Indian-origin CEOs: గూగుల్ నుంచి ట్విట్టర్ వరకు.. ప్రపంచ టెక్ సామ్రాజ్యానికి అధిపతులందరూ భారతీయులే..!

Indian-origin CEOs: ఉరుకులు, పరుగులతో సాగుతున్న ప్రస్తుత ప్రపంచం టెక్నాలజీ ఆధారంగానే నడుస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి టెక్ సామ్రాజ్యాన్ని భారతీయులు ఏలుతున్నారు.

Indian-origin CEOs: గూగుల్ నుంచి ట్విట్టర్ వరకు.. ప్రపంచ టెక్ సామ్రాజ్యానికి అధిపతులందరూ భారతీయులే..!
Indian Ceo
Follow us

|

Updated on: Nov 30, 2021 | 6:31 AM

Indian-origin CEOs: ఉరుకులు, పరుగులతో సాగుతున్న ప్రస్తుత ప్రపంచం టెక్నాలజీ ఆధారంగానే నడుస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి టెక్ సామ్రాజ్యాన్ని భారతీయులు ఏలుతున్నారు. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ వరకు దిగ్గజ కంపెనీలకు సీఈవోగా వెలుగొందుతున్నారు. తమ ప్రతిభతో దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు ఇనుమడింపజేస్తున్నారు. ఇప్పటికే గూగుల్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, అడోబ్ సీఈవోలుగా భారతీయులు ఉండగా.. ఇప్పుడు ఆ జాబితాలో మరో దిగ్జక కంపెనీ చేరింది. మేటా ఒన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ సీఈవోగా భారతీయుడైన పరాగ్ అగర్వాల్ ఎంపికయ్యాడు. దాంతో దేశ ఖ్యాతి మరింత పెరిగినట్లయ్యింది. ట్విట్టర్‌ సీఈవోగా భారతీయుడు ఎంపికైన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఏఏ దిగ్గజ కంపెనీలకు.. ఏ భారతీయుడు నేతృత్వం వహిస్తున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచాయ్.. సుందర్ పిచాయ్.. భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన లెజెండ్. తన అకుంఠిత శ్రమ, చిత్తశుద్ధితో ప్రపంచానికి తానేంటో నిరూపించి చూపిన వ్యక్తి. దక్షిణ భారతదేశం నుంచి మొదలైన ఆయన ప్రయాణం.. అమెరికా వరకు దిగ్విజయంగా సాగుతోంది. ప్రపంచం వ్యాప్తంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ Google, స్మార్ట్ ఫోన్స్ గతిని మార్చిన ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ (Android).. వంటి సక్సెస్‌లు సుందర్ ప్రస్థానంలో ఉన్నాయి. తమిళనాడులో మదురైలో 1972 జూన్ 10న జన్మించారు సుందర్ పిచాయ్. ప్రాధమిక విద్యాభ్యాసాన్ని చెన్నైలోని జవహర్ విద్యాలయలో పూర్తి చేశారు. ఆ తరువాత ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చేరారు. అనంతరం అమెరికాకు వెళ్లిన సుందర్ పిచాయ్.. అక్కడి పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఆ తరువాత 2004లో గూగుల్ సంస్థలో పని చేయడం ప్రారంభించారు. గూగుల్ సంస్థలో చేరిన తరువాత ఆయన చేపట్టిన తొలి ప్రాజెక్ట్ క్రోమ్ బ్రౌజర్. క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ బృందానికి సారథ్యం వహించిన సుందర్ దీన్ని అద్భుతంగా డెవలెప్ చేసి చూపించారు. దాంతో.. 2008 లో ప్రొడక్ట్ డెవలెప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా ‌నియమించారు. అలా అంచెలంచెలుగా ఎదిగిన సుందర్ పిచాయ్.. 2015 లో గూగుల్ సీఈఓగా ఎంపికయ్యారు. ఇక 2019లో గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ సీఈఓగా కూడా బాధ్యతలు స్వీకరించారు.

మైక్రోసాఫ్ట్ సత్యనాదెళ్ల.. ‘సత్యనారాయణ నాదెళ్ల’ అలియాస్ సత్య నాదెళ్ల ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా 2014 ఫిబ్రవరి 4న నియమితులయ్యారు. అంతకుముందు ఆయన మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.1976 నుండి సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత మూడవ సిఇఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టాడు.

సత్య నాదెళ్ల స్వస్థలం.. అనంతపురం జిల్లా, ఎల్లనూరు మండలం, బుక్కాపురం గ్రామం. ఆయన తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. రాష్ట్రంలో మంచి అధికారిగా పేరుతెచ్చుకున్నారు. 2004 నుంచి 2009 వరకు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యునిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు. నాదెళ్ల యుగంధర్ ఐఏఎస్‌కు ఎంపికైన తర్వాత కుటుంబాన్ని హైదరాబాద్‌కు మార్చారు. 1967లో బీఎన్ యుగంధర్ దంపతులకు హైదరాబాద్‌లో సత్య నాదెళ్ల జన్మించారు. సత్య నాదెళ్ల ప్రాథమిక విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే సాగింది. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివారు. 1988లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీఈ పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లోనూ మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం సాఫ్ట్‌వేర్ రంగంలో పలు హోదాల్లో పనిచేశారు. అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డారు. కొంతకాలం సన్ మైక్రో సిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లోకి అడుగుపెట్టారు. వ్యాపార సేవల విభాగంలో కీలక పాత్ర పోషించి ఐదేళ్లలోనే కంపెనీ వ్యాపారాన్ని దాదాపు రూ. 9 వేల కోట్ల నుంచి రూ. 31 వేల కోట్లకు చేర్చారు. కొత్త సవాళ్లను స్వీకరించి సమర్థంగా నిర్వహిస్తూ ఆ తర్వాత పదేళ్లలోనే కంపెనీలో ఉన్నత స్థానాలను చేరుకున్నారు.

ఐబిఎం అరవింద్ కృష్ణ.. 1962లో భారత్‌లో జన్మించిన అరవింద్ కృష్ణ.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి కలిగిన ఐబిఎం‌కు బిజినెస్ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 2020 నుంచి ఆయన సీఈవోగా ఉన్నారు. జనవరి 2021లో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1990లో ఐబీఎంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన అరవింద్ కృష్ణ.. ఐబిఎం క్లౌడ్, కాగ్నిటివ్ సాఫ్ట్‌వేర్, ఐబిఎం రీసెర్చ్ విభాగాలను నిర్వహిస్తూ.. 2015లో సీనియర్ వైస్ ప్రెసెడెంట్‌గా పదోన్నతి పొందారు. కంపెనీ చరిత్రలో అతిపెద్ద కొనుగోలు అయిన రెడ్ హ్యాట్ కొనుగోలులో ఆయన పాత్ర కీలకం.

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు అరవింద్ కృష్ణ. ఆయన తండ్రి ఆర్మీ మేజర్ జనరల్ వినోద్ కృష్ణ. తల్లి ఆరతి కృష్ణ. ఆర్మీలో ప్రాణాలు కోల్పోయిన వారి భార్య సంక్షేమం కోసం కృషి చేశారు. కాగా, అరవింద్ కృష్ణ పాఠశాల విద్య స్టేన్స్ అంగ్లో ఇండియన్ హైయ్యర్ సెకండరీ స్కూల్ కూనూర్, తమిళనాడులో సాగింది. సెయింట్ జోసఫ్స్ అకాడమీ డెహ్రాడూన్‌లో చదివారు. ఆ తరువాత ఐఐటీ కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

అడోబ్ కంపెనీ సీఈవో శంతను నారాయణ్.. భారతీయ అమెరికన్ వ్యాపార వేత్తగా శంతను నారాయణ్ ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు. ప్రస్తుతం అడోబ్ కంపెనీకి సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన.. స్వస్థలం హైదరాబాద్. ఆయన హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. హైదరాబాద్ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుకున్న నారాయణ్.. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్ లో బి. ఇ పూర్తి చేశారు. ఆ తరువాత అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ లో ఎం.బి.ఏ పూర్తి చేశారు. ఓహయో లోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్ పూర్తి చేశారు.

శంతను 1998లో అడోబ్‌లో ఇంజనీరింగ్ టెక్నాలజీ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్‌గా చేరారు. ఆ తరువాత 2005లో ప్రెసిడెంట్, సీఒఒ బాధ్యతలు స్వీకరించారు. 2007లో సీఈవో, 2017లో బోర్డు ఛైర్మన్ అయ్యాడు. అంతేకాదు.. శంతను యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్‌కి వైస్ చైర్మన్, ఫైజర్ బోర్డులో మెంబర్ కూడా. ఆయన గతంలో డెల్ డైరెక్టర్‌గా పనిచేశాడు. యూఎస్ ప్రెసిడెంట్ మేనేజ్‌మెంట్ అడ్వైజరీ బోర్డులో మాజీ సభ్యుడు కూడా. ఇక అడోబ్‌లో చేరడానికి ముందు, శాంతను యాపిల్ మరియు సిలికాన్ గ్రాఫిక్స్‌లో ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ పాత్రలను నిర్వహించి, ప్రారంభ ఫోటో-షేరింగ్ స్టార్టప్ పిక్ట్రాను సహ వ్యవస్థాపకుడుగా మార్చారు.

ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్.. ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్ సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే సీఈవో బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన స్థానంలో పరాగ్ అగర్వాల్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. సంస్థలో చేరిన పదేళ్ల కాలంలోనే పరాగ్‌ అగర్వాల్‌ ఈ అత్యున్నత పదవిని దక్కించుకోవడం విశేషం. భారత్‌కు చెందిన పరాగ్‌ అగర్వాల్‌ 2005లో బాంబే ఐఐటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీలో 2011లో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో మైక్రోసాఫ్ట్‌, ఏటీ అండ్‌ టీ ల్యాబ్స్‌, యాహూలలో రీసెర్చి చేశారు. 2011లో ట్విటర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరిన పరాగ్‌ అగర్వాల్‌.. 2018లో ట్విటర్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీవో)గా నియమితులయ్యారు. గత పదేళ్లుగా ట్విటర్‌లో పనిచేస్తున్న ఆయన.. ట్విటర్‌ టెక్నికల్‌ స్ట్రేటజీ, మెషిన్‌ లెర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో కంజ్యూమర్‌, రెవెన్యూ, సైన్స్‌ టీమ్స్‌ల బాధ్యతలు చూస్తున్నారు.

సత్య నాదెళ్ల, శాంతను నారాయణ్, సుందర్ పిచాయ్, అరవింద్ కృష్ణ, ఇప్పుడు పరాగ్ అగర్వాల్.. ఇలా భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఐటీ కంపెనీలకు సీఈవోగాలు రాణిస్తూ.. దేశ ఖ్యాతిని మరింత పెంచుతున్నారు. ప్రపంచానికే తమ జ్ఞానాన్ని అందిస్తూ.. తమదైన ముద్ర వేస్తున్నారు.

Also read:

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన పసిడి ధర.. 10 గ్రాములపై ఎంత తగ్గిందంటే..

Twitter Gets New CEO – Parag Agrawal: భార‌తీయుడికి ట్విట్టర్ పగ్గాలు.. సీఈవోగా పరాగ్ అగర్వాల్ బాధ్యతలు..

Health Tips: రోజూ ఇలా బ్రెష్ చేయకుంటే గుండె జబ్బులు తప్పవు.. తాజా పరిశోధనల్లో సంచలనాలు..

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!