AI ఫీచర్లతో మెటా కొత్త స్మార్ట్ గ్లాసెస్ విడుదల! ధర ఎంతంటే..?
మెటా కొత్త రేబాన్ స్మార్ట్ గ్లాసెస్‌ను విడుదల చేసింది, ఇవి ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలు అవసరమైన వారికి టెక్నాలజీని అందిస్తాయి. బ్లేజర్, స్క్రిబర్ డిజైన్‌లలో లభించే ఈ గ్లాసెస్ సౌకర్యవంతమైన నిర్మాణంతో పాటు విస్తృత ప్రిస్క్రిప్షన్ సపోర్ట్‌ను కలిగి ఉన్నాయి. Meta AI ఆధారిత న్యూట్రిషన్ లాగింగ్, మెరుగైన నావిగేషన్ వంటి అనేక AI ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

టెక్నాలజీ దిగ్గజం మెటా, దృష్టి లోపాలను సరిదిద్దుకోవాల్సిన వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త స్మార్ట్ గ్లాసెస్ శ్రేణిని విడుదల చేసింది. రేబాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్ పేరుతో వచ్చిన ఈ మోడళ్లలో బ్లేజర్ (rectangular), స్క్రిబర్ (round) అనే రెండు కొత్త ఫ్రేమ్ డిజైన్‌లు ఉన్నాయి. ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలను రోజువారీ టెక్నాలజీ వినియోగంతో సమన్వయం చేయాలనే లక్ష్యంతో ఈ ఉత్పత్తులను రూపొందించారు. ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని డిజైన్ మెరుగుదలలు చేశారు. తేలికపాటి నిర్మాణం, ఓవర్‌ఎక్స్‌టెన్షన్ హింజ్‌లు, సర్దుబాటు చేయగల టెంపుల్ టిప్స్, మార్చుకోగల నోస్‌ప్యాడ్‌లతో వినియోగదారులకు మెరుగైన ఫిట్‌ను అందించేందుకు ప్రయత్నించారు.
మ్యాట్ బ్లాక్, డార్క్ ఆలివ్, ట్రాన్స్‌పరెంట్ బ్లాక్, ఐస్ గ్రే, స్టోన్ బేజ్ వంటి రంగుల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు తమ ఆప్టిషియన్ వద్ద అవసరానికి అనుగుణంగా లెన్స్‌లను అమర్చించుకోవచ్చు. ఈ కొత్త మోడళ్లలో ప్రధాన ఆకర్షణ, విస్తృత ప్రిస్క్రిప్షన్ సపోర్ట్. మెటా ప్రకారం, దాదాపు అన్ని రకాల కళ్లజోడు పవర్‌లకు ఇవి అనుకూలంగా ఉంటాయి. అధికారిక ఆర్డర్‌లలో ±6 పవర్ పరిమితి ఉన్నప్పటికీ, ఎక్కువ పవర్ ఉన్న వినియోగదారులు కూడా ఫ్రేమ్‌లను తీసుకుని ఆప్టిషియన్ వద్ద లెన్స్‌లను అమర్చించుకోవచ్చు. దీంతో ఈ పరికరం ఒకేసారి టెక్ గాడ్జెట్‌గా, వైద్య అవసరాలకు సరిపోయే ఉపకరణంగా ఉపయోగపడుతుంది.
సాఫ్ట్‌వేర్ పరంగా కూడా కొత్త AI ఫీచర్లు జోడించారు. Meta AI ఆధారంగా న్యూట్రిషన్ లాగింగ్ వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఫోటో తీసినా, వాయిస్ ద్వారా చెప్పినా భోజన వివరాలు యాప్‌లో నమోదు అవుతాయి. అదనంగా వాట్సాప్ మెసేజ్‌లకు ఎన్‌క్రిప్టెడ్ సారాంశాలు, కొత్త గేమ్స్, మెరుగైన నావిగేషన్, న్యూరల్ హ్యాండ్‌రైటింగ్ వంటి సౌకర్యాలు కూడా అందిస్తున్నారు. ఈ గ్లాసెస్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉండగా, ఏప్రిల్ 14న మార్కెట్లో విడుదల కానున్నాయి. ధర సుమారు 499 అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.41,500)గా నిర్ణయించారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
