Telangana Gateway: తెలంగాణకు మరో మణిహారం.. కండ్లకోయలో రూ. 100 కోట్లతో భారీ ఐటీ పార్క్

Telangana Gateway: తెలంగాణకు మరో మణిహారం.. కండ్లకోయలో రూ. 100 కోట్లతో భారీ ఐటీ పార్క్
Telangana Gateway

విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో ఐటీ రంగం అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తోంది. హైదరాబాద్‌ పడమరలో అభివృద్ధి చెందిన ఐటీ పరిశ్రమ ఉత్తరానికి విస్తరిస్తుంది.

Balaraju Goud

|

Feb 13, 2022 | 7:37 AM

Telangana Gateway IT Park: విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్(Hyderabad) మహానగరంలో ఐటీ రంగం అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తోంది. హైదరాబాద్‌ పడమరలో అభివృద్ధి చెందిన ఐటీ పరిశ్రమ ఉత్తరానికి విస్తరిస్తుంది. రాష్ట్రంలో అత్యంత ఎత్తైన భారీ ఐటీ పార్కును మేడ్చల్‌ జిల్లా(Medchal District) కండ్లకోయ(Kandlakoya)లో ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గేట్‌ వే పేరిట 10 ఎకరాల్లో రూ.వంద కోట్లతో నిర్మించనున్నారు. దాదాపు వంద సంస్థలకు కేటాయించనున్నారు. ఈ పార్కు ద్వారా 50వేల మందికిపైగా ఉద్యోగాలు లభించనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజైన ఈనెల17న తెలంగాణ గేట్‌వే ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు.

హైదరాబాద్‌కు నలువైపులా ఐటీ అభివృద్ధిలో భాగంగా ఐటీ రంగం వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే అవుటర్‌ రింగ్‌రోడ్డు ప్రాంతంలో మరో భారీ ఐటీ టవర్ చేపడుతున్నారు. అత్యంత ఎత్తైన కొత్త ఐటీ పార్కు ఏర్పాటు కోసం గత కొన్నేళ్లుగా స్థలాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం కండ్లకోయ వైపు మొగ్గు చూసింది. కండ్లకోయ- మేడ్చల్‌ జంక్షన్‌లో 10 ఎకరాల్లో ఐటీ పార్కు ఏర్పాటు అవుతుందని, ఈ స్థలాన్ని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కేటాయించింది. విమానాశ్రయానికి 45 నిమిషాల్లో చేరుకునే సౌకర్యంతో పాటు రహదారుల అనుసంధానం వంటి వాటిని సానుకూలంగా భావించింది. కండ్లకోయ జంక్షన్‌ వద్ద స్థల ఎంపిక పూర్తికావడంతో నిర్మాణ ప్రణాళికను సర్కారు సిద్ధం చేసింది. బాధ్యతలను టీఎస్‌ఐఐసీకి అప్పగించింది. ఇప్పటికే 70కి పైగా సంస్థలు కార్యాలయ స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ పార్కులో సమావేశ మందిరాలు, భారీ పార్కింగు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు.

మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలో ఏర్పాటు చేస్తున్న ఐటీ హబ్‌కు ఈ నెల 17న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహరెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కండ్లకోయకు ఐటీ హబ్‌ రావడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయన్నారు. కండ్లకోయలో ఇప్పటికే కేటాయించిన 5 లక్షల ఎస్‌ఎఫ్‌టీ స్థలానికి సరిపడా వివిధ రాష్ట్రాలకు చెందిన ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి రెండు, మూడో ఫేజ్‌లో కూడా ఇక్కడే ఐటీ అభివృద్ధి జరిగేలా కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌ ప్రాంతంలో ఐటీ పరిశ్రమ ప్రతి ఏటా 16 నుంచి 17 శాతం అభివృద్ధిని నమోదు చేస్తుందని టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఐటీలో 2.50 లక్షల మందికి ఉద్యోగాలు ఉండేవని, ప్రస్తుతం 6.5 లక్షల మంది పని చేస్తున్నారని చెప్పారు.

Read Also… Liquor Free Village: మహిళల చొరవతో అందరికి ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం.. ఇంతకీ ఆ ప్రాంతవాసులు చేస్తున్న పనేంటి?

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu