక్షంలోకి వెళ్లనున్నాయి. ఈ మిషన్‌లో గ్రహా స్పేస్ సంస్థకు చెందిన సోలార్స్ S3 ఉపగ్రహం, కాస్మోసర్వ్ స్పేస్ రూపొందించిన రోబోటిక్ ఆర్మ్ ఎంబ్రచె, జర్మనీకి చెందిన డ్కబెడ్ సాంకేతిక ప్రదర్శన, స్కైరూట్‌కు చెందిన స్కోప్ ఉపగ్రహం, బెంగళూరుకు చెందిన కాస్మోస్ డైమండ్స్ అభివృద్ధి చేసిన ప్రయోగశాలలో తయారైన డైమండ్ లోటస్, అలాగే 18 క్యారెట్ల బంగారంతో రూపొందించిన సూక్ష్మ రాకెట్ కళాఖండం కూడా ప్రయాణించనున్నాయి.
వీడియో చూడండి
Among the payloads on Vikram-1 Test Flight-1 is something truly special—a handwritten postcard from Hon’ble Prime Minister Shri @narendramodi with the words, “Vande Mataram.” 🇮🇳🚀
It travels to space alongside handwritten messages from our team, investors, policymakers, and… pic.twitter.com/sJajN6NiVJ
— Skyroot Aerospace (@SkyrootA) July 17, 2026
విక్రమ్-1 మూడు ఘన ఇంధన దశలు, ఒక ద్రవ కక్ష్య సర్దుబాటు మాడ్యూల్‌తో రూపొందించారు. ఇది పూర్తిగా కార్బన్-కాంపోజిట్ పదార్థంతో నిర్మించిన భారతదేశపు తొలి ఆర్బిటల్ రాకెట్. ఈ పదార్థం ఉక్కుతో పోలిస్తే ఐదు రెట్లు తేలికగా ఉండటంతో రాకెట్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని స్కైరూట్ తెలిపింది. అలాగే ఇందులో భారత్‌లోనే తొలిసారిగా 3D-ప్రింటెడ్ మెటల్ రాకెట్ ఇంజిన్‌లు ఉపయోగించడం మరో ప్రత్యేకత. ఈ రాకెట్ 450 కిలోమీటర్ల ఎత్తులోని తక్కువ భూ కక్ష్య (LEO)లోకి గరిష్ఠంగా 350 కిలోగ్రాముల పేలోడ్‌ను ప్రవేశపెట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒకేసారి బహుళ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ప్రత్యేక ఆర్బిటల్ అడ్జస్ట్‌మెంట్ మాడ్యూల్‌ను కూడా ఇందులో అమర్చారు.
కమర్షియల్ మార్కెట్‌లోకి భారత్..
2022లో విక్రమ్-ఎస్ సబ్-ఆర్బిటల్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన స్కైరూట్, ఇప్పుడు విక్రమ్-1తో మరింత పెద్ద లక్ష్యాన్ని చేరుకునేందుకు సిద్ధమైంది. ఉపకక్ష్య ప్రయోగాల నుంచి పూర్తి స్థాయి కక్ష్య ప్రయోగాల దిశగా అడుగుపెడుతున్న ఈ మిషన్ విజయవంతమైతే భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం విక్రమ్-1 విజయం భారత కమర్షియల్ ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌లో దేశ స్థాయిని మరింత బలోపేతం చేయడంతో పాటు, చిన్న ఉపగ్రహాల ప్రయోగ రంగంలో భారత్‌ను ప్రపంచ పోటీలో ముందంజలో నిలబెడుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమకు ఇది ఒక కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.
