రూ.18.55 కోట్లతో భారీ రైతుబజారు..! ఎక్కడంటే..?
రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలిచే మోడల్ రైతుబజారు నిర్మాణానికి మంత్రి నారా లోకేశ్ శ్రీకారం చుట్టారు. అరబిందో ఫార్మా సీఎస్‌ఆర్ నిధులు రూ.18.55 కోట్లతో 5.90 ఎకరాల్లో మార్కెట్ నిర్మించనున్నారు. ఆధునిక సౌకర్యాలతో హోల్‌సేల్, రిటైల్ దుకాణాలు, కోల్డ్ స్టోరేజ్, వెజిటబుల్ వాష్ ఏరియా, క్యాంటీన్, మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి సదుపాయాలు కల్పించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రత్యేకంగా నిలిచేలా మంగళగిరిలో ఆధునిక మోడల్ రైతుబజారు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంగళగిరి–నిడమర్రు రోడ్డులో ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. అరబిందో ఫార్మా సీఎస్‌ఆర్ నిధులు రూ.18.55 కోట్లతో 5.90 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేశ్ గురువారం భూమిపూజ చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి రైతుబజారు నిర్మాణ నమూనాలను పరిశీలించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
71,925 చదరపు అడుగుల్లో నిర్మాణం
పర్యావరణహితంగా, ఆధునిక సౌకర్యాలతో రైతుబజారును నిర్మించనున్నారు. మొత్తం 71,925 చదరపు అడుగుల విస్తీర్ణంలో మార్కెట్ భవనాలు, విక్రయ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. రైతులకు, వ్యాపారులకు, వినియోగదారులకు అనువుగా హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లను ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు.
రిటైల్ మార్కెట్‌లో 216 దుకాణాలు
రిటైల్ విభాగంలో 102 కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. పండ్లు, పూల విక్రయాల కోసం మరో 54 దుకాణాలు, ఇతర వస్తువుల కోసం 60 దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో వినియోగదారులకు ఒకే ప్రదేశంలో వివిధ రకాల నిత్యావసరాలు లభించే అవకాశం ఉంటుంది.
హోల్‌సేల్ మార్కెట్‌కు ప్రత్యేక వసతులు
హోల్‌సేల్ మార్కెట్‌లో కూరగాయలను దించేందుకు 18 ప్లాట్‌ఫాంలు, విక్రయాల కోసం 23 దుకాణాలు నిర్మించనున్నారు. రైతులు తమ ఉత్పత్తులను సులభంగా తరలించి విక్రయించుకునేలా మార్కెట్ రూపకల్పన చేస్తున్నారు.
కోల్డ్ స్టోరేజ్, పార్కింగ్ సదుపాయాలు
రైతుబజారులో కోల్డ్ స్టోరేజ్, వెజిటబుల్ వాష్ ఏరియా, అడ్మినిస్ట్రేషన్, మెయింటెనెన్స్ విభాగాలతో పాటు క్యాంటీన్, మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నారు. సరుకుల రవాణా వాహనాలతో పాటు ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో అరబిందో ఫార్మా ట్రస్ట్ ప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికారులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, తితిదే పాలకవర్గ సభ్యులు, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
