ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టే రోబోలు వచ్చేస్తున్నాయి! ఇంతవరకు మనుషులకే ఉన్న శక్తి ఇక వాటికి కూడా..
మానవ ప్రతిస్పందనలను పోలి ఉండే కృత్రిమ చర్మం (న్యూరోమార్ఫిక్ ఇ-స్కిన్) రోబోలకు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. హాంగ్‌కాంగ్ పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ సాంకేతికతతో, రోబోలు ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే సొంతంగా వెనక్కి తగ్గుతాయి, నొప్పిని అనుభవిస్తాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఏదైనా వేడి వస్తువు కానీ, పదార్థం కానీ అనుకోకుండా మనకు తాకినప్పుడు వెంటనే మన చేతిని వెనక్కిలాగేస్తాం. నిజానికి ఈ చర్య మన ప్రమేయం లేకుండానే వెంటనే జరిగిపోతుంది. అంటే.. అక్కడ వేడి వస్తువు ఉంది, అది తాకడంతో మనకు కాలింది అనే ప్రాసెస్ మొత్తం రిఫ్లెక్స్ యాక్షన్ కారణంగా చేయి పూర్తి చేసేస్తుంది. చేయి పూర్తిగా కాలిపోకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి మన శరీర నిర్మాణంలో ఇదోక వరం. ఇప్పుడు ఇలాంటి అద్భుతాన్ని నిర్జీవ రోబోలకు తీసుకురావడానికి శాస్త్రవేత్తలు తొలి అడుగు వేశారు.
ప్రస్తుతం కర్మాగారాలు, వైద్య రంగాలలో ఉపయోగించే రోబోలు యాంత్రికమైనవి. అవి తమ శరీరంలో పొందుపరచబడిన సెన్సార్ల ద్వారా మాత్రమే ఒత్తిడిని గ్రహించగలవు. సున్నితమైన స్పర్శ, ప్రమాదకరమైన నొప్పి మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం వాటికి లేదు. ఉదాహరణకు ఒక రోబోట్ చేయికి బలమైన దెబ్బ తగిలితే, దాని గురించిన సమాచారం దాని CPUకి వెళ్లి, అక్కడ దానిని విశ్లేషిస్తారు, ఆపై రోబోట్ ఏమి చేయాలో ఆదేశం వచ్చే వరకు వేచి ఉంటుంది. ఈ ఆలస్యం రోబోట్‌కు, సమీపంలో పనిచేసే మానవులకు ప్రమాదకరం.
ఈ లోపాన్ని అధిగమించడానికి హాంకాంగ్ నగర విశ్వవిద్యాలయ పరిశోధకులు ఒక విప్లవాత్మక మార్పుతో ముందుకు వచ్చారు. మానవ నాడీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అదే సూత్రాన్ని ఉపయోగించి, ‘న్యూరోమార్ఫిక్ ఇ-స్కిన్’ అనే కొత్త రకం కృత్రిమ చర్మాన్ని వారు సృష్టించారు. ఈ కొత్త కృత్రిమ చర్మం గురించి ప్రత్యేకత ఏమిటంటే అది నొప్పిని గ్రహించినప్పుడు మాస్టర్ సాఫ్ట్‌వేర్ నుండి ఆదేశం కోసం వేచి ఉండదు. అది ప్రమాదాన్ని గ్రహించిన వెంటనే, ఆ నిర్దిష్ట భాగం ఆటోమేటిక్‌గా వెనక్కి తగ్గుతుంది. ఇంకా ఈ చర్మం అనేక చిన్న కట్టలుగా రూపొంది, ప్రతి కట్ట నిరంతరం నేను బాగానే ఉన్నాను అని ఒక సంకేతాన్ని పంపుతుంది. మానవులు గాయపడినప్పుడు నొప్పిని అనుభవించినట్లే, రోబోట్ దాని శరీరంలో ఎక్కడ నష్టం జరిగిందో కచ్చితంగా గుర్తించగలదు. ఈ ఆవిష్కరణ ఫ్యాక్టరీ ప్రమాదాలను తగ్గించడమే కాకుండా, భవిష్యత్తులో యుద్ధాలు, రెస్క్యూ ఆపరేషన్లలో ఉపయోగించే రోబోల సామర్థ్యాన్ని అనేక రెట్లు పెంచుతుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
