AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: మేం చేయాల్సింది చేశాం ?.. కొలంబో టెస్ట్ పై నోరు విప్పిన టీమిండియా కెప్టెన్

IND vs SL: శ్రీలంకతో కొలంబో టెస్టు డ్రాగా ముగియడంపై టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. లంక బ్యాటర్ల పోరాటాన్ని ప్రశంసించిన గిల్, ఫాలోఆన్ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. యువ స్పిన్నర్ మానవ్ సుతార్‌పై ప్రత్యేక ప్రశంసలు కురిపించాడు. డబ్ల్యూటీసీ 2027 ఫైనల్ బెర్త్‌పై భారత్ ధీమాగా ఉందని, రాబోయే సిరీస్‌లలో మెరుగైన ప్రదర్శన చేస్తామని తెలిపాడు.

IND vs SL: మేం చేయాల్సింది చేశాం ?.. కొలంబో టెస్ట్ పై నోరు విప్పిన టీమిండియా కెప్టెన్
Shubman Gill
Rakesh
|

Updated on: Aug 27, 2026 | 7:06 PM

Share

IND vs SL: శ్రీలంకతో కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టులో విజయం సాధిస్తుందనుకున్న టీమిండియా మ్యాచ్‌ను డ్రాగా ముగించాల్సి వచ్చింది. ఆఖరి రోజు లంక దిగువ వరుస బ్యాటర్లు విరోచితంగా పోరాడటంతో భారత్ గెలుపు ఆశలు అడియాసలయ్యాయి. ఈ నిరాశాజనకమైన డ్రా తర్వాత టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మ్యాచ్‌లోని కీలక పరిణామాలపై స్పందించాడు. కొలంబో టెస్టు ఐదో రోజు ఉదయం ఆట ప్రారంభమయ్యే సమయానికి శ్రీలంక వద్ద కేవలం 16 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే ఉండింది. చేతిలో 4 వికెట్లు ఉండటంతో భారత బౌలర్లు త్వరగానే లంక ఇన్నింగ్స్‌ను ముగిస్తారని అంతా భావించారు. అయితే సోనల్ దినుష, కేశర నువంత అద్భుతమైన పట్టుదలతో ఆడి తొలి సెషన్‌లో ఒక్క వికెట్ కూడా పడకుండా అడ్డుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ కార్యక్రమంలో గిల్ మాట్లాడుతూ, “నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో మేము వేరే ఏదీ చేయలేకపోయాం. మూడు రోజుల పాటు మైదానంలో నిరంతరం ఫీల్డింగ్ చేస్తూ బౌలర్లు శాయశక్తులా ప్రయత్నించారు. శ్రీలంక బ్యాటర్లు ఒత్తిడిలో అద్భుతమైన నైపుణ్యం చూపి ఆడి మ్యాచ్‌ను కాపాడుకున్నారు, వారికి కాస్త అదృష్టం కూడా తోడైంది” అని పేర్కొన్నాడు.

మానవ్ సుతార్‌పై ప్రశంసల వర్షం

సిరీస్ ఫలితం అనుకూలంగా రాకపోయినా జట్టులోని సానుకూల అంశాలను గిల్ కొనియాడాడు. ముఖ్యంగా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ బౌలింగ్ శైలిపై కెప్టెన్ ప్రత్యేక ముచ్చటపడ్డాడు. “ఈ సిరీస్ లో దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్‎తో పాటు మానవ్ సుతార్ ఎంతో అద్భుతంగా ఆడాడు. మానవ్ బౌలింగ్ వేసే విధానం, ఆయన వేళ్ళ నుంచి బంతి విడుదలయ్యే తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నిలకడగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసే మానవ్ రాబోయే కాలంలో టీమిండియాకు అత్యంత కీలకమైన బౌలర్‌గా మారతాడు. వేగవంతమైన బౌలర్లు కూడా తమ వంతు కృషి చేశారు” అని గిల్ వెల్లడించాడు.

ఫాలోఆన్ నిర్ణయాన్ని సమర్థించుకున్న కెప్టెన్

తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల భారీ ఆధిక్యం లభించిన తర్వాత శ్రీలంకకు ఫాలోఆన్ ఇవ్వడంపై వస్తున్న విమర్శలను గిల్ కొట్టిపారేశాడు. మైదానంలో ఆ క్షణంలో ఏది సరైన నిర్ణయమనిపిస్తే దాన్నే తీసుకుంటామని చెప్పాడు. “మ్యాచ్ ముగిసిన తర్వాత గత నిర్ణయాల గురించి మాట్లాడటం చాలా సులువు. అయితే ఆ సమయంలో పరిస్థితులకు తగినట్లుగానే మేము ఫాలోఆన్ నిర్ణయం తీసుకున్నాం. కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. ఏది ఏమైనా కొలంబోలో ఒక మంచి మ్యాచ్ జరిగింది, చివరికి టెస్ట్ క్రికెట్ గెలిచింది” అని వివరణ ఇచ్చాడు.

డబ్యూటీసీ ఫైనల్ బెర్త్‌పై చెరగని ధీమా

కొలంబో టెస్ట్ డ్రా కావడంతో డబ్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ విన్నింగ్ పర్సంటేజ్ 51.51 శాతానికి పడిపోయింది. దీనిపై ప్రశ్నించగా గిల్ ఏమాత్రం ఆందోళన చెందలేదు. రాబోయే న్యూజిలాండ్ పర్యటన, ఆ తర్వాత స్వదేశంలో జరిగే సిరీస్‌లలో మెరుగైన ప్రదర్శన చేస్తామని చెప్పాడు. నిలకడైన ఆటతీరును కొనసాగిస్తూ డబ్యూటీసీ 2027 ఫైనల్‌కు కచ్చితంగా అర్హత సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us