AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛాంపియన్‌ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి! సైనా నెహ్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్

జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన పీవీ సింధుపై భారత బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ ప్రశంసలు కురిపించారు. గాయాల నుంచి కోలుకుని అద్భుతంగా పుంజుకున్న సింధులో ఇంకా ఎన్నో టైటిళ్లు గెలిచే సత్తా ఉందన్నారు. ఛాంపియన్‌ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని, భారత్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఛాంపియన్‌ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి! సైనా నెహ్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్
Saina Nehwal
SN Pasha
|

Updated on: Jul 20, 2026 | 6:56 PM

Share

జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధుపై మాజీ ప్రపంచ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ ప్రశంసల వర్షం కురిపించారు. గాయాలు, ఫామ్ సమస్యలతో గత కొన్నేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొన్న సింధు తిరిగి అద్భుతంగా పుంజుకోవడం గొప్ప విషయమని కొనియాడిన సైనా, ఛాంపియన్‌ను ఎప్పటికీ తక్కువ అంచనా వేయకూడదు అంటూ ఆమెపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. టోక్యోలో జరిగిన జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ ఫైనల్లో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, జపాన్‌కు చెందిన మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ అకానె యమగుచిని వరుస గేమ్‌లలో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్ తర్వాత సింధుకు ఇదే అతిపెద్ద టైటిల్ కావడం విశేషం. ఈ విజయంతో ఆమె మళ్లీ ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తన సత్తాను చాటుకున్నారు.

ఈ విజయంపై స్పందించిన సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. గత రెండు మూడు సంవత్సరాలు సింధుకు ఎంతో కఠినంగా గడిచాయని, గాయాల నుంచి కోలుకుని మళ్లీ అత్యున్నత స్థాయిలో ఆడటం అంత సులభం కాదన్నారు. అయితే జపాన్ ఓపెన్‌లో ఆమె ప్రదర్శన చూస్తే మునుపటి కంటే దాడి చేసే తీరు మరింత మెరుగైందని పేర్కొన్నారు. అగ్రశ్రేణి క్రీడాకారులను వరుసగా ఓడిస్తూ టైటిల్ సాధించడం సింధు మానసికంగా ఎంత బలంగా తిరిగి వచ్చిందో నిరూపిస్తోందన్నారు. “వయసు పెరిగే కొద్దీ గాయాలు కూడా పెరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఒత్తిడిని అధిగమించి నిలకడగా రాణించడం చాలా కష్టం. కానీ ఈ టైటిల్ సింధుకు తిరిగి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఒకసారి ఛాంపియన్‌గా నిరూపించుకున్న ఆటగాడిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. సరైన అవకాశం వస్తే వారు మళ్లీ అత్యున్నత స్థాయికి చేరుకుంటారు” అని సైనా వ్యాఖ్యానించారు.

ఆగస్టు 17 నుంచి 23 వరకు భారత్‌లో జరగనున్న బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌పై కూడా సైనా ఆశాభావం వ్యక్తం చేశారు. 17 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం సింధు అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, లక్ష్య సేన్ కూడా మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడని, స్వదేశీ అభిమానుల మద్దతుతో భారత ఆటగాళ్లు పతకాల కోసం గట్టి పోటీ ఇవ్వగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. అదే సమయంలో యువ బ్యాడ్మింటన్ క్రీడాకారులు నిలకడైన ప్రదర్శన కనబరిస్తేనే భవిష్యత్తులో ప్రపంచ ఛాంపియన్లుగా ఎదగగలరని సూచించారు. బ్యాడ్మింటన్‌లో స్థిరత్వమే విజయానికి కీలకమని, యువ ఆటగాళ్లు ప్రతి టోర్నీని ఒక అవకాశంగా తీసుకోవాలని సలహా ఇచ్చారు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఈసారి బ్యాడ్మింటన్, హాకీ, షూటింగ్ వంటి క్రీడలు లేకపోవడం బాధ కలిగించిందని సైనా పేర్కొన్నారు. అయినప్పటికీ భారత బృందం అత్యుత్తమ ప్రదర్శన చేసి ఎక్కువ పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కోచింగ్ బాధ్యతలు చేపట్టే విషయంపై ఇప్పుడే నిర్ణయం తీసుకోనని, ప్రస్తుతం యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంపైనే దృష్టి సారిస్తున్నానని ఆమె స్పష్టం చేశారు.

Follow Us