ఫ్యాన్ రిపేర్ చేయించే ముందు ఈ విషయాలు తెలుసుకోండి.. ఈ తప్పులు చేస్తే మీ జేబుకు చిల్లే..
వేసవిలో ఇంట్లో ఫ్యాన్లు విశ్రాంతి లేకుండా తిరగాల్సిందే.. అయితే, మీ పాత ఫ్యాన్ గాలి కంటే పదేపదే రిపేరుకు వస్తూ మీ జేబుకు చిల్లు పెడుతోందా? చాలామంది పాత ఫ్యాన్‌ను బాగు చేయిస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ ఆ రిపేరు ఖర్చు కొత్త ఫ్యాన్ ధరతో సమానమని మీకు తెలుసా? అసలు మీ ఫ్యాన్‌ను ఎప్పుడు రిపేరు చేయించాలి? ఎప్పుడు మార్చేయాలి? అనేది తెలుసుకుందాం..

వేసవి కాలం మొదలైందంటే చాలు.. ఇంట్లోని ఫ్యాన్లు నిరంతరం తిరగాల్సిందే. అయితే చాలామంది వేసవి ప్రారంభంలో పాత ఫ్యాన్‌లకు రిపేర్లు చేయిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ పాత ఫ్యాన్‌ను బాగు చేయించడం కంటే, కొత్తది కొనడమే తెలివైన పని అని నిపుణులు సూచిస్తున్నారు. మీ ఫ్యాన్ కొని కొద్ది కాలమే అయ్యి ఉండి, చిన్నపాటి సమస్యలు ఉంటే రిపేరు చేయించడం ఉత్తమం. ఫ్యాన్ స్క్రూలు వదులుగా ఉన్నా లేదా బేరింగ్లలో గ్రీజు తక్కువైనా శబ్దం వస్తుంది. దీనిని తక్కువ ఖర్చుతోనే బాగు చేయించవచ్చు. ఫ్యాన్ తిరుగుతున్నా గాలి తక్కువగా వస్తుంటే, కేవలం కెపాసిటర్ మార్చడం ద్వారా పాత వేగాన్ని తిరిగి పొందవచ్చు. దీనికి పెద్దగా ఖర్చు అవ్వదు.
కొత్త ఫ్యాన్ ఎప్పుడు కొనాలి..?
మీ ఫ్యాన్ తరచుగా మొరాయిస్తుంటే దానికి మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లడం కంటే సెలవు ఇవ్వడమే మంచిది. ప్రతి రెండు మూడు నెలలకోసారి రిపేరు వస్తుంటే, మీరు పెట్టే మొత్తం ఖర్చు ఏడాది తిరిగేసరికి కొత్త ఫ్యాన్ ధరతో సమానమవుతుంది. పాత ఫ్యాన్ల మోటార్లు కాలక్రమేణా బలహీనపడతాయి. అవి గాలిని తక్కువగా ఇస్తూనే, విద్యుత్‌ను మాత్రం అధికంగా వినియోగిస్తాయి. అంటే మీ కరెంటు బిల్లు మోత మోగుతుంది. ఒకసారి ఫ్యాన్ మోటార్ వైండింగ్ కాలిపోయిందంటే దానిని బాగు చేసినా మునుపటి పనితీరు రాకపోవచ్చు.
నూతన టెక్నాలజీతో భారీ లాభాలు
నేటి తరం ఫ్యాన్లు ఆధునిక టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. ముఖ్యంగా BLDC వంటి టెక్నాలజీ ఫ్యాన్లు సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే 50శాతం నుండి 60శాతం వరకు విద్యుత్ ఆదా చేస్తాయి. ఆధునిక ఫ్యాన్ల బ్లేడ్లు, మోటారు సమతుల్యత చాలా కచ్చితంగా ఉంటుంది. దీనివల్ల ఎలాంటి శబ్దం లేకుండా ప్రశాంతమైన నిద్రను అందిస్తాయి. కొత్త రకం మోటార్లు ఎక్కువ కాలం పాటు ఎటువంటి మరమ్మతులు లేకుండా పనిచేసేలా డిజైన్ చేయబడ్డాయి.
మీ ఫ్యాన్ పదేపదే ఆగిపోతున్నా లేదా గాలి కంటే శబ్దం ఎక్కువగా ఇస్తున్నా, అది దాన్ని మార్చాల్సిన సమయం అని గుర్తుంచుకోండి. దీర్ఘకాలికంగా చూస్తే, కొత్త ఫ్యాన్ కొనుగోలు చేయడం వల్ల రిపేర్ల ఖర్చు తగ్గడమే కాకుండా, కరెంటు బిల్లులోనూ మీకు గణనీయమైన పొదుపు లభిస్తుంది. ఈ వేసవిలో ప్రశాంతమైన గాలి కోసం సరైన నిర్ణయం తీసుకోండి.
