ఏఐని నమ్మితే కొంపముంచింది.. మళ్లీ ఇంజనీర్లను ఉద్యోగాల్లోకి తీసుకున్న ఫోర్డ్.. అసలు కథ ఇదే..
ఇప్పుడు ఏఐ యుగం నడుస్తుంది. కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి మనుషులను తీసేసి మరి ఏఐ సాఫ్ట్‌వేర్లను నమ్ముకుంటున్నాయి. కానీ టెక్నాలజీ ఎంత తోపైనా.. మనుషుల అనుభవం ముందు తలవంచాల్సిందే అని నిరూపించింది గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్. కేవలం ఏఐని నమ్మి కార్ల క్వాలిటీ చెకింగ్‌ను అప్పగించినందుకు ఫోర్డ్ కంపెనీ కోట్లాది డాలర్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. చివరికి ఏం చేసిందంటే..?

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ. కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి, మానవ శ్రమను తగ్గించడానికి ఏఐ సాంకేతికతపై విపరీతంగా ఆధారపడుతున్నాయి. అయితే కేవలం ఏఐ నమ్ముకుంటే లాభం లేదు, మనుషుల మేధస్సు, అనుభవమే అన్నింటికంటే మిన్న అని నిరూపించింది ప్రముఖ గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్. కేవలం ఏఐ టెక్నాలజీ మాత్రమే వాహనాలను తయారు చేయడం సాధ్యం కాదని తేల్చేస్తూ.. వందల మంది సీనియర్, అనుభవజ్ఞులైన ఇంజనీర్లను ఫోర్డ్ కంపెనీ తిరిగి విధుల్లోకి తీసుకుంది. టెక్నాలజీ ప్రపంచంలో సంచలనంగా మారిన ఫోర్డ్ తీసుకున్న ఈ యూ టర్న్ నిర్ణయం వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏఐ సిస్టమ్స్ చేసిన బ్లండర్ తప్పులు..
వాహనాల నాణ్యతను పరీక్షించడానికి, ఆటోమేటెడ్ ప్రాసెస్‌లను పర్యవేక్షించడానికి ఫోర్డ్ కంపెనీ పూర్తిగా ఏఐ ఆధారిత క్వాలిటీ సిస్టమ్స్‌పై భారం వేసింది. అయితే ఈ ఏఐ సిస్టమ్స్ వాహనాల ఉత్పత్తికి ముందే గుర్తించాల్సిన అనేక కీలకమైన లోపాలను, సమస్యలను పూర్తిగా పసిగట్టలేకపోయాయి. దీనివల్ల కంపెనీ నాణ్యత ప్రమాణాలు దెబ్బతినడమే కాకుండా భారీ నష్టాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. కేవలం ఏఐ సిస్టమ్స్ మాత్రమే కస్టమర్ల అంచనాలకు తగిన నాణ్యతను అందించలేవని ఫోర్డ్ గుర్తించింది.
రంగంలోకి దిగిన గ్రేబేర్డ్ ఇంజనీర్లు
ఈ సమస్యల నేపథ్యంలో ఫోర్డ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కుమార్ గల్హోత్రా బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ.. తాము ఆటోమేటెడ్ సిస్టమ్స్‌ను అతిగా నమ్మి ఆశించిన ఫలితాలను సాధించలేకపోయామని అంగీకరించారు. దీంతో కంపెనీ అలర్ట్ అయి.. గతంలో ఫోర్డ్‌లో పనిచేసి రిటైర్ అయిన సుమారు 350 మంది సీనియర్ ఇంజనీర్లతో పాటు సప్లయర్స్ దగ్గరున్న నిపుణులను తిరిగి రిక్రూట్ చేసుకుంది. కంపెనీలో వీరిని గౌరవంగా గ్రేబేర్డ్ ఇంజనీర్లు అని పిలుస్తున్నారు. ఈ నిపుణులు ఇప్పుడు విడిభాగాలు తయారవ్వడానికి ముందే వాటి డిజైన్లను, తయారీ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలిస్తూ లోపాలను ముందుగానే గుర్తిస్తున్నారు.
టెక్నాలజీ ఉంది.. కానీ మనుషుల నిర్ణయమే ముఖ్యం..
ఫోర్డ్ వెహికల్ హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ చార్లెస్ పూన్ మాట్లాడుతూ.. ‘‘ఏఐపై మేం చాలా అతిగా ఆశలు పెట్టుకున్నాం. కేవలం డిజైన్ అవసరాలను ఏఐ సిస్టమ్‌కు ఇన్‌పుట్‌గా ఇస్తే చాలు, బెస్ట్ ప్రొడక్ట్ బయటకు వచ్చేస్తుందని భావించాం. కానీ వాహనాల తయారీలో తుది నిర్ణయాలు తీసుకోవడానికి హ్యూమన్ నాలెడ్జ్ ఖచ్చితంగా అవసరమని తర్వాత అర్థమైంది’’ అని చెప్పుకొచ్చారు. అయితే కంపెనీ ఏఐపై పెట్టే పెట్టుబడులను తగ్గించడం లేదు. కాకపోతే ఈ సీనియర్ ఇంజనీర్ల ద్వారా కొత్తగా వచ్చే యువ ఇంజనీర్లకు శిక్షణ ఇప్పిస్తూ, ఏఐ సిస్టమ్స్‌ను మరింత పటిష్టంగా రీట్రైన్ చేయిస్తోంది.
అద్భుత ఫలితాలు.. మిలియన్ల కొద్దీ డాలర్ల పొదుపు..
మానవ మేధస్సును, అత్యాధునిక టెక్నాలజీని కలిపి ఫోర్డ్ చేసిన ఈ ప్రయోగం అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. కంపెనీ సీఈవో జిమ్ ఫార్లీ మాట్లాడుతూ.. సీనియర్ ఇంజనీర్లు తిరిగి రావడం వల్ల వాహనాల నాణ్యత పెరిగిందని, దీనివల్ల వారంటీ, రీకాల్ ఖర్చులు భారీగా తగ్గి, కంపెనీకి వందల మిలియన్ల డాలర్లు ఆదా అయ్యాయని తెలిపారు. అంతేకాదు తాజాగా విడుదలైన J.D. Power Initial Quality Surveyలో మాస్ మార్కెట్ వాహనాల విభాగంలో ఫోర్డ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. సంస్థల్లో మానవ శ్రమను ఏఐ పూర్తిగా భర్తీ చేయలేదు.. కేవలం మానవ సామర్థ్యాన్ని పెంచడానికి మాత్రమే ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుందనే దానికి ఫోర్డ్ సాధించిన విజయమే ఒక ఉదాహరణ.
