Redmi 9c: రూ.9వేలలోపే రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్.. 128జీబీ స్టోరేజీ.. అద్భుతమైన ఫీచర్స్
Redmi 9c: షియోమీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీలో దూసుకుపోతోంది. మార్కెట్లో కొత్త కొత్త వేరియంట్లతో ఫోన్‌లను విడుదల చేస్తూ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే అద్భుతమైన..
Redmi 9c: షియోమీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీలో దూసుకుపోతోంది. మార్కెట్లో కొత్త కొత్త వేరియంట్లతో ఫోన్‌లను విడుదల చేస్తూ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే అద్భుతమైన ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆపిల్‌ను సైతం షియోమీ వెనక్కి నెట్టిసింది. ఈ నేపథ్యంలో తక్కువ ధరల్లో కస్టమర్లకు స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది షియోమీ. తాజాగా రెడ్‌మీ 9సీ స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ మలేషియాలో విడుదలైంది. ఇందులో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. గతంలో ఇందులో 2 జీబీ ర్యామ్/3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్/64 జీబీ స్టోరేజ్ వేరియంట్లు మార్కెట్లోకి రాగా, తాజాగా కొత్తగా హైఎండ్ వేరియంట్‌ను కూడా తీసుకువచ్చారు.
రెడ్‌మీ 9సీ ధర ఎంతంటే..
కొత్తగా మార్కెట్లోకి విడుదలైన ఈ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 499 మలేషియా రింగెట్లుగా(మనదేశ కరెన్సీలో సుమారు రూ.8,780) నిర్ణయించారు. దీనికి సంబంధించిన సేల్ మలేషియాలో ఆగస్టు 3వ తేదీ నుంచి జరగనుంది. ఈ మొబైల్ బ్లూ, ఆరెంజ్ రంగుల్లో అందుబాటులో ఉంది.
రెడ్‌మీ 9సీ స్పెసిఫికేషన్లు
రెడ్‌మీ 9సీ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది. ఇందులో 6.53 అంగుళాల హెచ్ డీ+ ఎల్సీడీ డాట్ డ్రాప్ డిస్ ప్లేను అందించారు. దీని డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 4 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ను అందించారు. స్టోరేజ్ ను మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
కెమెరా విషయానికొస్తే..
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా విషయానికొస్తే.. వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 5 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. ఇందులో బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే ఏఐ ఫేస్ అన్ లాక్ ఫీచర్ కూడా ఉంది.