Jet Fuel From Food Waste: మిగిలిపోయిన ఆహారంతో విమాన ఇంధనం.. అద్భుత ఆవిష్కరణలో పరిశోధకులు..
Jet Fuel From Food Waste: ఓవైపు రోజురోజుకీ ప్రపంచ వ్యాప్తంగా ఇంధన వినియోగం గణనీయంగా పెరుగుతోంది. పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా ఇంధన ఉత్పత్తి జరగడం లేదు. దీంతో ధరలు పెరగడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి...
Jet Fuel From Food Waste: ఓవైపు రోజురోజుకీ ప్రపంచ వ్యాప్తంగా ఇంధన వినియోగం గణనీయంగా పెరుగుతోంది. పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా ఇంధన ఉత్పత్తి జరగడం లేదు. దీంతో ధరలు పెరగడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా విపరీతంగా పెరుగుతోన్న ఇంధన వాడకం ద్వారా.. కాలుష్యం కూడా పెరుగుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు.. ఆహార వృథా కూడా రోజురోజుకీ పెరుగుతోంది. ఇంట్లో మనం వండుకునే ఆహారపదార్థాల నుంచి హోటళ్లు, మార్కెట్లలో పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు మిగిలిపోతున్నాయి. మరి తరిగిపోతున్న ఇంధన సమస్యకు, పెరిగిపోతున్న ఆహార వృథాతో చెక్ పెట్టవచ్చా అంటే.. అవుననే అంటున్నారు శాస్ర్తవేత్తలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా మరికొన్ని రోజుల్లో ఇది నిజం కానుంది. మిగిలిపోయిన ఆహారాన్ని విమానయాన ఇంధనంగా మార్చడానికి అమెరికా పరిశోధకులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పరిశోధనలు ప్రారంభమయ్యాయి కూడా. ఇలా తయారు చేసిన ఇంధనంతో విమానాల నుంచి విడుదలయ్యే కార్బన ఉద్గారాలతో పాటు, గ్రీన్ హౌజ్ వాయువులను కూడా 165 శాతం తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆహార వ్యర్థాలతో పారఫిన్ అనే ఇంధనాన్ని తయారు చేసే పనిలో పడ్డారు. ఈ ఇంధనాన్ని జెట్ విమానాలకు వినియోగించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. దీనిద్వారా భవిష్యత్తులో అన్ని రకాల విమానాలు ఈ ఇంధనంతో గాల్లోకి ఎగురుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఫాటీ యాసిడ్స్‌తో జెట్ ఇంధనాన్ని తయారు చేయవచ్చని అమెరికా జాతీయ పునరుత్పాదక శక్తి పరిశోధన సంస్థకు చెందిన డెరేక్ వార్డన్ అనే ఇంజనీర్ చెబుతున్నారు. ఇక ఇలా ఆహార వ్యర్థాలతో తయారు చేయనున్న ఇంధనంతో 2023లో సాత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి మొట్టమొదటి సారిగా జెట్ ఫ్లైట్‌పై ప్రయోగించనున్నామని వార్డన్ చెప్పుకొచ్చారు.