AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత సముద్ర జలాల్లో కొత్త సొర చేప జాతి గుర్తింపు.. ఏ పేరు పెట్టారు? ప్రత్యేకత ఏంటంటే?

కేరళ తీరంలోని లోతైన సముద్రంలో అరుదైన కొత్త క్యాట్‌షార్క్ జాతిని భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్రిస్టరస్ డ్రోనాగా పేరు పెట్టిన ఈ జాతి సముద్ర జీవవైవిధ్య పరిశోధనలో కీలక ఆవిష్కరణగా నిలిచింది. దీని ద్వారా లోతైన సముద్రాల్లో ఇంకా ఎన్నో కొత్త జీవులు వెలుగులోకి వచ్చే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భారత సముద్ర జలాల్లో కొత్త సొర చేప జాతి గుర్తింపు.. ఏ పేరు పెట్టారు? ప్రత్యేకత ఏంటంటే?
Apristurus Drona
SN Pasha
|

Updated on: Aug 06, 2026 | 7:23 PM

Share

భారత సముద్ర జలాల్లో మరో అరుదైన సముద్ర జీవి వెలుగులోకి వచ్చింది. కేరళ తీరంలోని లోతైన సముద్రంలో పట్టుబడిన క్యాట్‌షార్క్‌ను శాస్త్రవేత్తలు కొత్త జాతిగా గుర్తించారు. అప్రిస్టరస్ డ్రోనా (Apristurus drona) పేరుతో ఈ కొత్త జాతిని అధికారికంగా నమోదు చేశారు. ఈ ఆవిష్కరణ భారత లోతైన సముద్ర జీవవైవిధ్యంపై మరింత పరిశోధన అవసరాన్ని నొక్కిచెబుతోంది. కేరళలోని కొల్లం తీరానికి దూరంగా ఆగ్నేయ అరేబియా సముద్రంలోని 400 నుంచి 650 మీటర్ల లోతులో రొయ్యల వేటకు వెళ్లిన పడవల వలల్లో ఈ అరుదైన షార్క్ మొదటిసారి చిక్కింది. నల్లటి రంగు, పొడవైన సన్నని శరీరం, మొనదేలిన ముక్కు, తెల్లటి కళ్లతో కనిపించిన ఈ చేపను పరిశీలించిన శాస్త్రవేత్తలు ప్రయోగశాలకు తరలించి అధ్యయనం ప్రారంభించారు.

డీఎన్‌ఏ విశ్లేషణ

రెండు సంవత్సరాల తర్వాత మరో మూడు నమూనాలు లభించడంతో వాటిపై రూప లక్షణాలు, డీఎన్‌ఏ విశ్లేషణలు నిర్వహించారు. ఈ పరిశోధనలో ఇది ఇప్పటికే తెలిసిన క్యాట్‌షార్క్ జాతులకు భిన్నమైనదని నిర్ధారించారు. అనంతరం ఈ ఏడాది ప్రారంభంలో జూటాక్సా (Zootaxa) శాస్త్రీయ జర్నల్‌లో కొత్త జాతిగా ప్రకటించారు. ఈ పరిశోధన భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ చేపట్టిన డీప్ ఓషన్ మిషన్‌లో భాగంగా జరిగింది. పరిశోధకుల ప్రకారం.. ఈ జాతి ప్రస్తుతం కేరళ తీరంలోని కొల్లం స్లోప్, వాడ్జ్ బ్యాంక్ ప్రాంతాల్లో మాత్రమే గుర్తించబడింది. అయితే దీని సంఖ్య, వ్యాప్తి, జీవన విధానం, సంతానోత్పత్తి వంటి అంశాలపై ఇంకా స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.

మాంసాహార జీవులు

శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. క్యాట్‌షార్క్‌లు సముద్ర ఆహార గొలుసులో కీలకమైన మాంసాహార జీవులు. ఇవి లోతైన సముద్ర జీవావరణ వ్యవస్థలో సమతుల్యతను కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందువల్ల ఈ కొత్త జాతి జీవన విధానాన్ని అర్థం చేసుకోవడం అత్యంత అవసరమని వారు చెబుతున్నారు. గతంలో ఈ ప్రాంతంలో చేపల వేట 200 నుంచి 400 మీటర్ల లోతు వరకు మాత్రమే సాగేది. అయితే లోతైన సముద్ర రొయ్యలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం మత్స్యకారులు 600 మీటర్ల లోతు వరకు వేట సాగిస్తున్నారు. దీంతో ఇలాంటి అరుదైన జీవులు అనుకోకుండా వలల్లో చిక్కుతున్నాయని పరిశోధకులు తెలిపారు.

ముప్పు

ఈ షార్క్‌కు ప్రస్తుతం వాణిజ్య విలువ లేకపోయినా, లోతైన సముద్రంలో చేపల వేట పెరిగితే ఈ జాతి మనుగడకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇది పరిమిత ప్రాంతానికే చెందిన జాతి అయితే, అధిక వేట కారణంగా స్థానికంగా అంతరించిపోయే ప్రమాదం కూడా ఉందని వారు పేర్కొన్నారు. లోతైన సముద్రాల్లో ఇంకా ఎన్నో తెలియని జీవులు ఉన్నాయని, ఆధునిక డీఎన్‌ఏ సాంకేతికత, నిరంతర పరిశోధనల ద్వారా భవిష్యత్తులో మరిన్ని కొత్త జాతులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆవిష్కరణ భారత సముద్ర జీవవైవిధ్య పరిశోధనలో మరో కీలక మైలురాయిగా నిలిచింది.

Follow Us