చైనా, తైవాన్ మధ్య ముదురుతున్న వివాదం.. దక్షిణ చైనా సముద్రం వేదిక రెండు దేశాల యుద్ధ విన్యాసాలు
ఒకవైపు దక్షిణ చైనా సముద్రం, ఇంకోవైపు మైదాన ప్రాంతాలు, మరోవైపు పర్వత ప్రాంతాల్లో చైనా దూకుడు మీద కనిపిస్తోంది.

ఏనుగంత చైనా. చీమంత తైవాన్. ఏనుగును చీమ చూడటమే కష్టం. గట్టిగా తలెత్తి చూస్తే, ఏనుగు ఆకారానికే చీమ చచ్చిపోతోంది. కానీ చీమ సైజులోని తైవాన్.. ఏనుగు సైజులోని చైనాను వణికిస్తోంది. చైనా తలచుకుంటే గంటలో.. తైవాన్‌ను భస్మం చేయొచ్చు. చైనా బాంబులతో బెదిరించినా, మిసైళ్లతో కవ్వించినా- తైవాన్‌ని కబ్జా చేయలేకపోతోంది.
దక్షిణ చైనా సముద్రం తన జాగీరు చెప్పుకుంటున్న డ్రాగన్.. అక్కడ నౌకలను మోహరించింది. అక్కడనుంచే యుద్ధ విన్యాసాలు చేస్తోంది. పక్కనున్న తైవాన్‌ను బెదరించాలని చూస్తోంది. తన మహాబలగాన్ని చూపిస్తూ తైవాన్‌ను భయపెట్టాలని చూస్తోంది. ఇందులో భాగంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారీ ఎత్తున విన్యాసాలు చేస్తోంది. ఒకవైపు దక్షిణ చైనా సముద్రం, ఇంకోవైపు మైదాన ప్రాంతాలు, మరోవైపు పర్వత ప్రాంతాల్లో చైనా దూకుడు మీద కనిపిస్తోంది. కానీ తైవాన్ ఎక్కడా తగ్గడం లేదు. తైవాన్ సైన్యం కూడా మిలటరీ డ్రిల్స్ నిర్వహించింది. జిన్‌పింగ్‌కు త్సాయ్ ఇంగ్-వెన్ చుక్కలు చూపిస్తామంటున్నారు.
ఇటు భారత్, అటు తైవాన్, ఇతర ప్రాంతాలపై చైనా విరుచుకుపడాలని ఆరాటపడుతోంది. ఇందుకు ఆ దేశం చేసిన మిలటరీ విన్యాసాలు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 2013 నుంచి 2018 మధ్యకాలంలో చైనా 44 మిలటరీ విన్యాసాలు చేపట్టింది. అంటే 2003 నుంచి 2012తో పోల్చితే ఇవి ఏడు రెట్లు ఎక్కువ అని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా దురాక్రమణ ఆలోచనలకు ఇదే తిరుగులేని ఉదాహరణ అంటున్నారు.
అయితే, తైవాన్ భయపడటం లేదు. నీకు సొంత బలం ఉంటే… నాకు స్నేహితుల బలం ఉందని తైవాన్ చెప్పుకుంటోంది. డ్రాగన్ పెత్తనాన్ని ఒప్పుకోబోమని ఈ చిన్న దేశం తెగేసి చెబుతోంది. హాంకాంగ్‌లో చైనా ఎంతటి దురాగతాలు చేస్తోందో తైవాన్ చూస్తోంది. చైనాను కంట్రోల్ చేయకపోతే, తమకు ఈ పరిస్థితి తప్పదని ఈ చిన్న దేశానికి తెలుసు. అందుకే అమెరికాపై తైవాన్ ఆధారపడింది. అగ్రరాజ్యం నుంచి పెద్దఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తోంది.
2020లో అమెరికాతో తైవాన్ 3.6 బిలియన్ పౌండ్ల ఆయుధాల కొనుగోలు ఒప్పందం చేసుకుంది. తొలి ఒప్పందంలో భాగంగా- మూడు వెపన్ సిస్టమ్స్‌తోపాటు ఇతర ఆయుధాల కోసం 1.4 బిలియన్ పౌండ్లు ఖర్చుచేస్తోంది. రెండో ఒప్పందంలో వంద బోయింగ్ హార్పూన్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాకు ఇజ్రాయెల్ ఎలాగో తాము కూడా అలాగే బెస్ట్ ఫ్రెండ్ అవుతామని తైవాన్ ఆశిస్తోంది. తైవాన్ ఆశలకు తగినట్లే అమెరికా ఓ పని చేసింది. ఇప్పటికే తైవాన్ జలసంధి నుంచి దక్షిణచైనా సముద్ర జలాల్లోకి అమెరికా యుద్ధనౌకలు ప్రవేశించాయి. యూఎస్ నేవీ సముద్ర జలాల్లో బాంబులు ఫైర్ చేస్తూ చైనాను హెచ్చరిస్తోంది.
తైవాన్‌ను చూసి చైనా ఇప్పుడు భయపడుతోంది. వణుకుతోంది. ఈ భయాలకు, కంగారుకు కారణం ఒకటే. ఆ కారణం పేరు అణుబాంబు. తైవాన్ అణుబాంబును తయారుచేస్తోందని చైనా గ్రహించింది. ఈ కార్యక్రమాలను వేగవంతం చేసిందని అర్థమైంది. 80వ దశకంలో తైవాన్ న్యూక్లియర్ సైంటిస్ట్. తైవాన్ రహస్యంగా తయారుచేస్తున్న అణబాంబు గురించి అమెరికాకు లీక్ చేశాడు. వెంటనే అమెరికా అతన్ని కాపాడింది. తైవాన్ మీద అగ్రరాజ్యం మండిపడటంతో- అక్కడి న్యూక్లియర్ కార్యకలాపాలు ఆగిపోయాయి. ఆ కథనంతా పుస్తకంగా రాసిన ఈ సైంటిస్ట్ వయసు ఇప్పుడు 73 ఏళ్లు.
ప్రపంచ సూపర్ పవర్ కావాలంటున్న చైనాకు దీటుగా తైవాన్ నిలబడటానికి కారణం- ఆ దేశాధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్-వెన్. 2016లో దేశాధ్యక్షురాలిగా ఆమె పదవీబాధ్యతలు స్వీకరించాక సీన్ మారిపోయింది. తైవాన్ దూకుడు పెరిగింది. డ్రాగన్‌కు నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్‌లో నిలదీయగలిగే దమ్ము తైవాన్‌కు వచ్చిందంటే అందుకు కారణం ఈ మహిళ. ఒకవైపు పరిపాలన. ఇంకోవైపు అవసరమైతే స్వయంగా మిలటరీ డ్రిల్స్ పర్యవేక్షణ. మొత్తానికి చిన్నదేశానికి పెద్ద నాయకులు అయ్యారు. తన మిలటరీకి ధైర్యం నూరిపోశారు. మిన్ను విరిగి మీద పడినా- పోరాడాలని భుజం తట్టారు. దీంతో- తైవాన్ యుద్ధభేరి మోగించింది.
ప్రపంచం మీద పట్టు నిలబెట్టుకోవాలన్న అమెరికన్ ఆకాంక్షను ప్రతిబింబించే మనిషి జో బైడెన్. అందుకే చైనాకు మాటలతో కాకుండా చేతలతో చెక్ పెట్టానికి బైడెన్ టీమ్ స్కెచ్ రెడీ చేసింది. ఇందులో భాగమే తైవాన్ ప్రతినిధికి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. దీనర్థం.. తాము త్వరలో తైవాన్‌ను ఒక స్వతంత్ర, సార్వభౌమ దేశంగా గుర్తిస్తున్నట్లు అమెరికా ప్రకటించబోతోందా..? షీ జిన్‌పింగ్‌కు బైడెన్ తనదైన స్టయిల్‌లో చెక్ పెడతారా అన్నది దక్షిణ చైనాసముద్రం సాక్షిగా… వినిపించబోతున్న సందేశం. అందుకే- బైడెన్ ఏం చేస్తారోనని అటు చైనా.. ఇటు తైవాన్ ఆసక్తిగా, కన్నార్పకుండా, ఓపిగ్గా చూపిస్తున్నాయి. కానీ ఈ లోపు పేలాల్సిన బాంబులు పేలుతూనే ఉంటాయి.
Read Also… కబడ్డీ కోర్టులో షాకింగ్ ఘటన.. కళ్లముందే కుప్పకూలిన ఆటగాడు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో