Shoaib Akhtar: అక్తర్‌కు అవమానం..లైవ్‌ షో మధ్యలోనే బయటకు వెళ్లిపోమన్న హోస్ట్‌.. కారణమేంటంటే..

T20 World Cup: పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌కు తీరని అవమానం జరిగింది. పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ తర్వాత నిర్వహించిన ఓ టీవీ లైవ్‌ షో లో...

Shoaib Akhtar: అక్తర్‌కు అవమానం..లైవ్‌ షో మధ్యలోనే బయటకు వెళ్లిపోమన్న హోస్ట్‌.. కారణమేంటంటే..
Follow us

|

Updated on: Oct 27, 2021 | 7:38 PM

పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌కు తీరని అవమానం జరిగింది. పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ తర్వాత నిర్వహించిన ఓ టీవీ లైవ్‌ షో లో పాల్గొన్న ఈ స్పీడ్‌స్టర్‌ను మధ్యలోనే బయటకు వెళ్లిపోవాలని  ఆదేశించాడు టీవీ హోస్ట్‌. దీంతో నొచ్చుకున్న అక్తర్‌ క్రికెట్‌ విశ్లేషకుడిగా టీవీ ఛానల్‌తో తనకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  అసలేం జరిగిందంటే..టీ 20 వరల్డ్‌ కప్‌లో భాగంగా మంగళవారం న్యూజిలాండ్‌పై 5 వికెట్ల తేడాతో పాక్‌ విజయం సాధించింది. పాక్‌ బౌలర్‌ హరీస్‌ రవూఫ్‌ నాలుగు వికెట్లతో కివీస్‌ పతనంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో పాక్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ అనంతరం పీటీవీ స్పోర్ట్స్‌ హోస్ట్‌ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. డాక్టర్‌ నౌమన్‌ నియాజ్‌ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో అక్తర్‌తో పాటు వీవీయన్‌ రిచర్డ్స్‌, డేవిగ్‌ గోవర్‌, రషీద్‌ లతీఫ్‌, ఉమర్‌ గుల్‌, అకిబ్‌ జావేద్‌, పాక్‌ మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సనా మీర్‌ పాల్గొన్నారు.

అతి తెలివిని ప్రదర్శించొద్దు.. పాక్-కివీస్‌ మ్యాచ్‌పై విశ్లేషణలో భాగంగా అక్తర్‌ పాక్‌ బౌలర్లు హరీస్‌ రవూఫ్‌, షాహిన్‌ అఫ్రీదీ, వారి కోచ్‌లపై ప్రశంసలు కురిపించాడు. దీనికి హోస్ట్‌ నౌమన్ నియాజ్‌ అభ్యంతరం తెలిపారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతర విషయాల గురించి మాట్లాడొద్దని అక్తర్‌ను వారించాడు. ఆ వెంటనే ‘మీరు చాలా దురుసుగా మాట్లాడుతున్నారు. ఇది నాకేమాత్రం నచ్చడం లేదు. అతి తెలివిగా మాట్లాడాలనుకుంటే మీరు షో నుంచి బయటకు వెళ్లిపోండి’ అని అన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన అక్తర్‌ తన మైక్రోఫోన్‌ను అక్కడే వదిలేసి బయటకు వెళ్లిపోయాడు. నౌమన్‌ కనీసం తనను ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ సంఘటనతో షోలో ఉన్న ఇతర కామెంటేటర్లు, క్రికెటర్లు షాక్‌కు గురయ్యారు.

నౌమన్‌ అమర్యాదగా ప్రవర్తించారు.. ఈ విషయంపై ట్విట్టర్‌లో స్పందించిన అక్తర్‌… ‘సోషల్‌ మీడియాలో ఎన్నో వీడియో క్లిప్‌లు కనిపిస్తున్నాయి. వాటిపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. లైవ్‌ మధ్యలో ఉండగానే నౌమన్‌ నాతో దురుసుగా వ్యవహరించాడు. లైవ్‌ మధ్యలోనే నన్ను బయటకు వెళ్లిపొమ్మని హెచ్చరించారు. వీవీయన్‌ రిచర్డ్స్‌, డేవిగ్‌ గోవర్‌ లాంటి దిగ్గజాలు, నా సమకాలీన క్రికెటర్లతో పాటు మిలియన్ల మంది చూస్తుండగా ఆయన నాతో అమర్యాదగా ప్రవర్తించారు. ఇది నాకెంతో ఇబ్బందికరంగా అనిపించింది. నౌమన్‌ తన తప్పును తెలుసుకుని క్షమాపణలు చెబుతాడని, సమస్యను సానుకూలంగా పరిష్కరించుకుందామని ఆశించాను. కానీ నౌమన్‌ అందుకు అంగీకరించలేదు. అందుకే వేరే మార్గం లేక తప్పుకున్నాను’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులు అక్తర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. హోస్ట్‌ దారుణంగా ప్రవర్తించాడని కామెంట్లు పెడుతున్నారు.

Also Read:

క్రికెట్‌లో 132 ఏళ్ల రికార్డు బద్దలకొట్టాడు.. ప్రత్యర్ధులకు భయాన్ని పరిచయం చేశాడు.. మెగా ఆక్షన్‌లోకి.!

Pakistan vs New Zealand: టీ20 వరల్డ్‌కప్‌లో జోరు మీదున్న పాక్.. కివీస్‌పై 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం..

T20 World Cup 2021: ప్రమాదంలో దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ కెరీర్.. చర్యలకు సిద్ధమైన బోర్డు.. ఎందుకంటే?