AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suryakumar Yadav: కష్టపడుతున్నా.. నా చేతుల్లో ఏముంది బ్రదర్.. సూర్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

Suryakumar Yadav: టీమిండియా టీ20 జట్టులోకి రీఎంట్రీ కోసం సూర్యకుమార్ యాదవ్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తన చేతుల్లో ఉన్న ప్రయత్నాలన్నీ చేస్తున్నానని, ఫలితం అనుకూలిస్తే సరైన దారిలోకి వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2026 టీ20 ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరమైన సూర్యా, కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో తిరిగి చోటు కోసం ఎదురుచూస్తున్నాడు.

Suryakumar Yadav: కష్టపడుతున్నా.. నా చేతుల్లో ఏముంది బ్రదర్.. సూర్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
Suryakumar Yadav
Rakesh
|

Updated on: Aug 28, 2026 | 6:47 AM

Share

Suryakumar Yadav: టీమిండియా టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2026 టీ20 ప్రపంచకప్ అందించిన తర్వాత జట్టుకు దూరమైన సూర్య, మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్లు వెల్లడించారు. మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. టీమిండియాకు 2026 టీ20 ప్రపంచకప్ తిరుగులేని విజయాన్ని అందించడంలో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించారు. మార్చి 8న జరిగిన తుదిపోరు సూర్యా కెరీర్‌లో ఒక కీలక ఘట్టంగా నిలిచిపోయింది. వరల్డ్ కప్ గెలిపించినప్పటికీ వ్యక్తిగతంగా ఆశించిన రీతిలో పరుగులు సాధించలేకపోయారు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో తొలి బంతికే డకౌట్ కావడం అభిమానులను నిరాశపరిచింది. టోర్నీ పొడవునా 9 ఇన్నింగ్స్‌ల్లో 242 పరుగులు మాత్రమే చేసిన ఆయన, పెద్ద మ్యాచ్‌ల్లో విఫలమయ్యారనే విమర్శలు ఎదుర్కొన్నారు.

సూర్యాపై వేటు..శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు

ప్రపంచకప్ ముగిసిన వెంటనే బీసీసీఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. సూర్యకుమార్ యాదవ్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి శ్రేయస్ అయ్యర్‌కు టీ20 జట్టు కళ్లెం అప్పగించింది. దీంతో పాటు నిలకడలేని ప్రదర్శన కారణంగా సూర్యాను టీమిండియా నుంచి పూర్తిగా పక్కన పెట్టక తప్పలేదు. ప్రస్తుతం కొత్త నాయకత్వంలో భారత్ విజయవంతంగా దూసుకెళ్తుండటంతో, తిరిగి సూర్యకుమార్ జట్టులోకి రావడం అంత సులభం కాదనే భావన క్రీడా విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

రీఎంట్రీపై నీలి నీడలు

అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా సూర్యా తన మార్కు బ్యాటింగ్‌ను ప్రదర్శించలేకపోయారు. 13 మ్యాచుల్లో కేవలం 20.76 సగటుతో 270 పరుగులు మాత్రమే చేయగలిగారు. సీజన్ మొత్తం మీద ఆయన బ్యాట్ నుంచి రెండు అర్థశతకాలు మాత్రమే నమోదయ్యాయి. ఈ వరుస వైఫల్యాలు ఆయన రేసులో వెనుకబడేలా చేశాయి. అయితే ఒకప్పటి విధ్వంసకర ఫామ్‌ను తిరిగి సాధించేందుకు ఆయన నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నారు.

కష్టపడుతున్నా.. ఫలితం దేవుడి దయ

ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన సూర్యకుమార్ యాదవ్ తన రీఎంట్రీ పై మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. “నేను నా శాయశక్తులా కష్టపడుతున్నాను. మైదానంలో చేయాల్సిన ప్రయత్నాలు ఏవీ వదలకుండా చేస్తున్నాను. అంతా అనుకూలిస్తే అవే సరైన దారిలోకి వస్తాయి” అంటూ నమ్మకమైన వ్యాఖ్యలు చేశారు. కష్టపడటం మాత్రమే తన చేతుల్లో ఉందనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు. సూర్యకుమార్ యాదవ్ ఎంతటి అద్భుతమైన ఆటగాడో గడిచిన కొన్నేళ్ళలో నిరూపితమైంది. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆయనలో ఉన్న కసి తగ్గలేదనడానికి ఈ మాటలే నిదర్శనం. రాబోయే దేశవాళీ సిరీస్‌లలో సూర్యా ఇచ్చే ప్రదర్శనే ఆయన రీఎంట్రీని ఖరారు చేయనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us