AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: చరిత్రను తిరగరాసిన శ్రీలంక బ్యాటర్.. ఒకే టెస్టులో 3 చారిత్రాత్మక రికార్డులు

Sonal Dinusha: భారత్‌తో కొలంబో టెస్టులో శ్రీలంక యువ బ్యాటర్ సోనల్ దినుష చరిత్ర సృష్టించాడు. ఒకే టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు సాధించి అరుదైన ఘనత అందుకున్నాడు. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మూడు సెంచరీలు చేసిన ప్రపంచంలోని ఎనిమిదో బ్యాటర్‌గా నిలిచాడు. భారత్‌పై ఈ ఫీట్ సాధించిన మూడో శ్రీలంక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

IND vs SL: చరిత్రను తిరగరాసిన శ్రీలంక బ్యాటర్.. ఒకే టెస్టులో 3 చారిత్రాత్మక రికార్డులు
Sonal Dinusha
Rakesh
|

Updated on: Aug 27, 2026 | 7:40 PM

Share

IND vs SL: భారత్‌తో కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక యువ బ్యాటర్ సోనల్ దినుష అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించాడు. ఫాలోఆన్ ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఆడి, ఒకే టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు బాది శ్రీలంకను ఓటమి నుంచి కాపాడాడు. ఈ చారిత్రాత్మక శతకంతో ఆయన క్రికెట్ ప్రపంచంలో 3 అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సోనల్ దినుష ప్రదర్శన అద్భుతమనే చెప్పాలి. గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 100 పరుగులు సాధించి తన తొలి అంతర్జాతీయ టెస్టు సెంచరీని నమోదు చేశాడు. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 84 పరుగులతో రాణించి జట్టు కోసం తీవ్రంగా పోరాడాడు. ఇక కొలంబోలో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగులు చేసిన దినుష, ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్‌లోనూ 133 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ అద్భుతమైన ఆటతీరుతో ఆయన సాధించిన 3 ప్రధాన రికార్డులు క్రీడాభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

భారత్‌పై ఒకే టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన ఆటగాడు

భారత్‌పై ఒకే టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించిన శ్రీలంక బ్యాటర్లలో సోనల్ దినుష మూడో ఆటగాడిగా నిలిచాడు. ఆయన కంటే ముందు 1982లో చెన్నై టెస్టులో దలీప్ మెండిస్ (105, 105) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాదాడు. ఆ తర్వాత 1997లో కొలంబోలోని ఇదే ఎస్‌ఎస్‌సి మైదానంలో అరవింద డిసిల్వా (146, 120) ఈ ఘనత సాధించాడు. దాదాపు 29 ఏళ్ళ తర్వాత మళ్ళీ భారత్‌పై ఈ అరుదైన మైలురాయిని చేరుకున్న శ్రీలంక ఆటగాడిగా దినుష నిలిచాడు.

ఒకే టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు కొట్టిన 8వ శ్రీలంక దిగ్గజం

అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో శ్రీలంక తరఫున ఒకే మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించిన 8వ బ్యాటర్‌గా సోనల్ దినుష చరిత్రకెక్కాడు. గతంలో అరవింద డిసిల్వా (రెండు సార్లు), కుమార్ సంగక్కర (రెండు సార్లు), దలీప్ మెండిస్, అసెంక గురుసింహ, తిలకరత్నే దిల్షాన్, ధనంజయ డిసిల్వా, కమిందు మెండిస్ మాత్రమే ఈ అరుదైన ఫీట్ సాధించారు. ఇప్పుడు వీరి సరసన 2026లో దినుష కూడా చేరి శ్రీలంక క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.

రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3 సెంచరీలు బాదిన ప్రపంచంలోనే 8వ బ్యాటర్

కేవలం రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనే 3 సెంచరీలు సాధించడం సాధారణ విషయం కాదు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3 సెంచరీలు కొట్టిన 8వ బ్యాటర్‌గా దినుష నిలిచాడు. లంక దిగ్గజం అరవింద డిసిల్వా గతంలో 1997లో పాకిస్తాన్‌పై, భారత్‌పై రెండుసార్లు ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత జాక్ కల్లిస్ (2007), హషీమ్ ఆమ్లా (2010), కుమార్ సంగక్కర (2013), యూనిస్ ఖాన్ (2014), మార్నస్ లబుషేన్ (2022), కేన్ విలియమ్సన్ (2024) ఈ రికార్డును నెలకొల్పగా, ఇప్పుడు సోనల్ దినుష (2026) వారి సరసన నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us